బ్రెయిన్‌కేషన్‌ గురూ...ఉత్సాహం షురూ!

చదువు, ఎగ్జామ్స్‌ బోర్‌ కొడితే... పద మామా వెకేషన్‌కి వెళ్లొద్దాం అంటాం... తీరికలేని ఉద్యోగం యమా సతాయిస్తే... తలకు మించిన భారమైనా ఏదో టూర్‌కి సిద్ధమవుతాం... వీకెండ్‌లో పనితో...

Published : 18 Jan 2016 20:19 IST

బ్రెయిన్‌కేషన్‌ గురూ...ఉత్సాహం షురూ!


చదువు, ఎగ్జామ్స్‌ బోర్‌ కొడితే... పద మామా వెకేషన్‌కి వెళ్లొద్దాం అంటాం... తీరికలేని ఉద్యోగం యమా సతాయిస్తే... తలకు మించిన భారమైనా ఏదో టూర్‌కి సిద్ధమవుతాం... వీకెండ్‌లో పనితో వీక్‌ అయినా... పద గురూ పార్టీ చేసుకుందాం అనే ఫ్రెండ్స్‌ బోలెడు... మరి అలసిసొలసిన తనువులకేనా ఆటవిడుపు? విశ్రమించని మెదడుకి విరామం అక్కర్లేదా?? అంటే ఆ మురిపెం తీర్చడానికే బ్రెయిన్‌కేషన్‌ మొదలైంది... విదేశాల్లో పాపులరైన ట్రెండ్‌ ఇప్పుడు ఇండియాలోనూ సందడి చేస్తోంది... ఇంతకీ దీని అవసరమేంటి? సంగతులేంటి? నిపుణులు చెబుతున్నారిలా... 

మొన్న చంద్రయాన్‌తో చెలరేగిపోయాం. నిన్న మంగళయాన్‌తో కీర్తిని అంతరిక్షం దాకా తీసుకెళ్లాం. ఆ మాటకొస్తే టెక్నాలజీ ఇస్రో ఇంజినీర్లకో, శ్రీహరికోట సైంటిస్టులకో సొంతం కాదు మేమూ టెక్‌సావీలమే అంటోంది యూత్‌. స్మార్ట్‌ఫోన్‌ 

విడవని చేతులు. ఆన్‌లైన్‌లో గంటలకొద్దీ గడిపే యువతే దీనికి సాక్ష్యం. కానీ ఏదైనా మితంగా ఉంటేనే సమ్మతం. అతి అయితేనే చిక్కులు. కానీ కుర్రకారు ఆ లక్ష్మణరేఖ ఎప్పుడే దాటేశారు. అందుకే ఆ టెక్నాలజీ మెదళ్లను ఛిద్రం చేస్తోంది. ఒత్తిళ్లను టోకుగా అందిస్తోంది. ఫలితం.. శారీరక సమస్యలు. బోనస్‌గా మానసిక ఆందోళనలు. ఈ చిక్కులకు మందుబిళ్లలా పనిచేసేదే బ్రెయిన్‌కేషన్‌.

అంతర్జాలం లేకుండా బతగ్గలమా? టెక్నాలజీ వాడకుండా ఉండగలమా? మౌస్‌ పట్టడం చేతనైన ఎవరికైనా ఇదే సందేహం. నిజమే. అయినా అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిగా మారమని చెప్పదు బ్రెయిన్‌కేషన్‌. మోతాదు మించినపుడు లేపనం రాయడానికి కాస్త విరామమివ్వమంటుంది. ఓ సర్వే ప్రకారం ఇండియన్‌ యూత్‌ రోజుకి నూటా ఎనభైసార్లు స్మార్ట్‌ఫోన్‌ని తడుముతున్నారట. సగటున రెండు గంటలు ఫేస్‌బుక్‌లోనే మకాం. టీనేజీ కుర్రకారైతే సందేశాల బట్వాడాకే రోజుకి గంట కేటాయిస్తున్నారు. సినిమా టిక్కెట్టు కొనాలన్నా.. కరెంటు బిల్లు కట్టాలన్నా.. ఆఖరికి అండర్‌వేర్‌ కొనాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే పరిస్థితి. ఇక కంప్యూటర్లతో కాపురం వెలగబెడుతూ ఉద్యోగాలు చేసే యువోద్యోగులకు ఎలాగూ తప్పదు. పార్టీలు, రెస్టరెంట్లలోనూ గ్యాడ్జెట్స్‌ గోలే. కాలేజీ కుర్రకారు సావాసాలు మరిచి టెంపుల్‌రన్‌లు, క్యాండీక్రష్‌ సాగాలతో స్నేహం చేసేస్తున్నారు. ఇలా గ్యాడ్జెట్స్‌ని ఇబ్బడిముబ్బడిగా వాడేసి ఇబ్బందుల పాలయ్యే కుర్రకారుకే బ్రెయిన్‌కేషన్‌.

తిగా వాడినోళ్లకి విసుగొచ్చేసింది. చూసినోళ్లకి చిరాకేసింది. అందుకే గ్యాడ్జెట్స్‌కి టాటా చెప్పేసి బ్రెయిన్‌కేషన్‌కి చలో అనే కుర్రకారు సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్‌ హలోలకు బై చెప్పేసి పక్కనే ఉన్నవాళ్లని పలకరించే పనిలో పడుతున్నారు. ఆన్‌లైన్‌ ఆటలు ఆపేసి నిజమైన సయ్యాటలకు దిగుతున్నారు. ఇరుకు గదుల ముచ్చట్లు ఆపేసి నచ్చిన హాలీడే స్పాట్‌కి వెళ్లిపోతున్నారు. టెక్నాలజీ అతివాడకం ఆపాలని మనసులో ఉన్నా ఫెవికాల్‌లా అతుక్కుపోయే యావ ఉన్నవాళ్లకి వాటిని వదిలించడానికి ‘ఫ్రీడమ్‌’, ‘సెల్ఫ్‌ కంట్రోల్‌’ ‘బీఆర్‌బీ’ పేరుతో ఆప్స్‌ కూడా వచ్చేశాయ్‌.

ఇంతకీ బ్రెయిన్‌కేషన్‌తో ఒరిగేదేంటి? అంటే చాలానే చెబుతారు విశ్లేషకులు. బ్రెయిన్‌కేషన్‌తో మెదడు చురుకుదనం పెరుగుతుంది. టెక్ట్స్‌ నెక్‌ నొప్పులు, ఐపాడ్‌ షోల్డర్‌ బాధలు, బ్రెయిన్‌ ఓవర్‌లోడ్‌ సిండ్రోమ్‌.. ఇలా విచిత్రమైన టెక్నాలజీ రోగాలకు చెక్‌ పెట్టొచ్చు. మానసిక ఒత్తిళ్లు, కోపం, చికాకు తగ్గుతాయి. నిద్రలేమి, హార్ట్‌ బర్నింగ్‌ ఇబ్బందుల నుంచి ఉపశమనం. భావోద్వేగాలపరంగా, మానసికంగా రిలీఫ్‌. చెప్పుకుంటూ పోతే చిట్టా అనంతం. అందుకే ఎక్కడో ఉన్న చిలిపి నేస్తంతో గంటలకొద్దీ చాట్‌ చేయడం ఆపి పక్కనే ఉన్న ప్రియురాలి కళ్లలోకి చూసి మాట్లాడితే వచ్చే కిక్‌ కోసం తపిస్తున్నారు. ముఖం తెలియని ఫ్రెండ్‌తో బాతాఖానీలు వదిలేసి మిత్రుడితో కరచాలనం చేస్తూ మనసు విప్పి మాట్లాడుతూ సేదతీరుతున్నారు. కొత్త గ్యాడ్జెట్స్‌ ప్రత్యేకతల గోల మాని ఏ కొత్త చోటులో సేద తీరితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు యువత.

సంబంధాలు మెరుగవుతాయి

టెక్నాలజీ అతివాడకంతో మానసిక, శారీరక అనర్థాలూ ఎక్కువే. వీటి మోజులో పడి ఆకలి, నిద్ర స్నానం కూడా మర్చిపోయే యూత్‌ చాలామంది. ఫ్రెండ్స్‌ ఏ మెసేజ్‌ పెట్టారు.. ఫలానా అమ్మాయి ఏం ఫొటో పెట్టింది. మన పోస్ట్‌కి ఎలాంటి రిప్లై ఇచ్చింది.. ఎప్పుడూ ఇవే ఆలోచనలు. చాటింగ్‌ తాలూకు లవ్‌ ఎఫైర్స్‌, ఫ్రెండ్షిప్‌ తగాదాలు, వాదోపవాదాలు దాని తాలూకు ప్రభావాలు, భావోద్వేగాలు నిద్రపోయినా నిరంతరం పనిచేస్తునే ఉంటాయి. దీనివల్ల మైండ్‌పై ఒత్తిడి పడుతుంది. బ్రెయిన్‌ వెకేషన్‌తో దీన్ని కట్టడి చేయొచ్చు. మామూలు సెలవుల్లా కాకుండా దీనికి రోజూ సమయం కేటాయించాలి. ఎప్పుడు, ఎలా అనేది ఎవరికివారే నిర్ణయించుకోవాలి. యంత్రాల వాడకం ఆపి కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసిపోతే సంబంధాలు మెరుగుతాయి. 

- డా.టి.ఎస్‌.రావు, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌

శారీరక, మానసిక లాభాలు
  యంత్రాల అతివాడకంతో మనిషికి ఎనలిటికల్‌, లాజికల్‌గా ఆలోచించడం తగ్గిపోతోంది. మెదడుకి విశ్రాంతి లేకపోవడంతో న్యూరాన్స్‌లో కదలికలు తగ్గి చురుకుదనం తగ్గుతోంది. గ్యాడ్జెట్స్‌, ఆన్‌లైన్‌తో జీవితం సుఖమయమైనా, మానసిక ఒత్తిళ్లూ పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించాలంటే మెదడుకు విరామం ఇవ్వాల్సిందే. యువతతో పాటు పిల్లలకూ బ్రెయిన్‌కేషన్‌ అవసరమే. దీంతో మానసిక హాయితోపాటు ఒబేసిటీ, గ్లూకోజ్‌ లెవెల్స్‌ పెరిగిపోవడం, స్పాండిలైటిస్‌, లోయర్‌ బ్యాక్‌ ప్రాబ్లెమ్స్‌లాంటి శారీరక సమస్యల్నీ దూరం చేయొచ్చు. 

- నల్లమోతు శ్రీధర్‌, టెక్నాలజీ నిపుణుడు, కంప్యూటర్‌ ఎరా ఎడిటర్‌

ప్యాకేజీలున్నాయ్‌..
  టెక్నాలజీలో ముందున్న అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో బ్రెయిన్‌కేషన్‌ ­పు మీదుంది. ఈ సేవల్ని అందించడానికి సంస్థలు పుట్టుకొచ్చాయి. డిజిటల్‌ డైట్‌, డిస్‌కనెక్టింగ్‌, డిటాక్సింగ్‌, అన్‌ప్లగ్గింగ్‌.. పేరుతో ప్యాకేజీలందిస్తున్నాయి. వీటిలో పాల్గొనేవారు తమ సెల్‌ఫోన్‌, ల్యాపీలాంటి గ్యాడ్జెట్లను హోటళ్లలోనే వదిలేయాలి. ఆపై కుకింగ్‌ క్లాసులు, చేపలు పట్టడం, పుస్తకాలు చదవడం, గేమ్స్‌ ఆడటం లాంటివి చేయిస్తారు. గ్యాడ్జెట్స్‌ని డిస్‌కనెక్ట్‌ అయితేనే మనసుకి రికనెక్ట్‌ అవుతామనేది కాన్సెప్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని