పాజిటివ్‌ సేవకుడు

బీటెక్‌ పూర్తవగానే ఉద్యోగం వచ్చింది... ఇరవై మూడేళ్లకే మంచి జీతం.. సరదాల జీవితం... కానీ మలినేని వంశీకృష్ణ కొన్నాళ్లకే కొలువు మానేసి సేవల బాట పట్టాడు... హెచ్‌ఐవీ బాధిత చిన్నారుల్ని ఆదరిస్తూ, వాళ్లకి బతుకుపై ఆశల్ని చిగురించేలా చేస్తున్నాడు. డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా ‘ఈతరం’తో తన అనుభవాలను పంచుకున్నాడు.

Updated : 27 Nov 2021 06:07 IST

బీటెక్‌ పూర్తవగానే ఉద్యోగం వచ్చింది... ఇరవై మూడేళ్లకే మంచి జీతం.. సరదాల జీవితం... కానీ మలినేని వంశీకృష్ణ కొన్నాళ్లకే కొలువు మానేసి సేవల బాట పట్టాడు... హెచ్‌ఐవీ బాధిత చిన్నారుల్ని ఆదరిస్తూ, వాళ్లకి బతుకుపై ఆశల్ని చిగురించేలా చేస్తున్నాడు. డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా ‘ఈతరం’తో తన అనుభవాలను పంచుకున్నాడు.

ఎయిడ్స్‌తో మరణం తప్పదు అనే అభిప్రాయం మారాలి. మా దగ్గర మూడేళ్ల వయసున్నప్పుడు హెచ్‌ఐవీ సోకిన పిల్లాడు వచ్చాడు. తనకిప్పుడు 17 ఏళ్లు. ఇలాంటివాళ్లు ఎంతోమంది. పెద్దలు చేసిన తప్పు కారణంగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊహ తెలిసిన తర్వాత మేం ‘ఏం పాపం చేశాం?’ అని కుమిలిపోతుంటారు వాళ్లు. మా గురించి తెలిస్తే చీదరించుకుంటారని సమాజానికి దూరంగా ఉంటారు. అలాంటివాళ్లకు ఈ సమాజం అండగా ఉంటే సగం జబ్బు నయమైపోతుంది. అల్పాయుష్కులు మరికొంత కాలం సంతోషంగా జీవిస్తారు.

హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులంటే ఇప్పటికీ చాలామందికి చిన్నచూపే. వాళ్ల దగ్గరికి వెళ్లాలంటేనే భయం. అలాంటిది వాళ్ల ఆలనాపాలనా చూస్తూ, నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు వంశీ. ఖమ్మం నగరానికి చెందిన అరుణ.. పేదలు, గృహహింసకు గురవుతున్న మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 1991లో ‘ప్రియదర్శిని సేవామండలి’ అనే స్వచ్ఛంద సంస్థని ప్రారంభించారు. ఈ క్రమంలో హెచ్‌ఐవీ మహిళలు, వాళ్ల ద్వారా పుట్టిన చిన్నారుల గురించి తెలిసి చలించిపోయారు. వాళ్లను చేరదీయడం మొదలుపెట్టారు. ఆమె కొడుకే వంశీకృష్ణ. కాలేజీ రోజుల నుంచే తల్లికి అండగా ఉండేవాడు. 2010లో బీటెక్‌ పూర్తైంది. కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఈలోపు అరుణ హైదరాబాద్‌లో మరో వృద్ధాశ్రమం తెరిచారు. అందులో వందమంది వరకు ఉన్నారు. ఖమ్మం, హైదరాబాద్‌.. రెండుచోట్లా బాధితులు, వృద్ధుల బాగోగులు చూసుకోవడం, విరాళాలు సేకరించడం, నిర్వహణ.. కష్టం కావడంతో కొద్దిరోజులకే చేస్తున్న ఉద్యోగం సైతం మానేశాడు వంశీ. ప్రస్తుతం సంస్థలోని హెచ్‌ఐవీ బాధిత చిన్నారులని నెలనెలా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నాడు. మందులు ఇప్పిస్తాడు. పౌష్టికాహారం అందిస్తున్నాడు. ‘గతంతో పోలిస్తే జనాల్లో క్రమంగా మార్పు వస్తోంది. ఇది అంటువ్యాధి కాదు అని నమ్మడంతో ప్రజలు బాధితుల పట్ల కొంచెం జాలి చూపిస్తున్నారు. నగరాల్లో ఈ రకమైన వాతావరణం ఉన్నా పల్లెలు, చిన్న పట్టణాల్లో అవగాహన లేక ఇప్పటికీ హెచ్‌ఐవీ రోగులను బాధితులుగా కాకుండా తప్పు చేసినవారిగా చూస్తున్నారు. ఈ అభిప్రాయం చెరిపేయడానికి సంస్థ తరపున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించి ఎవరైనా హెచ్‌ఐవీ బారిన పడినట్టుతేలితే పుట్టబోయే పిల్లలకు వైరస్‌ సోకకుండా మందులతో ప్రయత్నిస్తాం లేదా  గర్భవిచ్ఛిత్తి చేయిస్తున్నాం’ అని తమ కార్యక్రమాలు వివరిస్తున్నాడు వంశీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని