ఉమసా.. బిగొటా!

తెలుగు అమ్మ భాషే.. అవొచ్చు!  ఇంగ్లిష్‌..? ఎల్‌కేజీ నుంచే బట్టీ కొట్టేసి ఉండొచ్చు.  మునివేళ్లతో సాధన చేసిన ఎస్‌ఎంఎస్‌ కోడ్‌ భాషా మీకొచ్చిండొచ్చు. అయినా... అవసరానికి ఇతర పేరు లేని భాషలూ పుట్టుకొస్తాయి. అలా వచ్చినదే కొత్తగా వైరల్‌ అవుతున్న ‘క్యాంపస్‌ భాష’ (క్యాంపస్‌ లింగో). దీని సంగతేంటి?  మిలీనియల్స్‌ ...

Published : 01 Dec 2018 00:54 IST

క్యాంపస్‌ కొత్త భాష 

ఉమసా.. బిగొటా!

తెలుగు అమ్మ భాషే.. అవొచ్చు!  ఇంగ్లిష్‌..? ఎల్‌కేజీ నుంచే బట్టీ కొట్టేసి ఉండొచ్చు.  మునివేళ్లతో సాధన చేసిన ఎస్‌ఎంఎస్‌ కోడ్‌ భాషా మీకొచ్చిండొచ్చు. అయినా... అవసరానికి ఇతర పేరు లేని భాషలూ పుట్టుకొస్తాయి. అలా వచ్చినదే కొత్తగా వైరల్‌ అవుతున్న ‘క్యాంపస్‌ భాష’ (క్యాంపస్‌ లింగో). దీని సంగతేంటి?  మిలీనియల్స్‌ మస్తీ అంతా ఈ భాషలోనే సాగుతోంది. మరి, మీరు? ఫాలో అవడం మొదలెట్టారా?

మీకు ‘ఉమసా.. బిగొటా’ గురించి తెలుసా? అదేనండీ.. 
‘ఉమసా... ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 
బిగొటా.. బిల్ల, గొట్టం, టానిక్‌’ అన్నమాట. ఇదే తీరుగా ఈ క్యాంపస్‌ లాంగ్వేజీ పుట్టుకొస్తోంది. కాలేజీ క్యాంపస్‌ల్లో లేదంటే కేఫ్‌ల్లో  ఫ్రెండ్స్‌ మధ్య సంభాషణల్ని ట్రాక్‌ చేయండి. వారి మాటల మధ్యలో వచ్చే కొన్ని పదాలకు అర్థాలే వేరు. ఇదే మాదిరిగా సోషల్‌ లైఫ్‌లోనూ. వారు పెట్టే కామెంట్‌లు, పోస్టింగ్‌ల్లో సరికొత్త పదాల్ని సృష్టిస్తున్నారు. ఇంగ్లీషే కదాని నిఘంటువు తెరిస్తే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఆ పదానికి అర్థం దొరకకపోవొచ్చు. ఇంగ్లిష్‌ ఫ్రొఫెసర్‌కి కూడా అంతుచిక్కని పదాలవి.

కాలేజీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ గురించి వైభవ్‌, ప్రణయ్‌లు మాట్లాడుకుంటున్నారిలా... Varun behaves so salty under pressure, I stan Aryan's team ఆ సంభాషణ వింటున్న శ్రీనుకి కొన్ని పదాలు అర్థం కాలేదు. ఏంటీ salty, stan .. అని బుర్ర పీక్కున్నాడు. ఇంతకీ ఆ రెండు పదాలకు అర్థం ఏంటంటే..

salty- తప్పుగా ప్రవర్తించడం. 
stan- అభిమానిగా సపోర్టు చేయడంఉమసా.. బిగొటా!

మెట్రో నగరాల్లో విద్యార్థులు ఇప్పటికే ఈ కొత్త లాంగ్వేజీని ‘సీ’ లాంగ్వేజ్‌లా బాగానే ఒంటపట్టించుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న క్రాంతిని  పలకరిస్తే... ‘ఇంగ్లిష్‌ వ్యాకరణంలో పాస్ట్‌టెన్స్‌ పదాల్లా అనిపిస్తాయ్‌. కానీ, కాదు. ఉదాహరణకు You should be woke about the #Metoo movement అంటే వాక్యంలోని woke ఏంటో అర్థం కాదు. ఇక్కడ woke అంటే ‘అవగాహన ఉండాలని’ చెప్పడం అన్నమాట. ఇదే మాదిరిగా lit. ఇదేదో ‘లైట్‌’ పదానికి పాస్ట్‌టెన్స్‌ అనుకోవద్దు. దీనికి అర్థం ఏంటంటే... ‘అద్భుతం, ఫన్నీ’ అని. ఇలా సందర్భాన్ని బట్టి క్యాంపస్‌ భాషని వాడడంలో మజానే వేరు. ధారాళంగా ఇంగ్లిష్‌ మాట్లాడినా పెద్దగా పట్టించుకోరుగానీ.. ఈ క్యాంపస్‌ లింగోని జోడిస్తే మాత్రం ఫ్రెండ్స్‌ ఇట్టే కనెక్టు అవుతారు’

సృష్టించడం మంచిదే 
‘ఎవ్వరూ సృష్టించకుంటే కొత్త పదాలు ఎలా పుడతాయ్‌.’ ఎప్పుడో మాయబజార్‌ సినిమాలో ఘటోత్కచుడితో చెప్పించారీ మాట. మరి ఇప్పుడు అంగీకరించకుంటే ఎలా అంటున్నారు కొందరు భాషా నిపుణులు. భాష ఏదైనా సరికొత్త పదజాలం పుట్టుకొస్తున్నప్పుడే ఆ భాష నిలుస్తుంది అంటున్నారు వీరు. ఇంగ్లిష్‌ ప్రపంచ భాష కావడంతో ఇలాంటి పద జాలం తక్కువ సమయంలో ఆదరణ పొందుతుంది. పదాలు ఎలా పుడతాయ్‌ అనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అవసరానికి ఎవరో ఒకరు వాడితే అవి ట్రెండింగ్‌ మారిపోతుంటాయ్‌. తొందర్లో ఎవరో TTYL అని టైప్‌ చేస్తే.. Talk to You Later అని గుర్తుంచుకుంటున్నారు. ఇదే మాదిరిగా ROFL. అంటే.. Rolling On Floor Laughing అని.

సోషల్‌ లైఫ్‌లోనూ..

ఉమసా.. బిగొటా!

ట్విటర్‌ లాంటి చిట్టిపొట్టి సందేశాల సోషల్‌ నెట్‌వర్క్‌ వేదికల్లోనే కాకుండా అన్ని మాధ్యమాల్లోనూ మిలీనియల్స్‌ కొత్త పదాలతో సందడి చేస్తున్నారు. వ్యవహారిక భాషల్లో మాట్లాడుతూనే మధ్యలో వీటిని ప్రయోగించడంలో ఉండే కిక్కే వేరంటున్నారు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ కావ్య, సునైనా. ‘ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ల్లో లైక్‌ కొట్టడం. నచ్చిన అంశాల్ని సపోర్ట్‌ చేయడానికి ఇప్పుడు వాడుతున్న పదం yaas ఈ ఒక్కదానితో స్పందనని సవివరంగా చెప్పినట్టేనని’ అంటున్నారు. ఇంతకీ కొత్త పద జాలం ఎక్కడి నుంచి పుడుతోంది? ఇంకెక్కడా.. ఇంటర్నెట్‌, దాంట్లో నిత్యం సంచరిస్తూ తిరిగే మిలీనియల్స్‌ బుర్రలోంచి. మనసులోని భావాల్ని సంక్షిప్తంగా చెప్పే క్రమంలో సోషల్‌ మీడియా వేదికలు, వాట్సాప్‌ లాంటి మెసెంజర్లే ప్రయోగశాలలు. నచ్చిన పదాలు ఇట్టే వైరల్‌ అవుతాయి. ఇప్పుడీ ఈ పదాల ప్రభావం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, రియాలిటీ షోల్లోనూ కనిపిస్తోంది.

పరిమితం చేయాలి

ఉమసా.. బిగొటా!

కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని నింపుతుంది. ఇలా మిలీనియల్స్‌ మెదడుకి పని చెప్పి షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా కమ్యూనికేషన్‌కి కొత్త భాషని వాడడం కొంత మేరకు మంచిదే. సోషల్‌ మీడియా గ్రూపుల్లో వీటిని విధిగా వాడుతూ వారి ప్రత్యేకతని చాటుకునేందుకు యువత ఇష్టపడతారు. దీని ద్వారా వచ్చే ఇమేజ్‌ వారికి కిక్కిస్తుంది. అయితే, స్నేహితులు, సోషల్‌ మీడియాని ఫాలో అవుతూ అభ్యసించే ఈ భాషా ప్రయోగం కొంతవరకే పరిమితం చేయాలి. ఇదే భాషను హెచ్‌ఓడీ దగ్గర ఉపయోగిస్తే ఇబ్బందే. కొన్ని పరిమితులు పెట్టుకుని ఈ క్యాంపస్‌ లింగోని వాడితే  మంచిది.
- టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

 

ఉమసా.. బిగొటా!

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని