సినిమాలే.. తగ్గేదేలే!

కొత్తదనానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి మరీ చేరదీస్తారు యూత్‌. అన్నింట్లో అప్‌డేట్‌ కాకపోతే మేం అసలు ఈతరమే కాదని ఫీలైపోతారు. అలాంటి యాటిట్యూడ్‌ ఉన్నోళ్లని మీకు వినోదం పంచే సాధనాలేంటని అడిగింది  ‘స్టాటిస్టా’. వాళ్లేం చెప్పారు?

Published : 29 Jan 2022 00:40 IST

కొత్తదనానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి మరీ చేరదీస్తారు యూత్‌. అన్నింట్లో అప్‌డేట్‌ కాకపోతే మేం అసలు ఈతరమే కాదని ఫీలైపోతారు. అలాంటి యాటిట్యూడ్‌ ఉన్నోళ్లని మీకు వినోదం పంచే సాధనాలేంటని అడిగింది  ‘స్టాటిస్టా’. వాళ్లేం చెప్పారు?

చిత్రాలే సమస్తం

సరదాలు తీర్చడానికి ఎన్ని గ్యాడ్జెట్లున్నా, రోజుకో కొత్త ఆవిష్కరణ వస్తున్నా.. ఇప్పటికీ యువతకు వినోదం పంచుతున్న వాటిలో ముందున్నవి సినిమాలేనట. కరోనా పుణ్యమాని థియేటర్లు వెలవెలబోతున్నా.. ఇంటింటా ఓటీటీల జోరు ఎక్కువ కావడంతో ఈ చిత్రాల మోజు మరింత ఎక్కువైంది. వీళ్లని రంజింపజేయడానికి మన భారతీయ భాషలన్నింటిలో కలిపి ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మిస్తున్నారు మరి.

సంగీతం, నృత్యం..

మ్యూజిక్‌ వింటూ మైమరిచిపోవడం.. స్టెప్పులేస్తూ కేరింతలు కొట్టడం.. భారతీయ యువతకి అలవాటే. అందుకే మనోళ్లకి వినోదం పంచుతున్న జాబితాలో వీటిది ద్వితీయ స్థానం. సంగీతంలో పాప్‌, ఫోక్‌, క్లాసిక్‌, వెస్ట్రన్‌.. అన్నీ ఉన్నాయట. భారతీయ మ్యూజిక్‌ రంగం వ్యాపారం ఏడాదికి 18వేల కోట్లుగా ఉందంటేనే అది మన జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకొనిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

క్రీడారంగం

క్రికెట్‌ని ఓ మతంలా భావించే మన దేశంలో కుర్రకారుకి ఎంటర్‌టైన్‌మెంట్‌లా నిలుస్తూ క్రీడారంగం మూడోస్థానంలో ఉంది. ఇందులోనూ అత్యధిక వాటా క్రికెట్‌దే. టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, హాకీలు తర్వాత స్థానాల్లో ఉన్నాయంటోంది స్టాటిస్టా. ఐపీఎల్‌-2021కి 27 కోట్ల వీక్షణలు వచ్చాయంటే.. ఈ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతోంది.

బెట్టింగ్‌..

మనం నమ్మినా, నమ్మకపోయినా.. క్రీడల్లో బెట్టింగ్‌ని మనవాళ్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారన్నది వాస్తవం. ఇందులోనూ ఈ మూడేళ్లలోనే ఆన్‌లైన్‌ స్పోర్ట్‌ బెట్టింగ్‌ ఐదింతలు పెరిగిందట. డబ్బులు కోల్పోతున్నా, సంపాదిస్తున్నా.. బెట్టింగ్‌ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావిస్తున్నారు మనవాళ్లు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని