అమెజాన్‌ సొగసులు అదిరెన్‌!

మరో సొగసుల పండగ ముగిసింది. దేశంలోని అతిపెద్ద అమెజాన్‌ ఇండియా ఫ్యాషన్‌వీక్‌లో టాప్‌ డిజైనర్ల...

Published : 22 Oct 2016 01:31 IST

అమెజాన్‌ సొగసులు అదిరెన్‌!

మరో సొగసుల పండగ ముగిసింది. దేశంలోని అతిపెద్ద అమెజాన్‌ ఇండియా ఫ్యాషన్‌వీక్‌లో టాప్‌ డిజైనర్ల డిజైన్ల మిరుమిట్లు, మోడళ్ల క్యాట్‌వాక్‌లు దీపావళికి ముందే వెలుగులు పంచాయి. నాలుగు రోజులపాటు సాగిన ఈ ఫ్యాషన్‌ బొనాంజాలో బాగా ఆకట్టుకున్నవి కొన్ని.
* హేమంత్‌ అండ్‌ నందితాల మెరుపు వర్ణాలు
రంగురంగుల మెరుపు వర్ణాల దుస్తుల డిజైన్లతో ఆకట్టుకున్నారు హేమంత్‌ అండ్‌ నందితాలు. మెడను చుట్టేసిన డిజైన్ల గౌన్లు పాత స్కూల్‌రోజులను గుర్తుకు తెస్తే.. వీపు భాగం కనిపిస్తూ భుజాలకెక్కిన డ్రెస్‌లు ఆధునికతకు అద్దం పట్టాయి.
* తేనెలూరించిన పల్లవీ మోహన్‌
తేనెటీగ స్ఫూర్తితోనే ఈసారి నా డిజైన్లన్నీ చేశానంటోంది పల్లవి. పొడవాటి లేయర్లతో కుట్టిన సల్వార్‌ కమీజ్‌లు.. ఫ్లోరల్‌ అప్లిఖ్‌ డిజైన్లను ‘స్వీట్‌ నెక్టార్‌’ పేరుతో ప్రదర్శించి మోడళ్లు వయ్యారాలు ఒలకబోశారు.
* కొత్తకొత్తగా పంకజ్‌ అండ్‌ నిధిలు
‘క్రోమాటిక్‌’ పేరుతో ఈ డిజైనర్ల ద్వయం ఫ్యాషన్‌వీక్‌లో తమ ముద్ర వేశారు. మెష్‌ టెక్చర్లు, పెయింటర్లీ ప్రింట్ల డిజైన్లు కొత్తకొత్తగా కనువిందు చేశాయి. ముఖ్యంగా కలర్‌ ప్యాలెట్లు దుస్తులకు మరింత వన్నె తెచ్చాయి.
* అతియా వాక్‌ అతిశయం
బెల్‌బాటమ్స్‌, పొడుగాటి చొక్కాలు, బస్టియర్లు.. డిజైన్లు పాతవే అయినా అందులో తన ప్రత్యేకత చూపించింది మసాబాగుప్తా. ఎరుపు, గులాబీ, నీలిరంగు మోనోక్రోమ్‌ డిజైన్ల డ్రెస్‌లు ఆమె డిజైన్లలో ప్రత్యేకంగా నిలిచాయి. బాలీవుడ్‌ భామ అతియాశెట్టి ఈ డిజైన్లకు క్యాట్‌వాక్‌ చేసి ఆకట్టుకుంది.
* రాజేశ్‌ప్రతాప్‌సింగ్‌ సంప్రదాయ మెరుపులు
సంప్రదాయ దుస్తులకు చిరునామాగా పేరున్న రాజేశ్‌ప్రతాప్‌సింగ్‌ సైతం ఈసారి మోనోక్రోమ్‌ డిజైన్లకే పెద్దపీట వేశాడు. వీటిల్లోనూ పోల్కా చుక్కలు, చెక్స్‌, నిలువు గీతల డిజైన్లు హుందాతనం తెచ్చిపెట్టాయి.
* నగధగల ఇలియానా
డిజైనర్‌ దుస్తులే కాదు.. డిజైనర్‌ నగలు సైతం ఈ షోలో తళుక్కుమన్నాయ్‌. శ్రుతి తాపురియా డిజైనర్‌ నగలు.. అభిషేక్‌ కంకారియా మలిచిన హ్యాండ్‌బ్యాగ్‌లాంటి యాక్సెసరీలు ధరించి ఈ షోకే వన్నెతెచ్చింది మన ఇలియానా. ఎరుపురంగు ఫ్రాక్‌, ధగధగలాడే నగలతో వచ్చిన ఇలియానాపైనే చూపులన్నీ నిలిచిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని