Updated : 25 Dec 2021 04:33 IST

అందమైన..ఆల్‌రౌండర్‌!

పుస్తకాలు తెగ చదివేస్తుంది.. చదువులో మెరిట్‌ కాదు. దునియా మొత్తం తిరిగేస్తోంది.. కానీ ఒంటరిగా ఉండటమే ఇష్టం. అందాల అప్సరసే.. అదేంటో ఇంతవరకు ఒక్కరూ ప్రపోజ్‌ చేయలేదు. ఈమధ్యే ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటాన్ని కొల్లగొట్టిన మన పంజాబీ అమ్మాయి హర్నాజ్‌ సంధూ సంగతులివి. ఆ వివరాలన్నీ ‘ఈతరం’తో ప్రత్యేకంగా పంచుకుంది.

స్ఫూర్తి: ప్రియాంకా చోప్రా, లారా దత్తా, సుస్మితా సేన్‌లు.. ఈ పేర్లు విన్నప్పుడల్లా నా ఒళ్లు పులకరిస్తుంది. ఎందుకో తెలియదు.. చిన్నప్పట్నుంచీ అందాల పోటీలు ఎక్కడ జరిగినా ఆసక్తిగా గమనించేదాన్ని.
అందాల కిరీటాలు గెలిచిన వాళ్లను జనం ఆరాధించడం చూస్తుంటే.. ఎప్పటికైనా నేనూ ఆ స్థాయికి వెళ్లాలనుకునేదాన్ని. మిస్‌ యూనివర్స్‌ అయ్యాక శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతుంటే.. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందనిపిస్తోంది.  

తేలికేం కాదు: ప్రతి విజయం వెనకాల ఎంతో కష్టం దాగుంటుంది. జీవితంలో విజయాలు సాధించాలంటే త్యాగాలు చేయాల్సిందే. డ్యాన్స్‌, అందాల పోటీల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం.. థియేటర్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం.. ఇష్టమైన కుటుంబం, ఊరు వదిలి ముంబయి వచ్చేయడం.. ప్రతిక్షణం లక్ష్యం మీదే ధ్యాస పెట్టడం.. ఇవన్నీ చేస్తూ, ఒక్కో మెట్టే ఎక్కుతూ చివరికి నా కల నెరవేర్చుకున్నా.

ఇదో బాధ్యత: ఇప్పుడు నా తలపై మిస్‌ యూనివర్స్‌ కిరీటం ఉంది. నా దృష్టిలో ఇది అందాల కిరీటమే కాదు.. నా భుజాలపైకి వచ్చిన కొత్త బాధ్యత కూడా. ఈ టైటిల్‌తో నాకో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దాన్ని ప్రపంచ వేదికపై మహిళల గొంతు వినిపించుకునేలా మలుస్తా. సమాన హక్కుల కోసం నినదిస్తా. కిరీటం ద్వారా వచ్చే గుర్తింపు, ప్రభావంతో నలుగురికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేస్తా.

మరపురాని రోజులు: ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేస్తున్నా. అందరిలాగే నాకూ కాలేజీ రోజులే జీవితంలో గోల్డెన్‌ డేస్‌. కాలేజీకొచ్చాకే థియేటర్‌ ఆర్ట్స్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌ నేర్చుకున్నా. కాలేజీలో నిర్వహించే ఉత్సవాలు, డిబేట్లకు ముందుంటా. మొదట్నుంచీ నేను టీచర్లకు నచ్చే అమ్మాయిని. అలాగని చదువుల్లో మెరిటేం కాదు. ఇక ముందునుంచీ అమ్మాయిల కాలేజీలోనే చదవడంతో ప్రేమలూ, ప్రపోజళ్లేం లేవు. థియేటర్‌ క్లాసులు, లైబ్రరీలో కూర్చొని నాకిష్టమైన పుస్తకాలు చదవడం కోసం అప్పుడప్పుడు తరగతులకు బంక్‌ కొట్టేదాన్ని.

ఆల్‌రౌండర్‌ని: అందం, నటనేనా..? అంటే నా దగ్గర ఇంకొన్ని కళలున్నాయి. నేను సింగర్‌ని. కొన్నాళ్లు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నా. నాన్న మంచి రచయిత. ఆయన స్ఫూర్తితో కవితలు రాస్తా. వంట చేస్తే ఇంట్లోవాళ్లు లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఖాళీగా ఉంటే గార్డెనింగ్‌ చేస్తా. మిమిక్రీ బాగా వచ్చు. అందుకే నా ఫ్రెండ్సంతా నన్ను ‘ఆల్‌రౌండర్‌’, ‘మల్టీ టాలెంటెడ్‌’ అని పిలుస్తుంటారు.

నిజమైన అందం: మేకప్‌తో వచ్చే అందం శాశ్వతం కాదు. మనసు అందంగా ఉండాలి. మన మనసులో మంచి ఉంటే అది మొహంలో కనిపిస్తుంది. మనిషి వ్యక్తిత్వం, ఇతరులకు సాయపడే గుణమే నిజమైన అందం.

* హర్నాజ్‌ అంటే?: అంతా గర్వపడే అమ్మాయి.
* అందం రహస్యం?: యోగా. పన్నెండేళ్ల నుంచి చేస్తున్నా.
* నీలో నీకు బాగా నచ్చేవి: కళ్లు.. ఇవి  చాలా విషయాలు చెబుతాయి.
* హాబీలు: ప్రయాణాలు, వంట చేయడం, గంటలకొద్దీ ఒంటరిగా కూర్చోవడం.
* యూత్‌కో సలహా: ఏదైనా సాధించగలనని నిన్ను నీవు నమ్ము.
* డబ్బుకిచ్చే విలువ: డబ్బు విలాసాలనిస్తుంది. వ్యక్తిత్వం సంతోషాలనిస్తుంది.
* సామాజిక మాధ్యమాలంటే: మన గళం వినిపించేవి.
* ఇష్టమైన నటుడు: షారూఖ్‌ ఖాన్‌
* అందమైన చిట్కా: ఎక్కువ నీళ్లు తాగండి. తక్కువ సౌందర్యోపకరణాలు వాడండి.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని