మొసళ్ల సేవలో...క్రొకడైల్‌!

క్రొకడైల్‌... అంటే పేరున్న ఫ్యాషన్‌ బ్రాండే గుర్తొస్తుంది. ఆ సంస్థ రూపొందించిన దుస్తులు వేసుకొని వీధుల్లో...

Published : 03 Sep 2016 01:09 IST

మొసళ్ల సేవలో...క్రొకడైల్‌!

క్రొకడైల్‌... అంటే పేరున్న ఫ్యాషన్‌ బ్రాండే గుర్తొస్తుంది. ఆ సంస్థ రూపొందించిన దుస్తులు వేసుకొని వీధుల్లో క్యాట్‌వాక్‌ చేసే అమ్మాయిల్ని... కాలేజీల్లో పోజులు కొట్టే అబ్బాయిల్ని చూస్తూనే ఉంటాం. యువత మది దోచేలా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్‌ అందించడం ఆ సంస్థకి మొదట్నుంచీ అలవాటే. అదొక్కటే కాదు... కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక హితానికి తనవంతు సాయం చేయడంలో కూడా ముందుంటోంది క్రొకడైల్‌. ముఖ్యంగా అరుదైన జాతి మొసళ్లు ‘ఘరియాల్‌’ల సంరక్షణకు తోడ్పడుతోంది. దీని కోసం మొసళ్ల సంరక్షణకు ప్రపంచంలోనే అత్యుత్తమైనదని పేరెన్నికగన్న ‘ది మద్రాస్‌ క్రొకడైల్‌ బ్యాంక్‌ ట్రస్ట్‌ సెంటర్‌ ఫర్‌ హెర్పెటాలజీ’ (క్రోక్‌ బ్యాంక్‌)తో చేతులు కలిపింది. కేవలం భారత ఉపఖండంలో మాత్రమే జీవించే ఈ అరుదైన రకం మొసళ్లు 1946లో పదివేల వరకు ఉండగా, వాటి జనాభా నానాటికీ అంతరిస్తూ ప్రస్తుతం కేవలం 236కు పడిపోయాయి. చర్మాల అక్రమ రవాణా, గుడ్ల వేట, మొసళ్లకు ఆహారం దొరకకపోవడం, స్థానిక జాలర్ల చేతిలో ప్రాణాలు కోల్పోవడం తదితర కారణాలతో ఈ దుస్థితి దాపురించింది. ఈ అరుదైన జాతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చెన్నైలోని మద్రాస్‌ క్రోక్‌ బ్యాంక్‌ చెన్నైలోని ఈసీఆర్‌ రోడ్డులో మొసళ్లు, సరీసృపాల పార్కు ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తోంది. ఈ పార్కును ఏడాదికి పదిలక్షల మంది సందర్శిస్తున్నారు. ఇందులో ఎనిమిది మొసళ్లను దత్తత తీసుకొని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంది క్రొకడైల్‌. మొసళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి ప్రచారం చేస్తోంది. దీని కోసం ఈ ఏడాది రూ.ఐదులక్షలు కేటాయించారు. భవిష్యత్తులోనూ ఈ సామాజిక సేవ కొనసాగుతుందనీ, ఈ కార్యక్రమ అవగాహన కోసం మరింత ప్రచారం కల్పిస్తామని క్రొకడైల్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) శంకర్‌రామ్‌ ‘ఈతరం’తో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని