ఒత్తిడి మంచిదే!

‘ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా’, ‘పని భారం మొత్తం నాపైనే పడుతోంది.. ఈ ఉద్యోగం మానేసి వేరేది వెతుక్కోవా లనుకుంటున్నా’ ఇలాంటి నిట్టూర్పులు.. మనం చాలానే వింటుంటాం. నిజానికి కెరియర్‌లో ఇలాంటి ఒత్తిళ్లు, బాధలు మంచివేనంటారు విశ్లేషకులు. ఎలాగంటే...

Updated : 12 Mar 2022 04:41 IST

‘ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా’, ‘పని భారం మొత్తం నాపైనే పడుతోంది.. ఈ ఉద్యోగం మానేసి వేరేది వెతుక్కోవా లనుకుంటున్నా’ ఇలాంటి నిట్టూర్పులు.. మనం చాలానే వింటుంటాం. నిజానికి కెరియర్‌లో ఇలాంటి ఒత్తిళ్లు, బాధలు మంచివేనంటారు విశ్లేషకులు. ఎలాగంటే...

* ఉద్యోగంలో చేరిన కొత్తలో పని ఎలా చేయాలో అర్థం కాక, బాస్‌ని ఎలా మెప్పించాలో తెలియక కొంత ఆందోళనకు గురవుతాం. అయినా నేర్చుకోవాలనే తపన, రాణించాలనే కసి ఉండటంతో కొద్దిరోజుల్లోనే ఒత్తిడి మటుమాయమవుతుంది. తొలినాటి రోజుల్లోని ఆ తత్వాన్నే అలవరుచుకుంటే.. ఒత్తిడి పెద్ద ఇబ్బందేం కాదంటారు.

* పని చేస్తున్నప్పుడు పొరపాట్లు, బాస్‌తో చీవాట్లు సహజం. దాన్నే తలచుకుంటూ కూర్చుంటే ఒత్తిడి పెరుగుతుంది. కారణాలు వెతికి, మరోసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకుంటే రేపటి రోజు కచ్చితంగా బాగుంటుంది. అంటే ఒత్తిడే పరోక్షంగా విజయానికి వారధిగా మారుతుందన్నమాట.

* స్వల్ప, మధ్యస్థాయి ఒత్తిడితో శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు మేలు చేసే ‘ఇంటర్‌ల్యూకిన్స్‌’ అనే సైటోకైన్ల సముదాయం ఉత్తేజితం అవుతుందంటారు వైద్య పరిశోధకులు. తద్వారా మనం మరింత చురుగ్గా ఉంటూ.. మరింత మెరుగ్గా పని చేస్తాం.

* ఒత్తిడితో తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది పడ్డా.. పనిలో అందరికన్నా ముందుండాలనే పోటీ తత్వం, పదోన్నతులు పొందాలనే తపనని ప్రేరేపిస్తుంది. ఉద్యోగి ఒక కంఫర్ట్‌ జోన్‌లోనే ఉండిపోకుండా తనకి లక్ష్యాలు నిర్దేశిస్తుంది.

* పని ఎక్కువైతేనే కాదు.. పక్కవాళ్లు త్వరగా పదోన్నతుల నిచ్చెన ఎక్కుతున్నా ఒత్తిడి ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ పోటీలో నేనూ ఉండాలి అనుకునేవాళ్లు కొత్త నైపుణ్యాలు అలవరచుకుంటారు. కష్టపడటం నేర్చుకుంటారు. పదుగురితో అభిప్రాయాలు పంచుకుంటూ సామాజిక బాంధవ్యాలూ మెరుగుపరచుకుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని