కదం తొక్కితే..విజయం నీదే!

జిమ్‌కెళ్లి కండరగండడు అయిపోవాలని ఓ కుర్రాడి ఆశ... మూడ్రోజుల మురిపెం తీరగానే ముసుగు తన్ని పడుకుంటాడు... పాడు స్మోకింగ్‌ మానేయాలనేది యువోద్యోగి పంతం... కొన్నాళ్లు గడవగానే ఎప్పట్లాగే గుప్పుగుప్పుమంటుంటాడు... బరువు తగ్గి మెరుపుతీగలా మారాలనేది ఆ అమ్మాయి కల...

Updated : 08 Jan 2022 05:59 IST

జిమ్‌కెళ్లి కండరగండడు అయిపోవాలని ఓ కుర్రాడి ఆశ...
మూడ్రోజుల మురిపెం తీరగానే ముసుగు తన్ని పడుకుంటాడు...
పాడు స్మోకింగ్‌ మానేయాలనేది యువోద్యోగి పంతం...
కొన్నాళ్లు గడవగానే ఎప్పట్లాగే గుప్పుగుప్పుమంటుంటాడు...
బరువు తగ్గి మెరుపుతీగలా మారాలనేది ఆ అమ్మాయి కల...
విఫల ప్రయత్నాలతో విసిగి కాడి వదిలేస్తుంది...
నయా సాల్‌లో ఇదంతా షరా మామూలే. ఉత్సాహంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవడం.. ఉసూరుమనడం!
ఇంతకీ లోపం ఎక్కడుంది? మనం ఏం చేయాలి?  

‘అమెరికన్‌ సైకాలజీ అసోసియేషన్‌’ అధ్యయనం ప్రకారం యువత ప్రతి ఏడాదీ కొత్త ‘రెజల్యూషన్స్‌’ తీసుకుంటుంటారు. లక్ష్యం చేరేది మాత్రం పన్నెండు శాతమేనట. ఏంటీ రెజల్యూషన్‌? అని మానసిక నిపుణురాలు చల్లా గీతని అడిగితే ‘రెజల్యూషన్‌ ఈజ్‌ నథింగ్‌ బట్‌.. రిజాల్వింగ్‌ సమ్‌థింగ్‌. ఈ పదంలోనే అర్థం ఉంది’ అంటారామె. అంటే మనమేం కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవడం లేదు. ఉన్న సమస్యకు పరిష్కారం వెతుక్కుంటున్నాం.. అంతే! ముందు ఆ సమస్య ఏంటో స్పష్టంగా తెలియాలంటే ఎందుకు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎవరు? ఎందుకు? ఎలా? అనే ఐదు ‘డబ్ల్యూ’లు, ఒక ‘హెచ్‌’ సూత్రం అనుసరించాలంటారామె. ఉదాహరణకు ఓ కుర్రాడు బరువు తగ్గాలి అనుకుంటున్నాడు అనుకుందాం. ‘ఎందుకిలా?’ అంటూ మొదలుపెట్టాలి. అధికంగా తినడం.. తిండివేళలు పాటించకపోవడం.. ఒత్తిడి.. ఇలా ప్రశ్నించుకుంటూ వెళ్తే సమస్యకు మూలం ‘ఒత్తిడి’, ‘సమయపాలన పాటించకపోవడం’ అని తేలుతుంది. తర్వాత పరిష్కారానికి దారులు వెతుక్కోవాలి. SMARTYగా సాగితే ఈ లక్ష్యాలు చేరడం పెద్ద కష్టమేం కాదంటారు నిపుణులు. ఏంటవి అంటే...

Specific: నిర్దిష్టత: అసలు మన సమస్య ఏంటి? పరిష్కారమేంటి.. ఏం చేయాలనుకుంటున్నాం? ఏం కావాలనుకుంటున్నాం.. స్పష్టత ఉండాలి.

Measurable:  కొలవగలిగేది: ఏమేం చేయాలి? ఎలా చేయాలి? ఎంత సమయంలో చేయాలి? ఎలాంటి మార్గం ఎంచుకోవాలో తెలియాలి.

Attainable: సాధ్యమయ్యేవే: డిగ్రీ కూడా పాస్‌ కాని కుర్రాడు సివిల్స్‌ కొట్టాలంటే సాధ్యం కాదుగా. సాధ్యమయ్యే లక్ష్యాలే పెట్టుకోవాలి .

Relavant: వాస్తవికత: ఐటీ కొలువు కొట్టాలంటే ఊహల్లో ఉంటే సరిపోదు. బీటెక్‌ చదవాలి.. సంబంధిత కోర్సు చేయాలి. మన లక్ష్యాలు వాస్తవికంగా ఉండాలి.

Time: సమయం: నిర్దేశిత లక్ష్యాలు చేరడానికి ఎంత సమయం కావాలో తెలుసుకోవాలి. సిక్స్‌ప్యాక్‌ కావాలంటే రాత్రికి రాత్రే సాధ్యం కాదు. దానికోసం ఆర్నెల్లైనా కష్టపడాలి.

Your's: సొంత లక్ష్యం: ఎవరో చెప్పారనో.. ఎవరో తిట్టారనో రెజల్యూషన్‌ తీసుకోకూడదు. తమంత తాముగా నిర్దేశించుకుంటే దాన్ని సాధించాలనే తపన పెరుగుతుంది.


ఎందుకు ఫెయిలవుతున్నారు?

* రెజల్యూషన్‌ వైఫల్యానికి ముఖ్య కారణం.. శక్తికి మించిన లక్ష్యాలు ఏర్పరచుకోవడమే. అర్ధరాత్రి దాకా చదివి, పనిచేసి పొద్దునే లేచి గంటలకొద్దీ వ్యాయామం చేయడం శక్తికి మించిన పనే అవుతుంది. పుస్తకాలంటేనే ఉలిక్కిపడే కుర్రాడు.. సివిల్స్‌ క్రాక్‌ చేయాలనుకోవడం కలే.

* చాలామంది ఫెయిలవడానికి కారణం తమపై నమ్మకం లేకపోవడం. ఒక పరీక్షలో ఫెయిలైతే ఇక నేను విజయం సాధించలేను అనుకుంటారు. కానీ చాలామంది విజేతలు ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొని పట్టువదలక ప్రయత్నించి విజయం సాధించినవారే.

* ఒకే సమయంలో అన్ని పనులూ చేయాలనుకోవడం అవివేకం. ఒక్క పనిలో నైపుణ్యం సాధించాలనే తపనతో రగిలిపోవాలి.

ఒక్కసారి లక్ష్యం నిర్దేశించుకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుదిరగొద్దు. ఆ లక్ష్యం సాధ్యమా? కాదా? అన్నది ముందే నిర్ణయించుకోవాలి.


హడావుడి వద్దు..

క్ష్యం చేరుకోవాలి అనుకోగానే సరిపోదు. దానికి అనువైన పరిస్థితులు కూడా ఉండాలి.  శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలించాలి. చుట్టూ ఉన్న వ్యక్తులు సహకరించాలి. రేపటి కోసం ఆదరాబాదరాగా ఈ రాత్రికే ఓ నిర్ణయం తీసేసుకుంటే కుదరదు. ప్రణాళిక కొద్దినెలల ముందు నుంచే మొదలవ్వాలి. శరీరం సహకరించనప్పుడు, మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు.. తీసుకునే నిర్ణయాలు మనలేవు. వీటన్నింటికన్నా ముఖ్యంగా.. మనం ఏదైనా ఒక లక్ష్యం కోసం సాధన చేస్తున్నప్పుడు వెనక్కిలాగే జనం చుట్టూ ఉంటే ఉత్సాహం నీరుగారిపోతుంది. ప్రోత్సహించేవాళ్లు, మనలాంటి లక్ష్యాలతో ఉన్నవాళ్లతోనే జట్టుకట్టాలి. అవసరమైతే వాట్సప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో చేరాలి.


మానసిక నిపుణుల పారిభాషిక పదాల్లో చెప్పాలంటే ప్రతి వ్యక్తి తమ సమస్యకు ఆరు రకాల పరిష్కారం ఆలోచిస్తాడు. దీన్నే రంగుల్లో వర్ణిస్తూ ‘సిక్స్‌ థింకింగ్‌ హ్యాట్స్‌’ అంటుంటారు.

తెలుపు వర్ణం: సమస్య పరిష్కారానికి, లక్ష్యం చేరడానికి ఉన్న ప్రతి సమాచారం సేకరిస్తారు. బరువు తగ్గాలంటే.. ఏం తినాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? శిక్షణెక్కడ తీసుకోవాలి.. ఇలా సమస్తం. నచ్చిన పద్ధతుల్లో ముందుకెళ్తారు.

పసుపు రంగు: ఇది ఆశావాదానికి గుర్తు. సానుకూల దృక్పథమే వీరిని సగం వరకు విజయం వైపు నడిపిస్తుంది. తమకు తోచింది చేస్తూ.. కాస్త ఆలస్యంగానైనా విజయం సాధిస్తారు.

నలుపు వర్ణం: తమని తాము అంచనా వేసుకొని.. ఎక్కడ వైఫల్యం చెందుతారో అక్కడే దృష్టి పెడతారు. ఆ అవాంతరాలు అధిగమిస్తారు.

ఎరుపు రంగు: భావోద్వేగాలకు గుర్తు. ఉద్యోగం సంపాదిస్తే.. పొగ తాగడం మానేస్తే.. కలిగే లాభాలు, సంతోషం.. అనుక్షణం ఊహించుకుంటూ అందుకు తగ్గ పరిష్కారాలు వెతుక్కుంటారు.

ఆకుపచ్చ రంగు: సృజనాత్మకత. హార్డ్‌వర్క్‌ కాకుండా స్మార్ట్‌వర్క్‌ని నమ్ముకునేవాళ్లు. లక్ష్యం చేరడానికి దగ్గరి దారులు అన్వేషిస్తారు.

నీలం వర్ణం: పైన చెప్పిన అన్ని ఆలోచనలు, రంగులు ధరించే, దారుల్లో దూసుకెళ్లే ఆల్‌రౌండర్లు. అనుకున్నది సాధించడంలో ముందుండే వారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని