బీటెక్ చదివి.. అరుదైన హాబీ
కోడూరి నాగ సూర్య రాఘవేంద్రరావు. చదివింది బీటెక్. సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా తీపర్రు. తను అందరిలాంటి కుర్రాడే. ఆసక్తే భిన్నం. నాణేలు సేకరించడం తన హాబీ. ‘ఇదేం ప్రత్యేకత? ఇలాంటివాళ్లు చాలామంది ఉంటారుగా’ అంటారా? తను ప్రత్యేక దినాలు, సందర్భాల్లో రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన కాయిన్స్ మాత్రమే సేకరిస్తుంటాడు. మదర్ థెరిసా పుట్టినరోజు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం, అంతర్జాతీయ కుటుంబం దినోత్సవం, ఓఎన్‌జీసీ ఆవిర్భావ దినోత్సవం, రైల్వే వ్యవస్థాపక దినం.. ఇలాంటివి వందకుపైనే తన దగ్గర ఉన్నాయి. వీటన్నింటిని సేకరించడానికి చాలానే కష్టపడ్డాడు రాఘవేంద్ర. దీనికోసం తనలాంటి ఆసక్తి ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో సభ్యుడయ్యాడు. అధికారుల్ని తరచూ సంప్రదిస్తుంటాడు. రాష్ట్రాలు తిరిగాడు. విదేశాల్లోని స్నేహితులతో ‘టచ్’లో ఉంటాడు. బంధువుల్నీ ఆరా తీస్తుంటాడు... పదోతరగతిలో ఈ ఆసక్తి మొదలైందంట. విదేశాల్లోనూ ఇలా ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన నాణేలను సేకరించి వీటితో ప్రదర్శన ఏర్పాటు చేయడం లక్ష్యమంటున్నాడు. ఈ అరుదైన అలవాటుకి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ ఈమధ్యే వరించింది.
Advertisement