అమ్మాయి అండగా.. జీవితం నిండుగా!

వీడియోలు లేని యూట్యూబ్‌.. వెబ్‌సైట్లు చూపని గూగుల్‌.. ఊహించడానికే ఏదోలా ఉంటాయి కదూ! స్నేహితుల్లేని జీవితమూ అంతే. అందులోనూ అబ్బాయిలకి, అమ్మాయిలతో దోస్తీ కుదిరితే ఆ ఆనందం డబుల్‌ బొనాంజానే.

Published : 05 Mar 2022 00:16 IST

వీడియోలు లేని యూట్యూబ్‌.. వెబ్‌సైట్లు చూపని గూగుల్‌.. ఊహించడానికే ఏదోలా ఉంటాయి కదూ! స్నేహితుల్లేని జీవితమూ అంతే. అందులోనూ అబ్బాయిలకి, అమ్మాయిలతో దోస్తీ కుదిరితే ఆ ఆనందం డబుల్‌ బొనాంజానే. స్నేహితురాలు, ప్రేమికురాలు, శ్రీమతి.. పాత్ర ఏదైనా కావొచ్చు.. మగాడికి అతివ అండదండలు ఉండి తీరాల్సిందేనంటారు. మార్చి 8, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ కుర్రాడి జీవితంలో అమ్మాయి ఉంటే లాభాలేంటో సరదాగా చర్చిద్దామా.

* ఓదార్పు: కుర్రాళ్లకి దూకుడు ఎక్కువైతే అమ్మాయిలకు ఓపిక జాస్తి. ఏం చెప్పినా సావధానంగా వింటారు. సమస్య పరిష్కారమయ్యే ఉపాయం ఆలోచిస్తారు. కష్టం ఎక్కువైతే భుజంపై చోటిచ్చి ఓదారుస్తారు. మనసుకి నచ్చే మాట చెబితే చిన్న హగ్‌ ఇచ్చి సంతోషం రెట్టింపు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమోషనల్‌ సపోర్ట్‌ అమ్మాయిల దగ్గర ఎక్కువ దొరుకుతుంది.
* సంతోషం: కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పే కాదు.. సంతోషాలు, సరదాలు కావాలనుకున్నప్పుడూ వెనువెంటనే దొరికేది ఆడవాళ్ల దగ్గరే. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ.. అంటూ గాళ్‌ఫ్రెండ్‌తో పంచుకున్నప్పుడు వచ్చే కిక్‌ ఎక్కడా దొరకదు.
* సలహాదారు: ప్రేమ, పెళ్లి, కెరియర్‌ అనిశ్చితి.. ఇలాంటి సమయాల్లో మంచి సలహాలిచ్చేది గాళ్‌ఫ్రెండే. ఒకమ్మాయి మనసు ఎలా ఉంటుందో, ఎలా ఆలోచిస్తుందో మరో అమ్మాయికే తేలిగ్గా అర్థమవుతుంది. ప్రేమ, పెళ్లి విషయంలో నిరభ్యంతరంగా వాళ్ల సలహాలు తీసుకోవచ్చు. అవసరమైతే మనసు పడ్డ అమ్మాయి కోసం ఫ్రెండ్‌తో రాయబారాలు నడపొచ్చు.
* షాపింగ్‌: మన డ్రెస్‌ మనకెప్పుడూ బాగానే ఉంటుంది. అది నప్పిందా? లేదా? అమ్మాయిలే బాగా చెప్పగలుగుతారు. కుర్రాడికి ఓ ఫ్రెండో, ప్రేమికురాలో ఉంటే ఆ సమస్యే ఉండదిక. పైగా షాపింగ్‌ వాళ్లకే వదిలేస్తే భారం తప్పుతుంది. ఆచితూచి కొనడంలో అమ్మాయిల్ని మించినవారు ఎవరుంటారు?
* ఆలోచన: గొడవలు, వివాదాలప్పుడు ఆలోచన లేని దుందుడుకుతనం అబ్బాయిలది. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల్లో ఇరుక్కుపోతుంటారు. అలాంటి సమయంలో సైడ్‌ ట్రాక్‌ పట్టినవాళ్లని వెనక్కిలాగి సరైన దారిలో పెట్టేది అమ్మాయిలే. వాళ్ల దూకుడుకి కళ్లెం వేసేది అతివలే.
* అభిమానం: అబ్బాయి నచ్చాలేగానీ అమ్మలా, సోదరిలా అభిమానం కుమ్మరిస్తుంటారు అమ్మాయిలు. క్యాంటీన్‌లో లంచ్‌బాక్స్‌లే కాదు.. గడ్డు కాలంలో కష్టాలు పంచుకుంటారు. తోచినంత సాయం చేస్తుంటారు. కుర్రాళ్ల రహస్యాలు దాస్తారు. జీవితంలో ఎదిగేలా  ప్రేరణ కలిగిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని