మార్స్‌ మ్యాజిక్‌... 24కే ‘మ్యూజిక్‌’

అమెరికాలో మైకల్‌జాక్సన్‌ అంటే సంగీతప్రియులకు ప్రాణం. ఆయన డ్యాన్స్‌లను చూస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు బ్రోనోమార్స్‌. చిన్నప్పటి నుంచి ఆయనే స్ఫూర్తి. అందుకే సంగీతాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు....

Published : 03 Feb 2018 02:03 IST

గ్రామీ గాగా
మార్స్‌ మ్యాజిక్‌... 24కే ‘మ్యూజిక్‌’

మెరికాలో మైకల్‌జాక్సన్‌ అంటే సంగీతప్రియులకు ప్రాణం. ఆయన డ్యాన్స్‌లను చూస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు బ్రోనోమార్స్‌. చిన్నప్పటి నుంచి ఆయనే స్ఫూర్తి. అందుకే సంగీతాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఏకంగా మూడు విభాగాల్లో గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్నాడు. హవాయి రాష్ట్రంలో జన్మించిన మార్స్‌ది సంగీత నేపథ్యమున్న కుటుంబం. తల్లిదండ్రులిద్దరికీ సంగీత, నృత్యాల్లో ప్రావీణ్యం అపారం. దాంతో మార్స్‌ కూడా ఎలక్ట్రిక్‌ గిటార్‌, బాస్‌, పియానో, కీబోర్డ్‌, డ్రమ్స్‌...ఇలా భిన్నరకాల వాయిద్యాలు నేర్చుకున్నాడు. నృత్యంలోనూ ప్రవేశం పొందాడు. ఇక, కలం తీసుకుంటే చాలు. పాటలు సైతం చకచకా రాసేస్తాడు. ఇలా సంగీత, సాహిత్యాల్లో ప్రతిభ చూపుతూ 2010లో మొట్టమొదటి ఆల్బమ్‌ విడుదల చేశాడీ కుర్రాడు. 2016లో చేసిన 24కే మ్యాజిక్‌ ఆల్బమ్‌ సంచలనాలు నమోదు చేసింది. అది 130 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. ఈ ఆల్బమే ఇప్పుడు మూడు గ్రామీ అవార్డులు సొంతం చేసుకొనేలా చేసింది. బెస్ట్‌ ఆల్బమ్‌, రికార్డు, సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాలు దక్కించుకుంది. ఇప్పటి వరకూ 11 గ్రామీ అవార్డులు, 3 బ్రిట్‌ పురస్కారాలు, 3 గిన్నిస్‌ రికార్డులు మార్స్‌ ఖాతాలో చేరాయి. టైమ్స్‌ విడుదల చేసే 100 మంది అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితా-2011లోనే స్థానం సంపాదించిన మార్స్‌, ముప్పై ఏళ్ల లోపు వారి ఫోర్బ్స్‌ జాబితా-2013లోనూ మొదటి స్థానాన్ని పొందాడీ  యువ సంగీత తరంగం. ది స్మీజింగ్‌టన్స్‌ పేరుతో సొంత ప్రొడక్షన్‌ ప్రారంభించి సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని