లక్షణంగా.. లక్ష్యం వైపు!

కాలేజీ సరదాలు ముగియగానే ఎవరైనా కెరీర్‌ పరుగు మొదలు పెట్టాల్సిందే. రంగం ఏదైనా మొదటి రోజు నుంచే స్పష్టమైన లక్ష్యం ఉండాలి. మంచి ఉద్యోగి అనిపించుకోవాలి. అప్పుడే పదోన్నతుల నిచ్చెన త్వరత్వరగా ఎక్కగలం. దానికేం లక్షణాలుండాలి?

Published : 04 Sep 2021 01:02 IST

కాలేజీ సరదాలు ముగియగానే ఎవరైనా కెరీర్‌ పరుగు మొదలు పెట్టాల్సిందే. రంగం ఏదైనా మొదటి రోజు నుంచే స్పష్టమైన లక్ష్యం ఉండాలి. మంచి ఉద్యోగి అనిపించుకోవాలి. అప్పుడే పదోన్నతుల నిచ్చెన త్వరత్వరగా ఎక్కగలం. దానికేం లక్షణాలుండాలి?

కోరిక: ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే త్వరత్వరగా ఎదగాలనే కోరిక బలంగా ఉండాలి. ఎన్నేళ్లలో ఏ స్థానంలో ఉండాలనే కచ్చితమైన లక్ష్యం.. దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలి.

అంకితభావం: మీరే రాజు, మీరే భటుడిలా అంకితభావంతో ఉంటే ఏ పనైనా తెగ నచ్చేస్తుంది. అప్పుడు ఆఫీసరైనా, అవసరమైతే క్లర్క్‌ పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. బాస్‌ బాధ్యతల్నీ పంచుకుంటాం.

ఒదిగి ఉండటం: ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడికే అన్నీ కలిసొస్తాయి. అందరితో బాగుంటే సహోద్యోగులు సలాం కొడతారు. బాస్‌ అభిమానిస్తాడు. సబార్డినేట్‌ గౌరవిస్తాడు.

ప్యాషన్‌: ఆఫీసు బాయ్‌ కావొచ్చు.. ఐటీ ఉద్యోగి అయ్యుండొచ్చు.. పనిపై ప్రేమ ఉంటేనే ఇష్టంగా చేయగలుగుతాం. చేస్తున్న కొలువు నచ్చకపోతే రోజూ ముళ్లకంపపై కూర్చున్నట్టే.

నిజాయతీ: పనిని ప్రేమించడమే కాదు.. నిజాయతీగా ఉంటేనే ఆఫీసులో మనకి గౌరవం. అబద్ధాలాడితే, చాడీలు చెబుతుంటే నలుగురిలో చులకనైపోతాం.

సృజనాత్మకత: అన్నీ మంచి లక్షణాలే ఉండి పనిలో మూస ధోరణితో ఉంటే దూసుకుపోలేం. చేస్తున్న పనిలో సృజనాత్మకత చూపించాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని