Updated : 12 Feb 2022 10:06 IST

మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ!

ఒకరిది రంగుల లోకం... ఇంకొకరిది పరిశోధనల ప్రపంచం... ఒకరు నిత్యం జనాల్లోనే ఉంటారు... మరొకరు ల్యాబ్‌ దాటి బయటికి రారు... ఈ భిన్న ధ్రువాల్ని ఒక్కటి చేసింది ప్రేమ... ఆ జంటే సుమంత్‌ అశ్విన్‌, దీపికలు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ ప్రణయం, పరిణయాల ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నారు.


నా కోసమే పుట్టింది..
- సుమంత్‌ అశ్విన్‌
మా కజిన్‌ పెళ్లిలో మొదటిసారి దీపికను కలిశాను. ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ కాదుగానీ తనని చూడగానే ఒక రకమైన సదభిప్రాయం ఏర్పడింది. పెద్దల్ని పలకరిస్తున్న తీరు, కలుపుగోలుతనం, నవ్వు.. తెగ నచ్చేశాయి. తర్వాత నేను సినిమాల హడావుడిలో పడిపోయా. ఆ సమయంలోనే ఇంట్లోవాళ్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. పెళ్లంటే పెద్ద నిర్ణయం. ఏమాత్రం తప్పటడుగు వేసినా జీవితాంతం బాధ పడాలి. నాకు సరిపోయే వ్యక్తి ఎవరని ఆలోచించినప్పుడు నా మదిలో మెదిలింది దీపికనే. ఓసారి క్యాజువల్‌గానే ఫోన్‌ చేశా. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడింది. ఇంకా కెరీర్‌, జీవితం పట్ల స్పష్టంగా ఉందని అర్థమైంది. రోజురోజుకీ ఇష్టం పెరగడంతో తను నాకోసమే పుట్టిందనే నిర్ణయానికొచ్చా. కొద్దిరోజులకి దీపిక గురించి అమ్మానాన్నలకు చెప్పా. అప్పుడు జరిగిందో చిత్రం. వాళ్లు కూడా తననే కోడలిగా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ రకంగా నా ప్రేమని అమ్మానాన్నలే ముందుకు తీసుకెళ్లారనిపించింది. తర్వాత ముహూర్తం, పెళ్లి చకచకా జరిగిపోయాయి. ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక మా రెండు కుటుంబాలు కలిసి రాజమండ్రిలోని ఓ బంధువుల ఇంటికెళ్లాం. అక్కడ అందరం కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సమయంలోనే మేమిద్దరం టెర్రస్‌ పైకి వెళ్లి మనసు విప్పి మాట్లాడుకోవడం.. కలిసి ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ చేయడం.. కాఫీ షాప్‌, రెస్టరెంట్‌కి వెళ్లడం.. మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. పెళ్లైన వెంటనే దీపిక అమెరికా వెళ్లిపోయింది. నేను సినిమాలతో బిజీ. ఇద్దరం దూరంగా ఉన్నా.. ప్రేమికుల్లా ఫోన్‌, వీడియోకాల్స్‌ చేసుకుంటాం. స్వీట్‌ నథింగ్స్‌ చెప్పుకుంటాం. కష్టసుఖాలు పంచుకుంటాం. కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కోసారి చిన్నచిన్న వాదోపవాదాలు జరుగుతుంటాయి. అందులో నుంచే కామెడీ పుడుతుంది. నవ్వుకుంటాం.. కానీ గొడవల దాకా వెళ్లం. దీపిక సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. ఎవరైనా ఆపదల్లో ఉంటే స్పందించి సాయం చేస్తుంది. అవసరమైతే తన అవసరాలూ వాయిదా వేసుకుంటుంది. మా కుటుంబంతో కలుపుగోలుగా ఉంటుంది. మా ఇంట్లో కూడా తనంటే అందరికీ ఇష్టం.


గర్వం అసలే లేదు..
- దీపిక

అక్క పెళ్లి హడావుడిలో ఉన్నప్పుడు ‘హీరో సుమంత్‌ అశ్విన్‌ వచ్చాడు’ అని అంతా గోల చేస్తుంటే నేనూ వెళ్లా. కానీ ఎక్కడా ఆ దర్పం లేదు. సాదాసీదాగా కనిపించారు. అందరిలాగే మామూలుగా మాట్లాడసాగారు. నాకది బాగా నచ్చింది. తర్వాత అప్పుడప్పుడు ఫోన్‌ చేసుకునేవాళ్లం. అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. కెరీర్‌ గురించి చర్చించేవాళ్లం. కొద్దిరోజుల్లోనే ఒకరికొకరం నచ్చాం. నేను అక్క పెళ్లి కోసం కొద్దిరోజులు సెలవు పెట్టి ఇండియాకొచ్చా. ఈ సమయంలోనే తనతో పరిచయం.. ప్రేమ.. అన్నీ అయ్యాయి. సుమంత్‌ అమ్మానాన్నలే మా పెళ్లికి ముందుకు రావడంతో ముహుర్తాలు పెట్టుకున్నాం. ‘సినిమా వాళ్ల జీవితాలు, జీవనశైలి వేరుగా ఉంటాయి. కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించకపోవచ్చు’ ఇలాంటి మాటలు చాలా వినేదాన్ని. కానీ.. నాకు అందులో ఏ లోపం కనిపించేది కాదు. వాళ్ల వృత్తి అలాంటిది. ఆ మాటకొస్తే మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌గా పని చేసే నా కెరీర్‌ కూడా అలాంటిదే. ల్యాబ్‌లోకి వెళ్లానంటే ఒక్కోసారి సమయం మర్చిపోయి పని చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను అర్థం చేసుకోగలను కాబట్టే వృత్తితో సంబంధం లేకుండా నన్ను అర్థం చేసుకునే మంచి వ్యక్తి దొరికితే చాలు అనుకున్నా. నిజానికి మేం కొన్ని నెలలయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కొవిడ్‌ కారణంగా ముహూర్తం ముందుకు జరిపాం. మాకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి చిన్నచిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. నేను ఒక పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ ఇస్తే.. నాకు ప్రత్యేకమైన హ్యాండ్‌బ్యాగ్‌, యాక్సెసరీస్‌ ఇచ్చారు. సుమంత్‌లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే అందర్నీ గౌరవిస్తారు. మా కుటుంబంతో కూడా బాగా కలిసిపోతారు. ‘మీ ఆయన హీరో కదా.. తనని ఏ అమ్మాయైనా ఇష్టపడితే ఈర్ష్యగా ఫీలవుతావా?’ అని స్నేహితులు ఒక్కోసారి ఆట పట్టిస్తుంటారు. కానీ నాకు అలాంటిదేం ఉండదు.. నిజంగా ఆ పరిస్థితే వస్తే భలే సరదాగా అనిపిస్తుంది. నా ఉద్యోగరీత్యా ఒకరికొకరం దూరంగా ఉంటున్నా.. ఇది తాత్కాలికమే కదా అని సర్దిచెప్పుకుంటా. ఆ మాటకొస్తే దూరంగా ఉండటం వల్లే మా మధ్య ప్రేమ మరింత ఎక్కువైందని అనిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts