బయటే ఆఫీసు... ట్రెండు బాసూ

నాలుగ్గోడల మధ్య... ఇరుకిరుకు క్యాబిన్లో కంప్యూటర్లకే అతుక్కుపోయి పని చేస్తుంటే ఎవరికైనా బోరే...

Published : 16 Jul 2016 01:11 IST

బయటే ఆఫీసు... ట్రెండు బాసూ

నాలుగ్గోడల మధ్య... ఇరుకిరుకు క్యాబిన్లో కంప్యూటర్లకే అతుక్కుపోయి పని చేస్తుంటే ఎవరికైనా బోరే. అలా కాకుండా ప్రకృతి ఒడిలో సేదతీరుతూనే, అలా ఆరుబయట క్యాబిన్‌ వేసుకొని ల్యాప్‌టాప్‌తో పనులు చేస్తుంటేనో... ఆహా ఆ హాయే వేరు. ఇలా నచ్చిన వాతావరణంలో ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగుల పనితీరు కూడా మెరుగు పడుతుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. ఈ విషయాన్నే స్ఫూర్తిగా తీసుకున్నాయేమో ఉద్యోగులు కోరినట్టు, కోరిన వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని అమెరికన్‌ కంపెనీలు. బయట పని చేసే ఈ ప్రదేశాలనే ‘బ్యాక్‌యార్డ్‌ స్టూడియో’లు అంటున్నారక్కడ. సింపుల్‌గా చెప్పాలంటే పెరట్లో కూర్చొని చేసే పని అన్నమాట.

అక్కడికెళ్లి ఆడుతూపాడుతూ టార్గెట్లను పూర్తి చేస్తే చాలు. కాలిఫోర్నియాలోని ‘పీటర్సన్‌ కాస్‌’ అనే కంపెనీ ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టింది. ఇక బాస్‌లు, సహోద్యోగులతో అనుసంధానం ఎలా అంటారా? ఎలాగూ వైర్‌లెస్‌ ఇంటర్నెట్లు, ఫోన్లు ఉండనే ఉన్నాయి కదా. ఇదే స్ఫూర్తితో బ్రిటన్‌లో ‘గార్డెన్‌ రూమ్స్‌’లు వచ్చేశాయి. పెద్ద సంస్థలకు ఈ ట్రెండ్‌ సరే... మరి స్టార్టప్‌ల మాటేంటి? అంటే వాళ్లూ ఈ ట్రెండ్‌ని పుణికిపుచ్చుకొని ‘పాపిసెస్‌’ తెరిచేస్తున్నారు. ఈ ధోరణి యూరోప్‌ అంతా చేరింది. తర్వాతి వంతు ఇండియాదేనని వేరే చెప్పాలా? యువోద్యోగులూ... బీ రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని