ముంగిట్లో సౌందర్యం.... ముచ్చటైన వ్యాపారం!

అందం కోసం సౌందర్యశాలలకు వెళ్లడం పాత పద్ధతి... ఉన్నచోటే మెరుగులు దిద్దుకోవడం తాజా ట్రెండ్...

Published : 19 Jan 2016 11:57 IST

ముంగిట్లో సౌందర్యం.... ముచ్చటైన వ్యాపారం!


అందం కోసం సౌందర్యశాలలకు వెళ్లడం పాత పద్ధతి... ఉన్నచోటే మెరుగులు దిద్దుకోవడం తాజా ట్రెండ్‌... అందుకే ఒకే క్లిక్‌తో నిపుణుల్ని ముంగిట్లోకే రప్పించుకుంటున్నారు కుర్రకారు... నచ్చిన సేవల్ని కోరిన సమయానికే పొందుతున్నారు... ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మొదలైన స్టార్టప్‌లు దూసుకెళ్తున్నాయి... ఆన్‌-డిమాండ్‌ బ్యూటీ సర్వీసులు జోరు మీదున్నాయ్‌... ఆ ట్రెండ్‌.. కొందరు విజేతల సమాహారం.

  ఫేస్‌ ఈజ్‌ ద ఇండెక్స్‌ ఆఫ్‌ ది మైండ్‌ అంటారు. ముఖం చూసి మనసేంటో చెప్పేయొచ్చని దాని భావం. కానీ ఇప్పటి కుర్రకారు అంతటితో సరిపెట్టుకునే రకం కాదుగా! మొహం చూడగానే తమ అందం, హుందాతనం పొగిడించుకోవాలనే బాపతు. అలాగైతే ఎదుటివారి మనసులతోపాటు చేసే పనిలో సగం విజయం సాధించినట్టేనని భావిస్తారు. అందుకే అందం, అలంకరణకు వాళ్లిచ్చే ప్రాముఖ్యం ఎక్కువ. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని కుర్రకారైతే సౌందర్యపోషణకు నెలకు రెండుమూడు వేలైనా వెచ్చిస్తున్నారంటున్నాయి సర్వేలు. అందుకే మెయిన్‌ రోడ్డుతోపాటు ఇరుకు వీధిలోని స్పాలు, సెలూన్లు, పార్లర్లు సైతం రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

ట్టణీకరణ, పాశ్చాత్య ప్రభావం, ఉన్నతమధ్యతరగతి వర్గాలు, కార్పొరేట్‌ ఉద్యోగులు... సౌందర్యంపై యావ... కారణాలేవైతేనేం సౌందర్యోపాసకులు గణనీయంగా పెరిగిపోతున్నారు. వారితోపాటే సౌందర్య ఉత్పత్తులు, సేవల పరిశ్రమ దినదిన ప్రవర్ధమానమవుతోంది. అసోచామ్‌ గణాంకాల ప్రకారం ఈ పరిశ్రమ విలువ అక్షరాలా రూ.ముప్పైవేల కోట్లు. 2014లో ఎనిమిదిన్నర శాతం వృద్ధి నమోదైంది. భవిష్యత్తులో పదిశాతం దాటుతుందంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. ఈ గిరాకీని క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి ప్రారంభ కంపెనీ (స్టార్టప్‌)లు. అన్ని సేవలూ వినియోగదారుడి చెంతకే చేర్చే ఈ డాట్‌కామ్‌ యుగంలో అవకాశాల్ని హాట్‌హాట్‌గా అందిపుచ్చుకుంటున్నాయి. ఫోన్‌కాల్‌, ఆన్‌లైన్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌... దేని ద్వారానైనా క్లిక్‌మనిపించగానే నిపుణుల్ని వినియోగదారుల ముందుంచుతున్నాయి. పెడిక్యూర్‌, మానిక్యూర్‌, ఫేషియల్‌, బ్లీచ్‌, మసాజ్‌, హెయిర్‌స్టైల్‌, నెయిల్‌ కేర్‌, త్రెడింగ్‌, వాక్సింగ్‌, బ్రైడల్‌ మేకప్‌... ఏ సేవనైనా ఇక వారు సిద్ధం. ఇల్లు, ఆఫీసు, హోటల్‌... చోటేదైనా, కోరిన సమయం ఎప్పుడైనా. అందివచ్చిన ఈ సౌలభ్యాన్ని పట్టణాలు, నగరాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు బాగానే ఉపయోగించుకుంటున్నారు.

 గిరాకీకి అనుగుణంగానే సౌందర్య సేవల స్టార్టప్‌లు మొదలవుతున్నాయి. దేశంలో వాటి సంఖ్య సెంచరీ దాటింది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఈ సంస్థల్లో పెట్టుబడి పెట్టే వాళ్లకీ కొదవలేదు. భవిష్యత్తులో ఈరకం వ్యాపారానికి అవకాశాలెక్కువన్నది యూటీవీ అధినేత రోనీ స్క్రూవాలా మాట. బహుశా అదే నమ్మకంతో క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ ‘వ్యోమో’లో మూడున్నర కోట్లు పెట్టాడు. లెట్స్‌ వెంచర్‌, లీడ్‌ ఏంజెల్స్‌ల సహకారంతో ‘బెలిటా’ మొదలైంది. ‘స్టే గ్లాడ్‌’కి ట్రాక్సన్‌ ల్యాబ్స్‌లు ఇంధనం పోశాయి. మొదలైన రెండుమూడేళ్లకే ఈ సంస్థలు కోట్లకెదిగాయి. వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌, వ్యాపారాలకు కేంద్రాలైన దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, పుణెలతోపాటు ఇతర నగరాల్లో ఈ కంపెనీలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న స్పాలు, సెలూన్లు, పార్లర్ల ఏర్పాటు, నిర్వహణకు లక్షలు వెచ్చించాలి. ఆన్‌డిమాండ్‌ బ్యూటీ సర్వీసులకు ఆ పన్లేదు. సౌందర్య నిపుణులను అరువు తెచ్చుకొని వ్యాపారం నడపొచ్చు. సౌలభ్యాలతోపాటు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉండటంతో ఈరకం కంపెనీలు అధికమవుతున్నాయి.

అనువైన పరిస్థితులు, ట్రెండ్‌ని అందిపుచ్చుకొని హిట్‌ కొట్టిన కొందరు విజేతలు


మొదటి సంస్థ

  హైదరాబాద్‌ ఐఎస్‌బీలో చదివిన గరిమాజైన్‌ నాలుగేళ్ల కిందట బెలిటా ప్రారంభించింది. ప్రస్తుతం ముంబయి, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లో సేవలందిస్తున్నారు. మార్కెట్‌ ఆదరణకు అనుగుణంగా వినియోగదారుడి దగ్గరికెళ్లి సర్వీసులు అందించే తొలి సౌందర్య సేవల సంస్థగా బెలిటా గుర్తింపు పొందింది. అమ్మాయిలు, అబ్బాయిల కోసం అన్నిరకాల సేవలందిస్తున్నారు. ఫోన్‌, యాప్‌, వాట్సాప్‌ సందేశం ద్వారా బుక్‌ చేయొచ్చు. ప్రస్తుతం 7,500 వినియోగదారులున్నారు. నెలకు 850 మంది కొత్తగా జత చేరుతున్నారు.


యువరాజ్‌ తోడు

ప్రారంభించిన రెండు నెలల్లోనే పదిహేడువేల మందిని ఆకట్టుకుంది వ్యోమో. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందిన అభినవ్‌ఖరే వ్యవస్థాపకుడు. ఈ యాప్‌ని లక్ష మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. హెయిర్‌స్టైల్‌ నుంచి మొదలుపెట్టి పాదాల మసాజ్‌ వరకు అమ్మాయిలు, అబ్బాయిలిద్దరికీ సర్వీసులు అందిస్తున్నారు. క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ వ్యోమోలో కీలక భాగస్వామి. వ్యోమో దిల్లీ, ముంబయి, చెన్నై, దుబాయ్‌ల్లో పని చేస్తోంది.


ఐఐటియన్ల అడుగు

రగ్‌పూర్‌ ఐఐటీయన్లు గౌరవ్‌ మహేశ్వరి, రోనక్‌ శారదలు గెట్‌లుక్‌ ప్రారంభించారు. ఈ సౌందర్యసేవల సంస్థలో ఆరువేల మంది రెగ్యులర్‌ వినియోగదారులున్నారు. ఫోన్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ ద్వారా నచ్చిన స్టైలిస్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వాళ్లకి రేటింగ్‌ ఇవ్వొచ్చు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, దిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో సేవలు అందిస్తున్నారు. త్వరలో ఇతర నగరాలకు విస్తరించనున్నారు.


అవసరం దారి చూపింది

రేణు అనే ఔత్సాహిక యువతులు వ్యానిటీక్యూబ్‌ ప్రారంభించారు. ఓ శుభకార్యానికి ముస్తాబై వెళ్లాలనుకున్న రేణుకి సమయానికి ఆ రకం సర్వీసు అందలేదు. ఆ అవసరాన్నే వ్యాపార ఆలోచనగా మార్చి గుర్‌గావ్‌లో వ్యానిటీ క్యూబ్‌ ప్రారంభించింది. అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలకు సైతం సర్వీసులున్నాయి. నెలకు వేయివరకు ఆన్‌లైన్‌ ఆర్డర్లొస్తున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని