ఇది కొవర్జిన్ కాలం గురూ!
‘ఫస్ట్‌వేవ్ నన్నేం చేయలేదు. సెకండ్‌లో నా దగ్గరికే రాలేదు. థర్డ్ వచ్చి వెళ్లినా నన్ను ముట్టుకునే ధైర్యం చేయలేకపోయింది. నేను కొవర్జిన్‌ని మామా..’ కాలేజీ ఓ కుర్రాడు.. స్నేహితుడితో గర్వంగా చెప్పిన మాట ఇది. ఇలాంటి ముచ్చట్లు ఈమధ్యకాలంలో...
‘ఫస్ట్‌వేవ్ నన్నేం చేయలేదు. సెకండ్‌లో నా దగ్గరికే రాలేదు. థర్డ్ వచ్చి వెళ్లినా నన్ను ముట్టుకునే ధైర్యం చేయలేకపోయింది. నేను కొవర్జిన్‌ని మామా..’ కాలేజీ ఓ కుర్రాడు.. స్నేహితుడితో గర్వంగా చెప్పిన మాట ఇది. ఇలాంటి ముచ్చట్లు ఈమధ్యకాలంలో చాలానే వినపడుతున్నాయి. మనకి వర్జిన్ అంటే తెలుసు. కొవర్జిన్ అంటే ఏంటి అనే సందేహం వచ్చేసింది కదూ! మరేం లేదు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కరోనా బారిన పడనివాళ్లే కొవర్జిన్స్. మిలీనియల్స్ నిఘంటువులోకి ఈమధ్యే ఎక్కేసిందీ పదం. ప్రేమ, పెళ్లి, బ్యాచిలర్, బ్రొమాన్స్‌లాగే.. అందరి నోళ్లలో నానుతోంది. అన్నట్టు ఇందులో రకరకాల స్థాయిలు, హోదాలున్నాయి.
అసలైన కొవర్జిన్: కుటుంబం, స్నేహితులంతా వైరస్ బారిన పడ్డా.. ఇంతవరకు ఒక్కసారి కూడా కరోనా సోకని అమ్మాయి/అబ్బాయిలే ‘ఇన్విన్సిబుల్ కొవర్జిన్’ అన్నమాట. ఇంతమందిలోనూ కొవిడ్ అంటుకోలేదంటే.. మాకు ప్రత్యేకమైన అతీంద్రియ శక్తులున్నాయని వీళ్లు విర్రవీగుతుంటారు. కాలేజీ కుర్రాళ్లు, ఉద్యోగుల్లో ఈ సూపర్ పవర్ ఉన్నవాళ్లు ఎందరో.
లెక్కచేయని కొవర్జిన్: ఈపాటికే కరోనా వచ్చే ఉంటుంది. అయినా దాంతో పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. అందుకే నేను టెస్ట్‌లకే వెళ్లను’ అని మొండికేసే బాపతు. ఇతరుల దృష్టిలో కొవిడ్ సోకలేదు కాబట్టి వీళ్లూ కొవర్జిన్‌గానే చలామణి అయిపోతుంటారు.
అనుమానపు కొవర్జిన్: కరోనా రాకున్నా నాకు వచ్చిందేమో అని నిత్యం సందేహించే కుర్రాడే ‘పారనాయిడ్ కొవర్జిన్’. అనుమానంతో అస్తమానం ఆసుపత్రికి వెళ్లి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లు చేయించుకుంటాడు. కిట్లు కొని ఇంట్లోనే సొంత పరీక్షలు చేస్తాడు. ఏమీ లేకపోయినా కరోనా తగ్గించే మాత్రలు మింగేస్తుంటాడు.
మూర్ఖపు కొవర్జిన్: కొవిడ్ నాకు రానే రాదు. నన్నేం చేయదు అని అతి ఆత్మవిశ్వాసంతో తిరిగేవాళ్లు ‘కొవిడియట్ కొవర్జిన్’. వీళ్ల తీరు భిన్నం. మాస్కులు పెట్టరు. పరీక్షలకు వెళ్లరు. భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు పాటించరు.
ట్రెండింగ్‌లో..
* కొవర్జిన్ టీషర్టులు విపణిలోకి వచ్చేశాయి. కుర్రకారు వాటిపై తామెలాంటి కొవర్జినో స్వయంగా ముద్రించుకొని ఆ నినాదాలతో చెలరేగిపోతున్నారు.
* సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే కొవర్జిన్లు తమ ‘స్టేటస్’ని ఘనంగా చాటుకుంటున్నారు. వాట్సప్ డీపీ, ఫేస్‌బుక్ కవర్ ఫొటో, ట్విటర్ బయో.. అన్నిచోట్లా ఇదే ట్రెండు.
* ఈ కొవర్జిన్ ధోరణి మీద స్టాండప్ కామెడీ షోలు కూడా మొదలయ్యాయి. స్టాండప్ కమెడియన్లు ఇదే అంశం చుట్టూ సరదా కథలు అల్లుతున్నారు.
* కొవర్జిన్ కథాంశంతో యూట్యూబ్‌లో బోలెడు లఘుచిత్రాలొచ్చాయి. ‘అయామ్ కొవర్జిన్’కి అవార్డు కూడా వచ్చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.