వయసు ముదిరినా.. సొగసుగా!

వయసు ముదిరిన అమ్మాయిలు అందంగా కనిపించాలని తపించడం.. ప్రౌఢలూ కుమారిలా పోజు కొట్టడం సహజమే. అలా ఉండాలంటే కొన్ని కిటుకులు పాటించాల్సిందే. ఇవిగోండి ఆ చిట్కాలు.

Published : 01 Oct 2022 00:46 IST

వయసు ముదిరిన అమ్మాయిలు అందంగా కనిపించాలని తపించడం.. ప్రౌఢలూ కుమారిలా పోజు కొట్టడం సహజమే. అలా ఉండాలంటే కొన్ని కిటుకులు పాటించాల్సిందే. ఇవిగోండి ఆ చిట్కాలు.

* నలుపు వద్దు: కొందరికి నలుపంటే తగని మక్కువ. ముఖ్యంగా తెల్లగా ఉండే అమ్మాయిలు ఈ రంగులో సొగసుగా కనిపిస్తారనడంలో సందేహం లేదు. అలాగని తల నుంచి పాదాల దాకా నలుపు ధరిస్తే చర్మంపై చిన్నపాటి ముడతలు, నల్లని వలయాలు ఏమున్నా స్పష్టంగా కనిపిస్తాయి.
* వదులు ఉండొద్దు: కొంచెం లావైతే కవర్‌ చేయడానికి పెద్ద సైజు దుస్తుల్లోకి మారిపోతుంటారు అమ్మాయిలు. కానీ వీటితో పెద్ద వయస్కుల్లా కనిపిస్తారనే విషయం మర్చిపోవద్దు. దుస్తుల పరిమాణం మరీ ఎక్కువొద్దు.
* స్కర్టులకు దూరం: చాలామందికి స్కర్టులు ధరించడం ఇష్టం. అందులో మెలికలు తిరిగి ఉండే పొడవాటి స్కర్టులకు దూరంగా ఉండాలి. ఇది నడుము నుంచి కింది భాగాన్ని పూర్తిగా కప్పేయడంతో చూసేవాళ్లకు లావుగా ఉండి కవర్‌ చేస్తున్నారు అనే భావన కలుగుతుంది. స్కర్టు ధరించాల్సి వస్తే కనీసం కాలి మడమలైనా కనిపించేవి ఎంచుకోవాలి.

* కళ్లద్దాలు: స్టైల్‌, సౌకర్యం కోసం కళ్లద్దాలు వాడటం ఈ రోజుల్లో మామూలే. అయితే పల్చటి లోహపు ఫ్రేమ్‌వి.. వెడల్పు, పొడవైన కళ్లద్దాలు అమ్మమ్మలకు సరిపోయేలా ఉంటాయి. వయసును ఎక్కువ చేసి చూపిస్తాయి.
* పాదరక్షలు: ఎంత మంచి డ్రెస్‌ వేసినా దానికి తగ్గట్టుగా పాదరక్షలు ఎంచుకోకపోతే అంతా వృథానే. బొద్దుగా ఉన్న అమ్మాయిలకు నలుపు రంగు, ఎత్తు హీల్స్‌ బాగోవు. కాన్వాస్‌ షూలు, నియాన్‌ రంగులు సైతం వయసు ఎక్కువగా చూపిస్తాయి. స్లిమ్మర్‌ షూలు, సాదాసీదా కన్వర్జెస్‌ బాగుంటాయి.
* స్కార్ఫ్‌: స్కార్ఫ్‌లు కట్టుకోవడం ఫ్యాషనే అయినా ఇవి అందరికీ నప్పవు. మెడలో వేసుకునేవి అయితే కొంచెం ఫర్వాలేదుగానీ తలకు చుట్టుకుంటే బామ్మలా కనిపిస్తారు. ఇందులోనూ సిల్క్‌ స్కార్ఫ్‌లకు దూరంగా ఉండాలి.
* దుస్తులు: కుర్రతనం ఉట్టిపడాలని ముప్ఫైల్లో ఉన్నా ఫ్రాక్‌లు వేస్తామంటే కుదరదు. హుందాగా ఉండాల్సినచోట టీనేజీ దుస్తులు ధరిస్తే బాగోదు. వయసుకి తగ్గవి ఎంచుకుంటూనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని