మగాళ్లకో మనార్కలీ!

పెళ్లిలోనో... సంప్రదాయ వేడుకలకో అమ్మాయి అందంగా కనిపించడానికి....

Published : 12 Aug 2017 01:19 IST

మగాళ్లకో మనార్కలీ!

పెళ్లిలోనో... సంప్రదాయ వేడుకలకో అమ్మాయి అందంగా కనిపించడానికి కోరుకునే మొదటి ఛాయిస్‌ అనార్కలీ! ఇప్పుడే కాదు.. మొఘలుల కాలంలో రాజసం ఒలకబోసి... కథక్‌, కథాకళి నృత్యాల్లో చూపరుల కళ్లను కట్టిపడేసేలా మాయ చేసేదీ ఈ డ్రెస్‌నే... అతివల అందాలకి మెరుగులద్దే ఈ వస్త్ర సోయగం అబ్బాయిల దేహాన్నీ చుట్టేస్తోంది... కాకపోతే నేటి ఫ్యాషన్‌ ప్రపంచానికి కొత్తగా పరిచయం అయింది! ఆ ట్రెండ్‌ పేరేంటో తెలుసా? ‘మనార్కలీ!’
పాత తరం హీరోయిన్‌ మధుబాల పేరు వినే ఉంటారుగా! సంప్రదాయబద్ధంగా నిండైన వస్త్రాలతో అనార్కలీ డ్రస్‌లో అందర్నీ కట్టిపడేసింది. ఆనాటి నుంచి నేటి వరకూ పలు డిజైన్లలో మురిపిస్తూ ఇప్పుడు ఏకంగా జెండర్‌ హద్దుల్ని జంప్‌ చేసి అబ్బాయిలు మెచ్చే మోడ్రన్‌ డ్రస్‌గా మనార్కలీ పేరుతో ముందుకొచ్చింది. ర్యాంప్‌వాక్‌ల్లో భిన్నమైన డిజైన్లతో కుర్రోళ్ల ఒంటిపై కొంటెగా ప్రదర్శిస్తోంది. ప్రముఖ డిజైనర్ల ద్వయం అబూజానీ, సందీప్‌ ఖోస్లా రూపొందించిన మనార్కలీ దుస్తుల్ని ఈమధ్యే దిల్లీ ఫ్యాషన్‌ షోలో పలువురు మగ మోడళ్లు ధరించి ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. అంతకుముందు బాలీవుడ్‌ స్టార్‌లు రణ్‌వీర్‌ సింగ్‌, అనుపమ్‌ఖేర్‌, అలీ ఫజల్‌లు ఈ డిజైన్‌ ధరించి బాగా ప్రాచూర్యంలోకి తెచ్చారు. ఆ వూపుతో సామాన్య కుర్రకారు సైతం వీటిపై మోజు పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో మనార్కలీ జోరు ఎక్కువగా కనువిందు చేస్తోంది. తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించాలనుకునే మగరాయుళ్లు సైతం వీటిని దర్జాగా ధరించి తెగ ముచ్చటపడుతున్నారు. ఫ్యాషన్‌లో ఆడా, మగా హద్దులు చెరిపేసేలా ఇద్దరికీ నప్పే డిజైన్‌గా నిలవాలన్నదే మనార్కలీ రూపకర్తల లక్ష్యం. ఈతరం ఫ్యాషన్‌ ప్రియులకున్న స్వేచ్ఛాయుత ఆలోచనలే ఈ మగవారి అనార్కలీకి ఓటేసేలా చేస్తున్నాయని రూపకర్తలు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని