క్యాట్‌వాక్‌లతో కోట్ల విరాళాలు

తెరపై సొగసులు ఆరబోయడం.. కాసులు వెనకేసుకోవడం.. కథానాయికలు అంటే ఇంతేకాదండోయ్‌. వాళ్లకీ మంచి మనసుంటుంది.

Updated : 22 Apr 2023 00:43 IST

తెరపై సొగసులు ఆరబోయడం.. కాసులు వెనకేసుకోవడం.. కథానాయికలు అంటే ఇంతేకాదండోయ్‌. వాళ్లకీ మంచి మనసుంటుంది. పేరు, పరపతి ఉపయోగించి అప్పుడప్పుడు అవసరాల్లో ఉన్నవారికి సాయపడుతుంటారు. తారలు అచ్చంగా చేసే ఇలాంటి భారీ కార్యక్రమమే ‘మెట్‌ గాలా’. ఏటా వందల కోట్ల విరాళాలు సేకరించే ఈ ఈవెంట్‌కి, ఈసారి బాలీవుడ్‌ భామ అలియాభట్‌ వెళ్తోంది. డిజైనర్‌ దుస్తుల్లో మెరిసిపోతూ అక్కడ క్యాట్‌వాక్‌ చేయనుంది.

ఏంటీ మెట్‌ గాలా?: మెట్‌ గాలా.. ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో ఒకటి. న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌లో ఏటా నిర్వహిస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తారలు ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి హొయలు ఒలకబోస్తుంటారు.

మనవాళ్ల హవా: ఈ కార్యక్రమానికి బాగా పేరున్న కొద్దిమంది సెలెబ్రిటీలకే ఆహ్వానం అందుతుంది. గతంలో భారత్‌ నుంచి ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణెలు ఈ షోలో పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా 2017, 2018, 2019, 2021 సంవత్సరాల్లో ప్రఖ్యాత డిజైనర్‌ రాల్ఫ్‌ లారెన్‌, డయర్‌ బ్రాండ్‌ దుస్తులు ధరించి ఆకట్టుకుంది. మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపిక పదుకొణె 2017, 2018లలో ఈ అవకాశం దక్కించుకుంది. ప్రియాంక.. మెటాలిక్‌ గౌన్‌, థై హై స్లిట్‌ లాంగ్‌ గౌను, బుర్గుండీ వెల్వెట్‌ గౌన్లతో అలరించగా.. దీపిక పాలనురగలాంటి స్ట్రాపీ సాటిన్‌ థై స్లిట్‌ వీ నెక్‌లైన్‌ గౌను, షోల్డర్‌ బ్లూమ్‌ ఎరుపు రంగు గౌనులతో చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇప్పుడు అలియాభట్‌ ఎలాంటి మెరుపులతో ఆకట్టుకుంటుందో అన్నది సస్పెన్స్‌. తనకి ప్రముఖ నేపాలీ-అమెరికన్‌ డిజైనర్‌ ప్రబల్‌ గురుంగ్‌ దుస్తులు రూపొందిస్తున్నాడు. మే 1న ఈ షో మొదలవనుంది.

విరాళాలు ఇలా: ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్లు, గాయకులు, మోడళ్లు, ఫొటోగ్రాఫర్లు, వ్యాపారవేత్తలకు ఈ షోలో పాల్గొనడానికి ఆహ్వానం అందుతుంది. ఒక్కో టికెట్‌ ధర రూ.28లక్షలు. మొత్తం టేబుల్‌ని బుక్‌ చేసుకోవాలి అంటే దాదాపు రూ.కోటిన్నర ముట్టజెప్పాలి. అలా 2021లో ఈ కార్యక్రమం ద్వారా రూ.137 కోట్లు సేకరించారు. ఈ డబ్బును యూనిసెఫ్‌కి అనుబంధంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ఇతర ఎన్జీవోలకు అందజేస్తారు. సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని