Updated : 30 Jul 2022 06:52 IST

మగానుభావుల ముద్దుముచ్చట్లు!

అమ్మాయి, అబ్బాయి మధ్య ముద్దులాట ముచ్చటగానే ఉంటుంది. అది నాలుగ్గోడల మధ్య ఉన్నంతవరకే సుమా! మురిపెం బహిరంగమైతే.. ముచ్చట రచ్చగా మారిపోతుంది.

ఆ చుంబనానికి దిగింది ఏ నాయికానాయకులో అయితే.. ప్రచారం రసకందాయంలో పడుతుంది. ఈమధ్యకాలంలో సీన్‌ ఇక్కడితోనే ఆగిపోవడం లేదండోయ్‌! ఆమె, అతడు కాకుండా.. అతగాడు, ఇతగాడు అధర సయ్యాటకి దిగుతూ పెద్ద దుమారమే రేపుతున్నారు.

ధోరణికి తెర తీసిన హీరో రణ్‌వీర్‌సింగ్‌. ‘83’ సినిమా ప్రచారంలో భాగంగా లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ని అధర చుంబనంతో బంధించేశాడు. అవాక్కవడం వీక్షకుల వంతైంది. అభిమానం ఉంటే చేతులు కలపడమో.. హుందాగా హగ్‌ ఇవ్వడమో చేయాలిగానీ.. ఇదేం పాడు పని అక్కడే గుసగుసలాడారు చాలామంది. ఈ వివాదంపై రక్తి కట్టించే మీమ్స్‌, నవ్వు పుట్టించే కామెంట్లు ధారావాహికల్లాగే నడిచాయి. అయినా ఎవరేమనుకున్నా పట్టించుకునే రకం కాదుగా రణ్‌వీర్‌డు. ఈ దృశ్యకావ్యం జనం మస్తిష్కాల్లోంచి కనుమరుగు కాకముందే మన ‘లైగర్‌’ విజయ్‌ దేవరకొండ రంగంలోకి దిగాడు. బలశాలి.. మైక్‌ టైసన్‌కి, ప్రియ దర్శకుడు పూరీ జగన్నాధ్‌కి ముద్దెట్టేశాడు. ఈ చుంబనంలో ఘాటుతనం లేకపోవడంతో అది బ్రొమాన్సే తప్ప రొమాన్స్‌ కాదని అంతా తీర్మానించేశారనుకోండి! ఆపై బాలీవుడ్‌ బాబు రణ్‌బీర్‌కపూర్‌ మొదలెట్టేశాడు. ఓ అవార్డుల ప్రదానోత్సవంలో నటుడు ఆదిత్యరాయ్‌ కపూర్‌ని గట్టిగా ఆలింగనం చేసుకొని బుగ్గపై ముద్దు జారవిడిచాడు. తొమ్మిదేళ్ల క్రితం ఈ ఇద్దరు హీరోలు ఓ చిత్రంలో కలిసి నటించారు. బహుకాలం తర్వాత ఒకే వేదికపైకి రావడంతో ఒళ్లు మరిచి అత్యుత్సాహం చూపించుకున్నారని కొందరు వాదిస్తే.. ‘యే జవానీ మే హై దివానీ’ అంటూ ఫొటోకి ట్వీట్లు జత చేసి పోటెత్తారు కుర్ర జనం. మగానుభావుల ఈ కౌగిలింతలు, ముద్దూమురిపాల వెనక ఏదైనా చిత్రమైన కథ ఉన్నా, లేకపోయినా ఈ సరసం ప్రచారపర్వం కోసమేనని సీరియస్‌గా వాదించేవాళ్లే అధికం. ఏదేమైతేనేం.. హద్దులు దాటిన ముద్దులాటలు ఇప్పుడు మీడియాకు ముడిసరుకై కూర్చున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని