ఆన్‌లైన్‌లో..శాంతి యుద్ధం

ఒకమ్మాయి... మాట్లాడదు. డ్యాన్స్‌ చేయదు. తీయని గొంతుతో పాట పాడదు. అసలు నోరే తెరవదు. నేనేంటి?

Published : 07 May 2016 01:02 IST

వైరల్‌ వీడియో
ఆన్‌లైన్‌లో..శాంతి యుద్ధం

ఒకమ్మాయి...

మాట్లాడదు. డ్యాన్స్‌ చేయదు. తీయని గొంతుతో పాట పాడదు. అసలు నోరే తెరవదు. నేనేంటి? ఎక్కడి నుంచి వచ్చాను? మా నాన్న ఎలా చనిపోయారు? నా బాధలేంటి? మనమేం చేయాలి? అని ప్లకార్డుల్లో చెబుతుంది. దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టేసింది. నాలుగున్నర నిమిషాల వీడియో. వారంలోపే లక్షలమంది వీక్షించారు. లక్షలమంది ఇతరులతో పంచుకున్నారు.

ఇంతకీ అందులో ఏముంది?
పాకిస్థాన్‌ అంటే శత్రుదేశం అని భావిస్తాం. కార్గిల్‌ యుద్ధ సమయంలో అయితే తీవ్రంగా ద్వేషించాం. మరి ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి కూతురు ఎలా స్పందించాలి? ఔను.. రెండేళ్ల వయసులో కన్నతండ్రిని కోల్పోయిన గుర్మెహర్‌కౌర్‌ తీవ్రంగానే స్పందించింది. పాకిస్థాన్‌ని శత్రువుగా భావించేది. ముస్లింలంతా పాకిస్థాన్‌కు చెందినవారేనని భ్రమ పడింది. ఆరేళ్ల వయసులో బుర్ఖా ధరించిన ఓ మహిళను కత్తితో పొడిచి చంపాలని కూడా ప్రయత్నించింది. కానీ రాన్రాను నిజాలు గ్రహించింది. తన తండ్రిని చంపింది పాకిస్థాన్‌ కాదు.. యుద్ధం అని తెలుసుకుంది. అసలు యుద్ధమే జరగకుంటే చావులే ఉండవు కదా.. నాలాంటి ఎందరో తండ్రుల్ని కోల్పోకుండా ఉండేవారు కదా అనుకుంది. గుండె గూటిలో గూడు కట్టుకున్న ఈ భావాల్ని ప్లకార్డులపై అక్షరాలుగా రాసి వీడియో తీసి ప్రదర్శించింది. ‘ఇప్పుడు నేనూ సైనికురాలినే. ఇరు దేశాల మధ్య శాంతి కోసం పోరాడుతున్న సైనికురాల్ని. అసలు యుద్ధం జరగకుండా ఇరుదేశాల రాజకీయ నాయకులు చొరవ చూపాలి. మూడోస్థాయి నాయకత్వంతో ప్రపంచస్థాయి దేశాన్ని నిర్మించాలనుకోవడం అవివేకం’ అని సందేశం ఇచ్చింది. ఈ సందేశపు వీడియో అందర్నీ ఆలోచింపచేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని