Updated : 13 Nov 2021 05:24 IST

ఉలితో.. మోదీ మది గెలిచాడు

పేరు వెనకాల ఎంబీఏ పట్టా ఉంది... ఐదంకెల జీతమిచ్చే కార్పొరేట్‌ కొలువు వెల్‌కమ్‌ పలికింది... అయినా దాన్ని వదిలి వారసత్వ కళకే జై కొట్టాడు అరుణ్‌ యోగిరాజ్‌... ఆపై దేశం మెచ్చే శిల్పాలు చెక్కాడు.. అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు... తాజాగా ప్రధాని ఆవిష్కరించి, ప్రశంసించిన పన్నెండు అడుగుల జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహం.. తన కళా నైపుణ్యమే!

పదేళ్లకే..

అరుణ్‌ తండ్రి, తాతలు ప్రఖ్యాత శిల్పులు. రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక శిల్ప కళా రూపాలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాల్లో పాలు పంచుకున్నారు. ఈ కుటుంబం మైసూరులోని అగ్రహారంలో గురుకులం నిర్వహిస్తుండటంతో అరుణ్‌ చదువుతోపాటు పదో ఏటే ఉలి పట్టాడు. బడి పూర్తవగానే ఇంటి ఆవరణలో రూపుదిద్దుకునే శిల్పాలపై మనసు లగ్నం చేసేవాడు. ఎంత పేరొచ్చినా రాతికి జీవం పోసే కళాకారుల జీవితాల్లో వెలుగులు ఉండవని, కొడుకుని వృత్తికి దూరంగా పెట్టాలనుకున్నారు అరుణ్‌ తల్లి. ఆమె కోరిక మేరకు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు.

కళని వదల్లేక..

చదువైపోగానే హెచ్‌ఆర్‌ విభాగంలో ఉద్యోగం వచ్చింది. జీతానికి ఢోకా లేదు. కానీ ఉదయం పది నుంచి రాత్రి ఏడు దాకా పని. తర్వాత విగ్రహాలతో కుస్తీ. అలసిపోయేవాడు. తనకిష్టమైన కళపై మనసు పెట్టలేకపోతున్నాననే అసంతృప్తి. లక్ష రూపాయలకుపైగా జీతమొచ్చే ఉద్యోగం మానేద్దామనుకున్నాడు. అది అమ్మకు నచ్చలేదు. అప్పుడే కేంద్రప్రభుత్వ పురస్కారం వరించింది. కళతోనూ ఎంతో పేరు సంపాదించవచ్చని ఆమెకి అర్థమైంది. తర్వాత అరుణ్‌ వెనుదిరిగి చూసుకోలేదు. కవులు, స్వాతంత్ర సమరయోధులు, సినీ, రాజకీయ ప్రముఖులు, రచయితలు, దేవతామూర్తుల విగ్రహాలకు జీవం పోస్తూనే ఉన్నాడు. ఆధునికత కోసం ప్రపంచంలోని పేరొందిన శిల్ప కళాకారుల చిత్రాలు, వారి శైలిని పరిశీలించడం మొదలుపెట్టాడు.


శంకరచార్యతో శిఖరానికి..

శంకరాచార్య విగ్రహం తయారీ కోసం 2020 జూన్‌లో హంపి విశ్వవిద్యాలయం విజువల్‌ ఆర్ట్స్‌ విభాగం నుంచి అరుణ్‌కి పిలుపు వచ్చింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో వెంటనే పనిలోకి దిగాడు. ముందు శంకరాచార్య గురించి అధ్యయనం మొదలు పెట్టాడు. వేయికిపైగా చిత్రాలు పరిశీలించాడు. 25 రోజుల్లో రెండడుగుల నమూనా విగ్రహాన్ని సిద్ధం చేశాడు. దేశవ్యాప్తంగా మరో ఐదుగురు శిల్పులు నమూనాలు తయారు చేసినా ప్రధానికి అరుణ్‌ పనితనమే నచ్చింది. తర్వాత తొమ్మిది నెలల్లో 12 అడుగుల పూర్తి విగ్రహాన్ని తయారు చేశాడు. దీన్ని మైసూరు జిల్లా హెచ్‌.డి.కోటె కొండ ప్రాంతంలో లభ్యమయ్యే కృష్ణశిలతో, ఏడుగురు సహాయకులతో కలిసి రూపొందించాడు. నవంబరు 5న ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని కేదార్‌నాథ్‌లో ఆవిష్కరించారు. మరోవైపు జాతీయస్థాయి వాలీబాల్‌ క్రీడాకారుడిగా కూడా రాణిస్తున్నాడు అరుణ్‌.

* కేంద్ర సాంస్కృతిక శాఖ యువ ప్రతిభా పురస్కారం.
* కన్నడ రాజ్యోత్సవ పురస్కారం.
* ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ నుంచి ప్రత్యేక ప్రశంసలు.
* ఆర్కే లక్ష్మణ్‌ కామన్‌ మ్యాన్‌, రామకృష్ణ పరమహంస, జయచామరాజేంద్ర వడయార్‌, డా.అంబేడ్కర్‌, గరుడేశ్వర విగ్రహాలు బాగా పేరు తెచ్చాయి.
* యాంటీ గ్రావిటీ విధానంతో విగ్రహాలు చెక్కటం, ఏ భాగం నుంచైనా ప్రారంభించి పని పూర్తి చేయటం అరుణ్‌ ప్రత్యేకత.

- కె.ముకుంద, బెంగళూరు


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని