అందం యావ.. తగ్గుతోంది..

కళ్లకు కాటుక, కనురెప్పలకు మస్కారా.. అద్దితేనే కాలు బయట పెట్టే అమ్మాయిలు.. అధరాలకు లిప్‌స్టిక్‌, ముఖానికి ఫేస్‌క్రీమ్‌ రాయకుండా ఉండలేని మగువలు. ఫేస్‌ సీరమ్‌లు.. కన్సీలర్లు.. మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌లు..

Updated : 30 Jul 2022 10:24 IST

ట్రెండింగ్‌

ళ్లకు కాటుక, కనురెప్పలకు మస్కారా.. అద్దితేనే కాలు బయట పెట్టే అమ్మాయిలు.. అధరాలకు లిప్‌స్టిక్‌, ముఖానికి ఫేస్‌క్రీమ్‌ రాయకుండా ఉండలేని మగువలు. ఫేస్‌ సీరమ్‌లు.. కన్సీలర్లు.. మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌లు.. సన్‌స్క్రీన్‌లు.. రోజువారీ వాడకం చేసుకున్న పడతులు. ఇవన్నీ సాధారణమేగా. కానీ ఈమధ్యకాలంలో ట్రెండ్‌ మారుతున్నట్టే ఉంది. సోసోగా ఉన్నా సోకులకు వచ్చిన ఇబ్బందేమీ లేదంటున్నారు. అద్దకాలు తగ్గించి సహజంగా ఉంటేనే అందమంటున్నారు అతివలు. ఏంటీ మార్పు అంటే ‘స్కినిమలిజమ్‌’ అన్నది సమాధానం.

స్కిన్‌, మినిమలిజమ్‌ కలయికే స్కినిమలిజమ్‌. ఈ ధోరణి ఎలా మొదలైందంటే.. కాలాన్ని ఓ రెండేళ్లు వెనక్కి తిప్పాల్సిందే. అప్పుడంతా కరోనా కాలం. కాలేజీ పేరెత్తని విద్యార్థినులు, ఆఫీసు వదిలేసి వర్క్‌ ఫ్రం హోం అన్న యువతులు. ఇంట్లోనే కాలం గడిచిపోతుంటే సోకులకు అవకాశమే చిక్కేది కాదు. అప్పుడు చాలామంది మేకప్‌లు పట్టించుకోవడమే మానేసిన సందర్భం. అద్దం ముందుకు అరుదుగా వెళ్తూ చల్‌నేదోయార్‌ ఏదోలా లాగించేద్దాం.. అన్నట్టుగా ఉండేవారు. కాసులకు కటకట ఏర్పడటంతో అప్పుడు పొదుపు బాట పట్టి సౌందర్యోత్పత్తులను పక్కన పెట్టిన వారూ లేకపోలేదు. అక్కడి నుంచే ఈ స్కినిమలిజమ్‌ మొదలైంది. ఆ సమయంలోనే సినిమా తారలు సైతం ‘నో మేకప్‌ సెల్ఫీ’లంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేశారు. ఆ ప్రభావమూ కొంత తోడై ట్రెండ్‌ జోరందుకుంది.
దీనికితోడు రసాయనాల మిశ్రమాలుండే సౌందర్యోత్పత్తులను అధికంగా వాడటం చర్మానికి హానికరం అనే ప్రచారం ఎప్పటినుంచో ఉండనే ఉంది. వెరసి స్కినిమలిజమ్‌కి ఓటేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. దాంతో మేకప్‌ మెరుపుల కన్నా సాయిపల్లవిలా సహజమైన అందంతో ఉందాం అనుకునేవాళ్లు ఎక్కువవుతున్నారు. ఇక సొగసు మహరాణుల్లో అత్యధికులు పట్టణాలు, నగరాలు, మెట్రోల్లోనే కొలువుదీరి ఉంటారు. వాళ్లకే స్కినిమలిజమ్‌ స్పృహ అధికంగా ఉండటంతో పెద్దఎత్తున ఆచరించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ధోరణిపై ముంబయి కాస్మటాలజిస్ట్‌ స్మితా యాదవ్‌ మాట్లాడుతూ.. ‘మల్టీ లేయర్‌ మేకప్‌లతో తాత్కాలికంగా అందం పెరగొచ్చుగానీ.. దీర్ఘకాలంలో చర్మం నిర్జీవమవుతుంది. ముడతలు పడుతుంది. ఇదికాకుండా అత్యధికుల్లో ముఖంపై చిన్న మరక, మచ్చ, ఎరుపుదనం, కమిలిపోయనట్టుండటం.. లాంటి ఏదో ఒక వంక ఉంటూనే ఉంటుంది. క్రమంగా అది వాళ్లు తెలుసుకుంటున్నారు. తమను మార్చుకుంటున్నారు. క్లెన్జర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీమ్‌లాంటి కొద్ది సౌందర్యోత్పత్తులతోనే సర్దుకుంటున్నారు’ అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని