ఆరడుగుల రాకెట్టు.. అదిరిపోయే జాకెట్టు!

కాలంతో సంబంధం లేకుండా ఫ్యాషన్స్‌లో కుర్రకారుని కట్టిపడేసేది ఏదైనా ఉందంటే.. అది జాకెట్‌! బైక్‌పై రయ్‌!! మని దూసుకెళ్తున్నా.. రాయల్‌గా లెదర్‌ కట్‌ షూ వేసి నడిచి వెళ్తున్నా.. జాకెట్‌ ధరిస్తే ఆ లుక్కే వేరు! యువత ఆసక్తుల్లో మారనిది అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇదే. హుషారుగా దూసుకెళ్లే నైట్‌ రైడింగ్‌లోగానీ..

Published : 01 Feb 2020 01:22 IST

కాలంతో సంబంధం లేకుండా ఫ్యాషన్స్‌లో కుర్రకారుని కట్టిపడేసేది ఏదైనా ఉందంటే.. అది జాకెట్‌! బైక్‌పై రయ్‌!! మని దూసుకెళ్తున్నా.. రాయల్‌గా లెదర్‌ కట్‌ షూ వేసి నడిచి వెళ్తున్నా.. జాకెట్‌ ధరిస్తే ఆ లుక్కే వేరు! యువత ఆసక్తుల్లో మారనిది అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇదే. హుషారుగా దూసుకెళ్లే నైట్‌ రైడింగ్‌లోగానీ.. ర్యాంప్‌ వాక్‌లోగానీ.. మీదైన స్టైల్‌ని చూపించేలా జాకెట్‌ని ధరించాలంటే? ఇవిగోండి కొన్ని ట్రెండీ జాకెట్‌ వేర్స్‌. చూడ్డానికి కొన్ని ఉన్నితో తయారు చేసిన స్వెటర్స్‌లా అనిపించినా జాకెట్‌ స్టైల్‌లోనే ముస్తాబవుతున్నాయి.
ఆర్నాల్డ్‌లా అదుర్సే!
ఎప్పుడైనా ‘బైకర్‌ జాకెట్స్‌’ నంబర్‌ వన్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌. టెర్మినేటర్‌ సినిమాలో ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ ఈ జాకెట్‌ వేసుకుని అలా బైక్‌ నడుపుతున్న లుక్‌కి యువతంతా ఫిదా.. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్‌ తిరిగొచ్చింది. చిన్న చిన్న మెరిసే పాకెట్స్‌, జిప్స్‌, లూప్స్‌తో మ్యాన్లీ లుక్‌ ఇస్తాయీ జాకెట్లు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసే వారికి మంచి ఛాయిస్‌. దుమ్ము, ధూళి నుంచి రక్షించడమే కాకుండా స్టైలిష్‌గానూ కనిపిస్తారు.


మగమహారాజులా..

శీతల ప్రాంతాల్లో చలిని తట్టుకునేందుకు గానీ.. మగమహారాజులా స్టైల్‌ని ప్రదర్శించేందుకుగానీ.. ‘టర్టిల్‌ నెక్‌ జాకెట్‌’లు ప్రయత్నించొచ్చు. ఎప్పుడో జమానాలో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఈ జాకెట్‌లే మళ్లీ మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవి అటు మోడ్రన్‌ లుక్‌కి, ఇటు ఫార్మల్‌ లుక్‌కి మధ్యలో ఉంటాయి. విందులు, విహారయాత్రలకు వెళ్లే సమయంలో చక్కని ఎంపిక. నలుపు, బూడిద, తెలుపు, నీలం రంగుల్ని ఎంచుకోవచ్చు.


స్వెటర్‌లా అల్లినవి..

వెచ్చగా ఉండేందుకు టీషర్టుల్లా వేసుకునే స్వెటర్‌లు వాడే ఉంటారు. వాటి స్థానంలో ఇప్పుడు ఉన్నితో తయారు చేసిన ‘నిట్‌వేర్‌ జాకెట్‌లు’ యువతని ఆకట్టుకుంటున్నాయి. కొందరు వీటిని వారికి నచ్చినట్లుగా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. వీటిల్లో కాస్త వదులుగా ఉండే ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు. ఒకవేళ మీరు ఎత్తుగా ఉండి నిట్‌వేర్‌ జాకెట్‌ ధరిస్తే.. స్కార్ఫ్‌ను ప్రయత్నించండి. అదిరే లుక్‌ మీ సొంతమవుతుంది.


అన్ని కాలాల్లోనూ..

చూడటానికి వదులుగా, తక్కువ బరువుంటాయి కార్డిగిన్‌ జాకెట్‌లు. చలి కాలంలోనే కాదు, ఇతర సీజన్స్‌లోనూ ఈ జాకెట్‌లు ప్రయత్నించొచ్చు. నలుపు టీ షర్ట్‌తో పాటు నలుపు జీన్స్‌ వేసి బయట ఈ కార్డిగిన్‌ జాకెట్‌ వేస్తే ఆ లుక్కే వేరు. విదేశాల్లో ఎప్పటి నుంచో ఈ ట్రెండ్‌ హల్‌ చల్‌ చేస్తోంది. అనేక రకాల రంగుల్లో మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.


గో విత్‌.. గోధుమ రంగు

జాకెట్‌ అంటే.. ఎక్కువగా గుర్తొచ్చేది గోధుమ రంగే. ఇదొక క్లాసిక్‌ కలర్‌. దేనిపైన అయినా మ్యాచింగ్‌ అయ్యేందుకు అనువైన కలర్‌. అందులోనూ రస్టీ బ్రౌన్‌ (ముదురు గోధుమ) మరింత ట్రెండీ లుక్‌ ఇస్తుంది. గోధుమ లెదర్‌ జాకెట్‌ లేదా ఫేక్‌ లెదర్‌ జాకెట్ల్‌ు మార్కెట్‌లో మీ బడ్జెట్‌ని ఆధారంగా ఎంచుకోవచ్చు. ఎత్తు ఎక్కువగా ఉన్నవారు భిన్నమైన లుక్‌తో కనిపించేందుకు ‘బాంబర్‌ జాకెట్‌’లను ప్రయత్నించొచ్చు.


* ఈ జాకెట్స్‌ని అమ్మాయిలూ ప్రయత్నించొచ్చు. వారివారి అభిరుచులకు తగినట్టుగా ఉండే డిజైన్స్‌ ఎంచుకోవచ్చు.


* డెనిమ్‌, లెదర్‌, కార్‌డ్రై, కాటన్‌ జీన్స్‌ ఇలా అన్ని రకాల మెటీరియల్స్‌లో ఈ జాకెట్లు లభిస్తున్నాయి. వారివారి ఆసక్తిని బట్టి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవచ్చు
* ఈ జాకెట్లు ఎంచుకునే ముందు మీ ఎత్తు, బాడీలాంగ్వేజ్‌ బట్టి ఎంచుకోండి. హిప్‌ వరకూ ఉండే జాకెట్‌ మంచిది.
* నలుపు, తెలుపు, గోధుమ, ఆకుపచ్చ, క్రీమ్‌, మెరూన్‌.. ఇలా చాలా రకాల రంగుల్లో  ఇవి లభ్యమవుతాయి.

 


రవి అవ్వారు
ఫ్యాషన్‌ డిజైనర్‌, అవ్వారు డిజైన్స్‌



 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని