వ్యాయామం డ్యాన్సూ.... కలిపేస్తే అదుర్స్‌!

కాఫీ తాగి కాసేపు డ్యాన్స్‌ వర్కవుట్లు చేస్తున్నారు... కార్పొరేట్‌ కార్యాలయం కసరత్తుల కేంద్రంగా మారిపోతోంది... వ్యాయామాన్ని డాన్స్‌ స్టెప్పులతో కలిపేసి అదరగొట్టేస్తున్నారు... ఆఖరికి పబ్బుల్లోనూ ఫిట్‌నెస్‌ పాఠాలే వల్లె వేస్తున్నారు... ఇంటాబయట, ఆఫీసు, జిమ్‌, వేడుక అనే తేడాలేం లేవు..

Published : 24 Sep 2016 02:36 IST

వ్యాయామం డ్యాన్సూ.... కలిపేస్తే అదుర్స్‌!

కాఫీ తాగి కాసేపు డ్యాన్స్‌ వర్కవుట్లు చేస్తున్నారు... కార్పొరేట్‌ కార్యాలయం కసరత్తుల కేంద్రంగా మారిపోతోంది... వ్యాయామాన్ని డాన్స్‌ స్టెప్పులతో కలిపేసి అదరగొట్టేస్తున్నారు... ఆఖరికి పబ్బుల్లోనూ ఫిట్‌నెస్‌ పాఠాలే వల్లె వేస్తున్నారు... ఇంటాబయట, ఆఫీసు, జిమ్‌, వేడుక అనే తేడాలేం లేవు... నలుగురు గుమిగూడే చోటు ఏదైనా ఈ ధోరణికి వేదికే... వ్యాయామం.. నృత్యం.. సంగీతం.. కలిసిన ‘గ్రూప్‌ డాన్స్‌ ఫిట్‌నెస్‌ ట్రెండ్‌’ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది...

ఆ నయా ధోరణి వివరాలివిగో.
ఐదేళ్ల కిందటే ఈ ట్రెండ్‌ మొదలైనా కుర్రకారు నోళ్లలో ఎక్కువగా నానుతోంది మాత్రం ఈమధ్య కాలంలోనే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు.. కార్పొరేట్‌ కుర్రకారు.. కాలేజీ విద్యార్థులతోపాటు వయసుతో నిమిత్తం లేకుండా ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బృంద నృత్య వ్యాయామంలో సేద తీరుతూనే ఉన్నారు. భారత్‌లోకి ఏ కొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ వచ్చినా మన చూపు పశ్చిమదేశాలవైపే మళ్లేది. ఈ స్టైల్‌ మాత్రం అచ్చంగా ఇక్కడిదే! దిల్లీ, ముంబయి, బెంగళూరులాంటి మెట్రో నగరాల్లో పుట్టి హైదరాబాద్‌లోనూ వూపు మీదుంది. ఒక్క భాగ్యనగరంలో దీనికి వంతపాడే ఫిట్‌నెస్‌ సెంటర్లు 200పైగా ఉన్నాయి. వైజాగ్‌, విజయవాడల్లోనూ ఈ ధోరణి వేళ్లూనుకుంది.

ఎందుకంటే ప్రేమంట..
అబ్బాయిలు కండలు పెంచడానికి.. అమ్మాయిల తీరైన శరీరాకృతికి అందుబాటులో బోలెడు వ్యాయామశాలలున్నాయి. నృత్యంపై మోజు పడేవాళ్లది వేరే దారి. కానీ ఈ రెంటినీ ఇష్టపడేవాళ్ల కోసమే ఈ బృంద నృత్య వ్యాయామాలు అన్నది శిక్షకుడు జె.బాబీ చెబుతున్న మాట. ఇదికాకుండా భారీ కసరత్తులు చేయడం, మూతి ముడుచుకొని బరువులు ఎత్తడం బోర్‌గా, రొటీన్‌గా ఫీలయ్యేవారు ఇటువైపు చూస్తున్నారు అంటాడు. నచ్చిన సంగీతం వింటూ.. అందరితో కలిసి దీన్నో సరదా వ్యాపకంగా భావిస్తూ ఫిట్‌నెస్‌ ఒంట పట్టించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు? అని ప్రశ్నిస్తాడు. పైగా కొత్త ట్రెండ్‌ కావడంతో చేసేవాళ్లకీ ఉత్సాహంగానూ ఉంటుంది.

అన్నీ జతకలిసి
సంగీతం, నృత్యం, ఫిట్‌నెస్‌ కలిస్తేనే గ్రూప్‌ డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌. ఈ కోర్సులో భాగంగా నేర్పే ముఖ్యమైన వర్కవుట్లు.

ఏరోబిక్స్‌: ఏరోబిక్స్‌ అంటేనే సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేయడం. బృంద నృత్యంలో వేగం పెంచి బీట్‌ పర్‌మినిట్‌ 135 నుంచి 150 వరకు ఉండేలా నృత్యరీతులు రూపొందిస్తారు.

జుంబా: మెరుంగే, సాల్సా, కుంభియా, రెగెట్టా అనే విభాగాలుంటాయి. ఈ స్టెప్పులనే మార్చి 75శాతం లాటిన్‌, 25శాతం ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఉండేలా వ్యాయామాలు రూపొందిస్తారు.

బోక్వా: శరీరాన్ని ఎల్‌, కే, ఓ, జే ఆకారాల్లో తిప్పుతూ చేసే వ్యాయామం. హోరెత్తే సంగీతం, దక్షిణాఫ్రికా స్టెప్పులు అదనం.

బాలీఫిట్‌నెస్‌: బాలీవుడ్‌ సినిమా పాటల్లోని డ్యాన్స్‌లనే మార్పులు చేసి ఫిట్‌నెస్‌ కోర్సుగా రూపొందిస్తారు. కండరాల పటుత్వం కోసం ఎక్కువగా ఈ స్టెప్పులు రూపొందిస్తారు.

క్రాస్‌ఫిట్‌: భారీ బరువులు ఎత్తడం క్రాస్‌ఫిట్‌ అసలు ఉద్దేశం. బృందం నృత్యంలో తేలికపాటి బరువులు ఎత్తిస్తూ ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

ఆక్వా యోగా: బృందంగా ఏర్పడి నీటిలో చేసే వ్యాయామం. యోగా భంగిమలకుతోడు సంగీతం జతగా చేర్చుతారు. కీళ్లు, మోకాలు నొప్పులకు ఉపశమనం.

మసాలా భాంగ్రా: ఒక్కో వర్కవుట్‌కి 500 కేలరీలు కరిగించగల పంజాబీ జానపద నృత్యం ఇది. కొద్దిపాటి మార్పులతో బరువు తగ్గించి, చక్కటి శరీరాకృతి తెచ్చే వర్కవుట్‌గా మార్చారు.

బూట్‌క్యాంప్‌: సైన్యం చేసే వ్యాయామం. దీనికి సంగీతం జోడించి, కసరత్తులను తేలికగా మలిచి ఇంకాస్త వేగం పెంచుతారు.

కోర్సులో భాగంగా పైన పేర్కొన్న వర్కవుట్లు చేయిస్తూనే శరీర పటుత్వం కోసం స్క్వాట్స్‌, కూర్చోవడం.. లేవడం.. మాడిఫై పుషప్‌లు, బైసెప్స్‌, సోల్‌, ట్రైసెప్‌లాంటి కండిషనింగ్‌ వ్యాయామాలు చేయిస్తారు.

సంపాదనకు మార్గం
కండరాలు గట్టిపడతాయి.. బరువు, పొట్ట తగ్గుతుంది. గుండెకు బలం. అత్యధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. తొడలు, శరీరాకృతి మెరుగు పడుతుంది. చెప్పుకుంటూ పోతే ఈ బృంద నృత్య వ్యాయామం ఇతర ఏ వర్కవుట్లకూ తీసిపోదు. అన్నింటికన్నా ముఖ్యం ఇదో సరదా వ్యాపకం. ఒకర్ని చూసి ఇంకొకరు ఉత్సాహం పొందుతారు. ఇక కోర్సు విషయానికొస్తే శిక్షకుడి అనుభవం, కల్పించే సౌకర్యాల ఆధారంగా ఈ కోర్సుకు నెలకు రూ.రెండువేల నుంచి ఐదువేల వరకు వసూలు చేస్తారు. దీనిపై పట్టు సాధించినవారు, సరికొత్త వ్యాయామ కూర్పు చేయగలిగేవాళ్లు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గానూ అవతారం ఎత్తొచ్చు. నా దగ్గర శిక్షణ పొంది ట్రైనర్లుగా మారినవారిని చాలామందిని చూశాను అంటాడు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ బాబీ. వేరే ఉద్యోగం చేస్తూనే పార్ట్‌టైమ్‌ శిక్షకుడిగా రాణించొచ్చు.

జాగ్రత్తలివి...
చేసే వ్యాయామం ఎలాంటిదైనా సరైన పద్ధతి పాటించకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయన్నది నిపుణులు చెప్పే మాట. వాళ్లు చెబుతున్న జాగ్రత్తలు.
* వ్యాయామ నిపుణుడు, సీపీఆర్‌ సర్టిఫికేషన్‌ కోర్సు చేసినవారి దగ్గరే శిక్షణ పొందాలి. అనుకోని ప్రమాదాల బారిన పడకుండా కచ్చితమైన నియమాలు రూపొందిచగలరు.
* ముందు బేసిక్‌ స్ట్రెంగ్తెనింగ్‌, చివర్లో కండీషనింగ్‌ వ్యాయామాలు చేయాలి. దీంతో కీళ్లు, కండరాలు, ఎముకలపై దుష్ప్రభావం తగ్గుతుంది.
* భీకరంగా కసరత్తులు చేస్తే సరిపోదు. మన లక్ష్యానికి అనుగుణంగా కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి.
* ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందే శిక్షకుడికి తెలియజెప్పాలి. దానికి అనుగుణంగా కోర్సులో మార్పులు చేస్తారు.
* వ్యాయామానికి అనుగుణంగా దుస్తులు, షూలు ధరించడం అత్యవసరం.


 

ఏడువేలమందికి శిక్షణ

సొంతూరు కాకినాడ. ఎంబీఏ పూర్తయ్యాక 2009వరకు బహుళజాతి సంస్థల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేశా. మొదట్నుంచీ ఫిట్‌నెస్‌ జంకీని. ఆటలంటే ఇష్టం. బ్యాండ్మింటన్‌ అండర్‌14 స్టేట్‌ ఛాంపియన్‌ని. బాక్సింగ్‌ చేసేవాణ్ని. నా ప్యాషన్‌నే వృత్తిగా మలచుకోవాలనే ఉద్దేశంతో ఏరోబిక్స్‌, జుంబా నేర్చుకున్నా. రీబాక్‌ సర్టిఫైడ్‌ ఫిట్‌నెస్‌ కోర్సు చేశా. ఈ అనుభవంతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో బాబీ ఫిట్‌నెస్‌ ఫ్యూజన్‌ పేరుతో స్టూడియో తెరిచా. ఇప్పటికి ఏడువేలమందికి శిక్షణనిచ్చా. ఏరోబిక్స్‌, జుంబా, ఆక్వాయోగా.. తదితర వర్కవుట్లను కలిపి సొంతంగా ఓ కోర్సు రూపొందించా. హెచ్‌ఎస్‌బీసీ, డెలాయిట్‌లాంటి సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ ఉద్యోగులకు ఎక్కువగా శిక్షణనిస్తున్నా. పలు అవేర్‌నెస్‌ ఫ్లాష్‌మాబ్‌లు చేశా. గ్రూప్‌ డాన్స్‌ ఫిట్‌నెస్‌ ట్రెండ్‌లో కఠినత్వం తక్కువ.. ఫన్‌ ఎక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఆదరిస్తున్నారు.

- జె.బాబీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని