పిప్పా పెళ్లికి జగమంతా సందడి

పిప్పా మిడిల్‌టన్‌కి పెళ్లైంది. దునియా మొత్తం కళ్లప్పగించి చూసింది. ఇంతకీ ఎవరీ పిప్పా? అంటే రచయిత్రి, కాలమిస్టు, ఫ్యాషన్‌ ఐకాన్‌..

Published : 27 May 2017 01:36 IST

పిప్పా పెళ్లికి జగమంతా సందడి

పిప్పా మిడిల్‌టన్‌కి పెళ్లైంది. దునియా మొత్తం కళ్లప్పగించి చూసింది. ఇంతకీ ఎవరీ పిప్పా? అంటే రచయిత్రి, కాలమిస్టు, ఫ్యాషన్‌ ఐకాన్‌.. అన్నింటికీ మించి బ్రిటన్‌ డచెస్‌ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ కేట్‌ మిడిల్‌టన్‌ ముద్దుల చెల్లెలు అన్నది సమాధానం. వివాహం లండన్‌లో జరిగినా లోకం మొత్తం ఒకటే సందడి. ఏంటా సంగతులు అంటే...
పెళ్లి కొడుకు: 33 ఏళ్ల పిప్పా వలచి మనువాడింది 41 సంవత్సరాల జేమ్స్‌ మాథ్యూస్‌ని. ఈడెన్‌ రాక్‌ కాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూపు సీఈవో. ఇద్దరూ స్కీయింగ్‌లో దిట్టలు. ఈ ఆసక్తే ఇద్దరిని కలిపింది. జేమ్స్‌ పిప్పాకి ప్రపోజ్‌ చేశాడు. మామగారినీ ఒప్పించాడు.

విశిష్ట అతిథులు: పెళ్లికి హాజరైంది మామూలు అతిథులేం కాదు.. బ్రిటన్‌ రాకుమారులు విలియం, హ్యారీలు.. ప్రిన్సెస్‌ కేట్‌మిడిల్‌టన్‌ వారి పిల్లలు జార్జ్‌, ఛార్లెట్‌లు. టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌.. నటులు బెన్‌ ఫోగ్లే, డన్నా ఎయిర్‌. ఇలాంటి వారెందరో.

పెళ్లి గౌను: పెళ్లికి నవ వధువు వేసుకున్న గౌను ఖరీదు అక్షరాలా 34 లక్షల రూపాయలు. హై నెక్‌, క్యాప్డ్‌ స్లీవ్‌, బ్యాక్‌లేస్‌తో ఉన్న ఫుల్‌ స్కర్ట్‌, టీషర్టుని పోలిన బాడీస్‌తో ఉన్న ఈ ప్రత్యేక డిజైన్‌ని గైల్స్‌ డీకోన్‌ అనే ప్రఖ్యాత డిజైనర్‌ రూపొందించాడు. ఎడ్డీ కే బ్రైడల్‌ బ్రాండ్‌ వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడితే హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఫొటోలు: పెళ్లిని ‘కవర్‌’ చేస్తామనీ, పెద్ద మొత్తం ఇస్తామనీ ప్రపంచంలోని ప్రముఖ మేగజైన్‌లన్నీ పిప్పా ముందు వరుస కట్టాయి. పాపరాజ్జి పొడ గిట్టడం ఇష్టంలేని పిప్పా వాళ్లని తిరస్కరించింది. అక్కా-బావలు కేట్‌, విలియమ్‌లే ఫొటోగ్రాఫర్‌ల అవతారం ఎత్తారు.

అంకెల్లో:
* భద్రతను పర్యవేక్షించడానికి, అతిథుల్ని వేడుక దగ్గరికి తీసుకురావడానికి 50 లాండ్‌రోవర్‌ కార్లను వినియోగించారు.
* పెళ్లి శుభలేఖల కోసమే ఏకంగా పదిలక్షల రూపాయలు, మొత్తం వేడుకకి ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చైంది.
* మిడిల్‌టన్‌ కుటుంబానికి చెందిన పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన గ్లాస్‌ ఆడిటోరియం (మార్క్యూ)లో పెళ్లి జరిగింది.
* అతిథులపై పన్నీటి జల్లులు కురిపించడానికి రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సూపర్‌ మరైన్‌ స్పిట్‌ఫైర్‌ అనే యుద్ధవిమానాన్ని వినియోగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని