ఫోమో బెంగ వదిలెయ్‌..జీవితాన్ని సరిచెయ్‌!

క్లాస్‌రూమ్‌.. బాత్రూమ్‌.. ఆఫీసు.. అర్థరాత్రి.. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, వేళ ఏదైనా పదేపదే మనసు సెల్‌ఫోన్‌లోకి తొంగి చూస్తుందా? పక్క ప్రపంచంలో ఏం జరుగుతుందో అని గాబరా పడిపోతున్నారా? మరి ఆ హడావుడికి, ఆందోళనకి కారణం ఏంటో తెలుసా? ఫోమో! నవతరాన్ని ..

Published : 18 Jan 2016 20:11 IST

ఫోమో బెంగ వదిలెయ్‌..జీవితాన్ని సరిచెయ్‌!


* కేక పుట్టించే సంగతి తెలిసింది...
ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసేదాకా మనసాగదు!

* క్లాస్‌మేట్‌ ఫొటో పెట్టింది...
అందరికన్నా ముందే లైక్‌ కొట్టాలి!

* సోషల్‌మీడియా కొత్త ఆప్‌ వచ్చిందట...
డౌన్‌లోడ్‌ చేసేసి ఫీచర్లేంటో చూడాలి!

* బాస్‌తో వేడివేడి మీటింగ్‌. మధ్యలో ఫోన్‌ వైబ్రేషన్‌...
ఎవరో? ఏంటో? రిప్లై ఇస్తే బాగుణ్ణు!
- క్లాస్‌రూమ్‌.. బాత్రూమ్‌.. ఆఫీసు.. అర్థరాత్రి.. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, వేళ ఏదైనా పదేపదే మనసు సెల్‌ఫోన్‌లోకి తొంగి చూస్తుందా? పక్క ప్రపంచంలో ఏం జరుగుతుందో అని గాబరా పడిపోతున్నారా? మరి ఆ హడావుడికి, ఆందోళనకి కారణం ఏంటో తెలుసా? ఫోమో! నవతరాన్ని గుప్పెట్లో పెట్టుకున్న ఓ జాడ్యం! పూర్తి పేరు ‘ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట’!! యువతని కలవర పెడుతున్న నయా ధోరణి... ఏంటీ భావన? ఎందుకీ వేదన? లక్షణాలేంటి? లక్షణంగా బయట పడేదెలా? నిపుణుల్ని సంప్రదించింది ఈతరం. బయట పడే మార్గం చూపారిలా...

 

కుర్రాడు, కుర్రది.. పొద్దున బెడ్‌ దిగగానే స్మార్ట్‌ఫోన్‌ని తడుముతున్నారు. అందరికీ తెలిసిన సంగతే! తర్వాత మెసేజ్‌లు, బెస్టీలతో బాతాఖానీలు. అందాకైతే ఓకే. మార్నింగ్‌ ఏడుతో మొదలై.. మిడ్‌నైట్‌ పన్నెండైనా పదేపదే అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లతో సావాసం చేస్తుంటే అదే ఫోమో!

ఎందుకిలా అంటే...

క్షణం వదిలితే ఏదో మిస్‌ అవుతాం అన్న బెంగ. పరుగు పందెంలో వెనకపడిపోతాం అనే కంగారు. ఫ్రెండ్‌ ఫొటోకి అన్ని లైక్‌లు వచ్చాయి. నాకేం తక్కువ? ఆమె పోస్ట్‌ని అంతా షేర్‌ చేసుకున్నారు. నేనామాత్రం చెప్పలేనా? ఇలా వూహించుకోవడం.. ఉడుక్కోవడం ఫోమో లక్షణాలే. ఈ మాయాజాలంలో పడ్డవాళ్ల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. తాము వెనకపడొద్దనే ఆతృత అనుక్షణం వూహా ప్రపంచంలో విహరించేలా చేస్తుంది. సొంత వ్యక్తిత్వానికి ముసుగేసుకొని స్మార్ట్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు, ఆన్‌లైనే లోకంగా గడిపేస్తుంటారు. నిమిషంలో ముప్ఫైసార్లు ఫోన్‌ని చెక్‌ చేసుకోవడం. భిన్నంగా ఉండాలనే తపనతో రాత్రంతా కష్టపడైనా వెరైటీ కాన్సెప్ట్‌తో ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేయడం. ఒళ్లు గగుర్పొడిచే వీడియోనైనా సరే వాట్సప్‌లో పంపించడం. ట్రాఫిక్‌లో చిక్కుకున్నా ఫోటోలు షేర్‌ చేసేయడం.. ఒకటేమిటి? వాళ్లకి మిగతావేం పట్టవు. అత్యవసర పనులు పెండింగ్‌ పడినా డోన్ట్‌కేర్‌. చదువూగిదువూ జాన్తా నహీ. ఆఖరికి సరదాలు, పార్టీల్లో కూడా అన్యమనస్కమే. సినిమాలు, షికార్లలో భౌతికంగా ఉన్నా వేళ్లు మొబైల్‌ను తడుముతూ ఉండాల్సిందే. అదే పనిగా ల్యాప్‌టాప్‌, మొబైళ్లలోనే తలలు దూరుస్తుంటారు. గుట్టలకొద్దీ వచ్చిపడుతున్న ఆప్స్‌, వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ఈ-కామర్స్‌ కంపెనీలు ఇచ్చే ఆఫర్లు సైతం యథాశక్తి యువతని ఈ మత్తులో ముంచెత్తుతున్నాయి. వీరికిక పరిసరాలు సైతం పట్టవు. ఇంటికి సన్నిహితులొచ్చినా సమయాన్ని కేటాయించలేరు. చదువులో మార్కులు తగ్గుతున్నా పుస్తకం పట్టుకోలేరు. ప్రయాణంలోనైనా కిటికీలోంచి చూడరు సరికదా, సాటి ప్రయాణికులతో మాటామంతీ సైతం ఉండవు. ఫలితంగా... అడుగడుగునా జీవనసౌందర్యాన్ని కోల్పోతున్నారు! సమూహంలో ఉంటూనే ఒంటరులుగా మిగిలిపోతున్నారు!!

పోనీ అంతలా టెక్‌సావీ అవుతున్నా వీరు సాధిస్తున్నదేంటి? కలిగే సంతృప్తి ఏంటి? వచ్చిన లాభం ఏంటి? పొందిన గౌరవం ఏంటి? లెక్కలేస్తే శూన్యం. పైపెచ్చు పరుగులో వెనకబడ్డాం అనే ఆలోచన మనసులోకి దూరిందా? ఇక అంతే సంగతులు. మనసు మనసులో ఉండదు. ఆపుకోలేని ఆందోళన. ఎంతకీ ఎడతెగని వేదన. కంటి మీద కునుకుండదు. చేసే పనిపై ధ్యాస పెట్టరు. ముదిరితే ఓ ఫోబియాగా మారొచ్చు. మానసిక సమస్యలూ తథ్యం. సోషల్‌ బిహేవియరే కాదు వ్యక్తిగతంగానూ తీవ్ర ప్రభావాలుంటాయి. విద్యార్థుల, ఉద్యోగుల పనితనం దెబ్బతింటుంది. టీనేజీ వయస్కులైతే ఆన్‌లైనే లోకంగా ఎదిగి అంతర్ముఖులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ భావననే ‘సోషల్‌ అన్‌హెడోనియా’అంటారు సైకాలజీ ప్రొఫెసర్‌ డా.వీరజారావు. ఇంతేకాదు చిన్నచిన్న సమస్య ఎదురైనా ఇలాంటి వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. చిన్న రిస్క్‌ తీసుకోవడానికైనా భయపడుతుంటారు. బంధాలు, అనుబంధాలు ప్రేమ విషయాల్లోనూ వైఫల్యమే ఎదురవుతుంది. కష్టాలకు ఎలా స్పందించాలో తెలియదు. కుటుంబాల్లో కలతలు రేగే ప్రమాదం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ముందు దీని వల్ల నష్టాలు గ్రహిస్తే, తమను తాము నియంత్రించుకోడానికి చక్కని సూచనలు చేస్తున్నారు నిపుణులు.


మనని ఆపరేట్‌ చేయొద్దు 

సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌.. మరో పరికరం మన అవసరం కోసం తయారు చేసుకున్నవి. వాటిని మనం ఆపరేట్‌ చేయాలే తప్ప మనని అవి ఆపరేట్‌ చేసే స్థాయికి దిగజారొద్దు. రోజూ కొత్తకొత్త ఆప్స్‌, గ్యాడ్జెట్స్‌ వస్తుంటాయి. ఆన్‌లైన్‌లో ఎడతెగని చర్చలు నడుస్తుంటాయ్‌. వీటికి ఆరంభమే తప్ప అంతం ఉండదు. ఈ మిథ్యా ప్రపంచంలో సంతృప్తి అన్న పదానికి చోటుండదు. మీకిష్టమైన సంగీతం, వ్యాయామం, మరో వ్యాపకంలో నిజమైన ఆనందం దొరుకుతుంది.

 

- డా.వీరజారావు,
సైకాలజీ ఫ్యాకల్టీ, ఉస్మానియా యూనివర్సిటీ

చిన్నచిన్న జాగ్రత్తలతో ఫోమో నుంచి బయట పడొచ్చు అంటున్నారు మానసిక విశ్లేషకులు.

* రోజంతా ఆన్‌లైన్‌లో గడిపినా అందర్నీ సంతృప్తి పరచలేమనే విషయం తెలుసుకోవాలి

* సమయం తినేసే వెబ్‌సైట్లు తెరవొద్దు. అత్యధిక ఫీచర్లున్న ఫోన్లకు బదులు పాత మోడళ్లే వాడటం ఉత్తమం

* మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి క్షణం విలువైందే... అని మననం చేసుకుంటూ ఉండాలి.

 

* స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఆన్‌లైన్‌ స్నేహాల కన్నా బంధాలు, అనుబంధాలు, కుటుంబం శాశ్వతం.

* మనసును చికాకు పెట్టే ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్లు, ట్విట్టర్‌ ట్వీట్స్‌ ఆఫ్‌లో పెట్టేయండి.

* గ్యాడ్జెట్ల అధిక వాడకంతో టెక్‌సావీలు అవుతారేమోగానీ తెలివితేటలు తగ్గే ప్రమాదముందని అనేక సర్వేల్లో నిరూపితమైంది

* క్రమకమంగా సమయం తగ్గిస్తూ రోజుకి ఇంత సమయమే కేటాయించాలనే నియమం పెట్టుకోవాలి.

* గిట్టనివాళ్లు, ఎక్స్‌ లవర్స్‌, పోటీదారుల్ని ఆఫ్‌లైన్‌లో పెట్టేయాలి. పాజిటివ్‌గా స్పందించేవాళ్లకే ఫ్రెండ్స్‌ జాబితాలో చోటివ్వాలి

* అద్భుతాలు.. సరదాలు.. అన్నీ బయటే ఉంటాయి. ఫోమోకి బదులు జోమో (జాయ్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌)ని డెవలప్‌ చేసుకోవాలి

* ఒక గంట, రోజు, వారం.. గ్యాడ్జెట్‌కి విరామమిస్తే జీవితంలో వూహించని మార్పులొస్తాయి.

* ముల్లును ముల్లుతోనే తీయాలి. BreakFree, Moment, RescueTime, SelfControl ఆప్స్‌ ఫోన్‌, ల్యాపీల్లో నిక్షిప్తం చేసుకుంటే వృథా సమయాన్ని అరికట్టడమెలాగో సలహాలిస్తాయి

* స్మార్ట్‌ఫోన్‌లో సోషల్‌ మీడియా ఆప్స్‌ వెంటనే తొలగించండి

* గ్యాడ్జెట్స్‌ని దూరంగా పెట్టే డిజిటల్‌ డిటాక్స్‌ క్యాంప్స్‌, క్యాంప్‌ గ్రౌండెడ్‌ కార్యక్రమాల్లో సేదతీరండి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని