క్రాలింగ్‌ చేద్దాం.. ఫిట్‌నెస్‌ పట్టేద్దాం

కెటెల్‌ బెల్‌లు, స్పిన్‌ బైక్‌లు, బ్యాలెట్‌ షూలు పక్కన పెట్టేయండి. భారీ బరువులు ఎత్తేయడాలూ... గంటలకొద్దీ జిమ్‌లో గడపడాలూ మర్చిపోండిక. శరీర బరువే ఆధారంగా... ఇంటినే వ్యాయామశాలగా మార్చేసే కొత్త ఫిట్‌నెట్‌ ట్రెండ్‌ ‘క్రాలింగ్‌’ జోరందుకుంటోంది మరి. కాలి వేలి నుంచి మెడవరకూ...

Published : 24 Jun 2017 02:10 IST

క్రాలింగ్‌ చేద్దాం.. ఫిట్‌నెస్‌ పట్టేద్దాం

కెటెల్‌ బెల్‌లు, స్పిన్‌ బైక్‌లు, బ్యాలెట్‌ షూలు పక్కన పెట్టేయండి. భారీ బరువులు ఎత్తేయడాలూ... గంటలకొద్దీ జిమ్‌లో గడపడాలూ మర్చిపోండిక. శరీర బరువే ఆధారంగా... ఇంటినే వ్యాయామశాలగా మార్చేసే కొత్త ఫిట్‌నెట్‌ ట్రెండ్‌ ‘క్రాలింగ్‌’ జోరందుకుంటోంది మరి. కాలి వేలి నుంచి మెడవరకూ... శరీరంలోని అన్ని భాగాలు, కండరాలకూ ఇది తీరైన వ్యాయామం అంటున్నారు నిపుణులు. ఆ సంగతులేవో మనమూ తెల్సుకొని ఆచరిస్తే పోలా?

క్రాలింగ్‌ అంటేనే పాకడం. ఈ వర్కవుట్‌ ఉద్దేశమూ అదే. ముందు నిటారుగా నిల్చోవాలి. తర్వాత కిందికి వంగి అరచేతుల్ని గచ్చుపై పెట్టి మోకాళ్లకు సమాంతరంగా ఆనించి నడుమును నిటారుగా పైకి ఎత్తాలి. అదే పొజిషన్‌లో ఉంచి ఐదారుసార్లు వెనక్కిముందుకి పాకుతూ వెళ్లాలి. కాసేపటి తర్వాత మోకాళ్లను నేలకి కొన్ని అంగుళాలు పైకి ఎత్తి శరీరం బరువునంతా కండరాలపై పడేలా చూసుకోవాలి. అదే పొజిషన్‌లో కాసేపు ముందుకీ, వెనక్కీ వెళ్లాలి. ఇలా ఐదారుసార్లు చేసిన తర్వాత మళ్లీ యథాస్థితికి రావాలి. సాధారణంగా చిన్నపిల్లలు మోకాళ్లను కింద పెట్టి పాకుతారు. ఈ వర్కవుట్‌ చేసేవాళ్లు మోకాళ్లు కిందపెట్టకూడదు. మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌. ఇందులోనూ డ్రాగన్‌ వాక్‌, ఇన్‌ఫేస్‌ బేర్‌ క్రాల్‌, సర్క్యులర్‌ బేర్‌ క్రాల్‌, లో క్రాబ్‌, ప్యాంథర్‌ క్రాల్‌, లాటరల్‌ క్రాబ్‌ కాల్‌ లాంటి పలు రకాల వర్కవుట్లు ఉన్నాయి. స్టెయిర్స్‌ప్రింట్స్‌, ప్లాంక్స్‌, స్వాట్స్‌... లాంటి కఠోర కసరత్తులకు క్రాలింగ్‌ మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. రోజుకి అరగంట నుంచి నలభై అయిదు నిమిషాలు ఈ వ్యాయామం చేస్తుంటే శరీరంలోని ప్రతి కండరానికి పని చెప్పినట్టే. పైగా ఈ కసరత్తుకు ప్రత్యేకంగా ఎలాంటి పనిముట్లు అవసరం లేదు. జిమ్‌కెళ్లే పనే లేదు. ఇంట్లోనే ఎంచక్కా చేసేయొచ్చు. సెలెబ్రెటీ శిక్షకులు, పెద్ద జిమ్స్‌లో ఈ కసరత్తును ఒక వర్కవుట్‌గా నేర్పించే ట్రెండ్‌ కొన్నాళ్ల కిందటే మొదలైంది. ఫిట్‌నెస్‌ జంకీలు సొంతంగా క్రాలింగ్‌ చేసే ధోరణిమాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయితే వెన్ను నొప్పి ఉన్నవారు దీని జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణుల సలహా.

ఉపయోగాలు
* శరీరం దృఢంగా తయారవడమే కాదు దానిపై నియంత్రణ సాధ్యమవుతుంది.
* చేతివేళ్లు, మణికట్టు, చేతులు, మోచేతులు, భుజాలు, వెన్నెముక, తొడలు, కాళ్లు, మడమలు, కాలివేళ్లు... ఇలా ప్రతి భాగానికి వ్యాయామం.
* ఒంట్లో అధికంగా ఉన్న కేలరీలు కరుగుతాయి.
* వెన్నెముక చుట్టూ ఉండే ఎముకలు, కండరాలు గట్టి పడతాయి.
* క్రీడాకారులు, అథ్లెట్లకు స్పోర్ట్స్‌ కండీషనింగ్‌ కసరత్తుగా ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని