తగ్గేదే లే..
ఈ లోకం తీరే అంత! పడ్డవాడ్ని పైకి లేపేవాడు ఉంటాడో.. లేడో తెలియదుగానీ పైకి ఎదుగుతున్న వాడిని పడదోయాలని చూసేవాళ్లే ఎక్కువ. అలాగని ఆలోచిస్తూ కూర్చుంటే కుర్రకారు ఉన్నచోటే ఆగిపోతారు. ఇక్కడ ఎవరికి వారే తోపు. తగ్గేదే లే అనుకుంటూ ముందుకెళ్తేనే.. కెరీర్, వ్యక్తిత్వం.. అన్నింట్లో రాటుదేలతారు. దానికోసం కొన్ని సూత్రాలు మాత్రం పాటించి తీరాల్సిందేనంటారు నిపుణులు.
* పోల్చుకోవద్దు: లక్ష జీతమొచ్చే ఉద్యోగి నెలాఖరుకి అప్పు చేసే పరిస్థితి ఉంటే.. పాతిక వేలొచ్చే చిరుద్యోగి జాలీగా గడిపేస్తుంటాడు. ఎవడి సత్తా, ఎవడి ఖర్చులు వాడివి. పక్కవాడితో పోల్చుకోవడం మానేస్తే, పక్కోడిలా బతకాలని ఆలోచించడం మానేస్తే సగం కష్టాలు తీరినట్టే.
* సొంతంగా: పుట్టుక నీది.. బతుకు నీది.. నీ నిర్ణయాలకు అనుగుణంగా కష్టం, సుఖం అనుభవించేది నువ్వు. అలాంటప్పుడు ఇతరులపై ఆధారపడటం ఎందుకు? వాళ్ల అభిప్రాయాల కోసం ఎదురు చూడటం ఎందుకు? ఆచితూచి ఏది మంచో అదే చేయాలి.
* తప్పులు చేద్దాం: తప్పు చేయడం తప్పు కాదు.. చేసిన తప్పు మళ్లీ చేయడమే తప్పు. ఏదైనా పని చేస్తే తప్పు జరుగుతుందని పని చేయకపోవడం పెద్ద తప్పు. ప్రయోగాలు, ప్రయత్నాలకు వెనకాడొద్దు. జీవితంలో ఎదగాలంటే సాహసాలు చేయాల్సిందే. అప్పుడే పొరపాట్ల నుంచి నేర్చుకోగలుగుతాం. థామస్ అల్వా ఎడిసన్ వేలసార్లు విఫల ప్రయత్నాలు చేశాకే.. ఈ జగానికి వెలుగులు పంచే బల్బ్ కనుక్కున్నాడు.
తగ్గేదే లే: అందంగా లేననో, ఐశ్వర్యవంతుడ్ని కాననో, తొడ కొట్టే వంశంలో పుట్టలేదనో.. నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. ప్రయత్నాలకు వెనకడుగేయొద్దు. మన మనసుకు నచ్చిందే చేయాలి. చేసేది మంచిపనైతే ఎవరికీ జడిసేదే లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగేయాలి.
* గళం పెంచాలి: ఈ ఆధునిక జమానాలో వాయిస్ ఉన్నోడివైపే జనం. మన గొంతు ఒక మజిల్లాంటిది. వ్యాయామం చేసేకొద్దీ కండరాలు రాటుదేలుతాయి. గళం పెంచినకొద్దీ మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* సంతోషం వదలొద్దు: లక్ష్యం స్పష్టంగానే ఉండాలి. దానికోసం మూతి ముడుచుకోవడాలు.. సరదాలు మానుకోవడాలు వద్దు. పనిలో సీరియస్‌గానే ఉండాలి. దానికోసం త్యాగాలు చేయొద్దు. సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడుకోవడం.. కుదిరితే వారాంతంలో స్నేహితులతో చిన్న ట్రిప్‌లు జీవితానికి సొబగులద్దుతాయి.
Advertisement