పాప్‌ రారాజు వచ్చె.. రవితేజములలరగా!

పాప్‌స్టార్‌.. అమ్మాయిల కలల రాకుమారుడు జస్టిన్‌ బీబర్‌ మే 7న ఇండియా వస్తున్నాడు. వరల్డ్‌ టూర్‌లో భాగంగా ముంబయిలో ఆడిపాడి కుర్రకారుని ఓలలాడించనున్నాడు.

Updated : 29 Nov 2022 13:47 IST

పాప్‌స్టార్‌.. అమ్మాయిల కలల రాకుమారుడు జస్టిన్‌ బీబర్‌ మే 7న ఇండియా వస్తున్నాడు. వరల్డ్‌ టూర్‌లో భాగంగా ముంబయిలో ఆడిపాడి కుర్రకారుని ఓలలాడించనున్నాడు. పెద్ద వార్తే. అయితే ఇంతకుమించి సంచలన సంగతులు బీబర్‌కి దక్కబోతున్న రాజ వైభోగాలు. అదే ఇప్పుడు పెద్ద టాపిక్‌ అయి కూర్చుంది. ఆ సంగతుల కమామీషూ.

బాలీవుడ్‌ దివా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ బీబర్‌కి ఐదురోజులు గైడ్‌గా వ్యవహరించనుంది. ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా, కాలా ఘోడా, మణిభవన్‌.. అన్నీ తిప్పి చూపిస్తుంది. ఈ సందర్భంగా కొందరు బాలీవుడ్‌ స్టార్లు సైతం బీబర్‌ని వ్యక్తిగతంగా కలిసే ‘అదృష్టం’ దక్కించుకున్నారు. పనిలో పనిగా ఈ పాప్‌స్టార్‌ అనాథాశ్రమాన్ని కూడా సందర్శిస్తాడు.

ఈ పాటగాడికి ప్రత్యేకంగా అతిథి మర్యాదలు చేయడానికి, అవసరాలు తీర్చడానికి రాజస్థాన్‌లోని ఫైవ్‌స్టార్‌ హోటళ్ల సిబ్బందిని నియమించారు. దేవనాగరీ భాషలో రాసిన పాలరాతి పింగాణీ పాత్రల్లో రాచరికపు విందు తరహాలో వడ్డిస్తారు. బస చేసే ఐదురోజులూ మనసు ఉల్లాసంగా ఉండటానికి హోటళ్లొ తబలా, ఫ్లూట్‌ వాయిద్యాలు నిరంతరం మోగుతూనే ఉంటాయి.

120మంది మందీ మార్బలం వెంటరాగా బీబర్‌ ముంబయి విమానాశ్రయంలో దిగనున్నాడు. అక్కడ్నుంచి బస చేసే హోటల్‌కి వెళ్లడానికి నాలుగు రోల్స్‌రాయిస్‌ కార్లు సిద్ధంగా ఉంటాయి. సిబ్బంది కోసం పది లగ్జరీ కార్లు, రెండు వోల్వో బస్సులతో కాన్వాయ్‌ బయల్దేరుతుంది.

బీబర్‌కి మహారాష్ట్ర ప్రభుత్వం జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. దీనికి అదనంగా అతడి వ్యక్తిగత అంగరక్షకులుంటారు. అతడు ఉండటానికి ఏకంగా రెండు ఫైవ్‌స్టార్‌ హోటళ్ల మొత్తం గదుల్ని బుక్‌ చేశారు.

తను సంగీత ప్రదర్శన చేసే డీవై పాటిల్‌ మైదానానికి హెలికాప్టర్‌లో వస్తాడు. ఇలా వస్తున్న మొదటి అంతర్జాతీయ సెలెబ్రెటీ ఇతడే.

దాహం తీర్చుకోవడానికి 24 అల్కలైన్‌ నీటి సీసాలు, నాలుగు రకాల ఎనర్జీ బాటిళ్లు, ఆరు రకాల విటమిన్‌ బాటిళ్లు, 6 క్రీమ్‌ సోడాలు.. వెంట తెచ్చుకుంటున్నాడు.

రెండు కింగ్‌సైజ్‌ బెడ్లు, 24 గంటలు తెరిచి ఉంచే జిమ్‌, ఆవిరి స్నానాల గది, గదినిండా వేలాడే మొఘల్‌ పెయింటింగ్స్‌.. అత్యంత ఖరీదైన కశ్మీరీ లినెన్‌తో తయారైన పరదాలు.. దుస్తులు భద్రం చేసుకోవడానికి భారీ ర్యాక్‌.. బీబర్‌ బస చేసే రాయల్‌ సూట్‌ స్వరూపమే పూర్తిగా మార్చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని