Updated : 11 Dec 2021 11:15 IST

కల్యాణం..  వైభోగమే!!

బాలీవుడ్‌ జంట విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ల ప్రేమ గుట్టుగా సాగినా.. పెళ్లి మాత్రం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. వివాహానికి వడ్డించే పదార్థాల నుంచి వేడుక జరిగే రాచకోట దాకా అంతా ఆర్భాటమే. ఆ వైభోగం.. ప్రేమ.. పెళ్లి ముచ్చట్లు ఇవి.

* ప్రేమ: కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ మధ్య ఏదో నడుస్తోంది అని 2019లో కరణ్‌ జోహార్‌ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో మొదటిసారి బయటికొచ్చింది. ఆ షోలో కరణ్‌ ‘నీ తర్వాత చిత్రంలో ఎవరితో కలిసి నటించాలనుకుంటున్నావ్‌?’ అని అడిగినప్పుడు ఠక్కున కౌశల్‌ పేరు చెప్పి, తనంటే ఇష్టమంది కత్రినా. తర్వాత ఈ జంట ఎన్నో పార్టీలు, బాలీవుడ్‌ కార్యక్రమాలకు కలిసి పాల్గొన్నారు. అయినప్పటికీ చివరిదాకా మేం జస్ట్‌ ఫ్రెండ్స్‌ అని మాత్రమే చెబుతూ వచ్చారు.

* పెళ్లి: హిందూ, ముస్లిం మతాచారాల ప్రకారం మూడురోజులపాటు ఈ పెళ్లి జరిగింది. డిసెంబరు 6న విక్కీ ఇంట్లో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు మొదలయ్యాయి. తర్వాత సంగీత్‌, మెహిందీ, పెళ్లి కార్యక్రమాలు నిర్వహించారు. మెహిందీ వేడుక కోసం 20 కేజీల ఆర్గానిక్‌ మెహిందీని తెప్పించారు. ఈ వేడుకలకు కౌశల్‌ కుటుంబ సభ్యులు, బంధువులు హజరవగా.. కైఫ్‌ తల్లి సుజానే టర్కోట్‌, చెల్లెళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

* విక్కీ కన్నా కత్రినా ఆరేళ్లు పెద్ద. కోహ్లి-అనుష్క శర్మ జంటని ‘విరుష్క’ అని పిలిచినట్టే ఇప్పుడంతా ఈ జంటని ‘విక్‌ట్రినా’, ‘వికాట్‌’ అంటున్నారు. ఈ పెళ్లి కోసం కత్రినా పాలనురగలాంటి తెల్లని రఫుల్‌ చీరలో ముస్తాబవుతోంది. దీన్ని ప్రముఖ డిజైనర్‌ అర్పితా మెహతా డిజైన్‌ చేసింది.

* వేదిక: ఈ భారీ వేడుక కోసం రాజస్థాన్‌లోని మాధోపూర్‌ జిల్లాలో ఉన్న భర్వారా కోటలోని ‘సిక్స్‌ సెన్సెస్‌’ స్టార్‌ హోటల్‌లో వేదిక ఏర్పాటు చేశారు. రాజస్థానీ రాచకుటుంబీకులు ఈ కోటను పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారు. పదేళ్లపాటు శ్రమించి, ఆధునిక వసతులు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది హోటల్‌గా మలిచారు. ఇందులో 48 వన్‌ బెడ్‌రూం సూట్‌లు ఉన్నాయి.

* ఫొటోల్లేవు: ఈ వేడుకలో ఫొటోలు నిషిద్ధం. దీనికోసం ప్రత్యేకంగా ‘షాదీ స్క్వాడ్‌’ని నియమించారు. ఈ సిబ్బంది అతిథులు, బంధువులు ఎవరినైనా క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. కనీసం సెల్ఫీలు కూడా తీసుకోవడానికీ అనుమతించరు. పెళ్లికి హాజరయ్యే అతిథుల నుంచి ఫొటోలు, వీడియోలు లీక్‌ చేయమని ముందస్తుగా ఒప్పంద పత్రంపై సంతకం కూడా చేయించుకున్నారట. ఎందుకంటే ఈ మొత్తం పెళ్లి వీడియో హక్కులను ఒక ఓటీటీ ప్లాట్‌ఫాం రూ.100 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్‌.

* సందడే సందడి: ‘తేరీ ఓరే..’, ‘కాలా చస్మా..’, ‘నాచ్‌దే నే సారే..’ పాటలకు కొత్త జంట నృత్యం చేశారు. దీనికోసం కరణ్‌ జోహార్‌, ఫరాఖాన్‌లు ప్రత్యేకంగా నృత్యరీతులు సమకూర్చారు. గుర్దాస్‌ మన్‌, శంకర్‌ మహదేవన్‌, ఎహ్‌సాన్‌ నూరానీలు.. గీతాలాపనలతో అలరించారు.

* మెనూ: రాచకోటలో జరిగే ఈ పెళ్లి వేడుకలో వడ్డించిన పదార్థాలు కూడా రాయల్‌గానే ఉన్నాయి. కచోరీలు, దహీ భల్లా, ఫ్యుజన్‌ చాట్‌, పాన్‌, గోల్‌గప్పా, కెబాబ్‌, ఫిష్‌ ప్లాటర్‌, దాల్‌ బాటీ చుర్మాలు.. కొన్ని ఫుడ్‌ ఐటెమ్స్‌ మాత్రమే. ‘వికాట్‌’ అని రాసిన భారీ టిఫానీ వెడ్డింగ్‌ కేక్‌ కూడా ప్రత్యేకంగా చేయించారు. ఈ మెనూ మొత్తం చూసుకోవడానికి ఇటలీ నుంచి ఓ పేరు మోసిన చెఫ్‌ని తీసుకొచ్చారు.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు