365 రోజులుగా.. ఆగని సేవ!

చేసేది ఎంత మంచి పని అయినా ఒక్కోసారి విరామం తప్పదు. కానీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన తుమ్మ రాజ్‌కుమార్‌ తన సేవా క్రతువును 365 రోజులుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. అరకొర సంపాదన ఉన్నా.. పరిధికి మించి పరితపిస్తున్న ఈ యువకుడు యువతకు ఆదర్శం కాక మరేంటి?

Updated : 16 Apr 2022 01:35 IST

చేసేది ఎంత మంచి పని అయినా ఒక్కోసారి విరామం తప్పదు. కానీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన తుమ్మ రాజ్‌కుమార్‌ తన సేవా క్రతువును 365 రోజులుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. అరకొర సంపాదన ఉన్నా.. పరిధికి మించి పరితపిస్తున్న ఈ యువకుడు యువతకు ఆదర్శం కాక మరేంటి?

రాజ్‌కుమార్‌ వివేకానందుడి ఆరాధకుడు. సేవా సంకల్పంతో అవివాహితుడిగానే ఉండిపోయాడు. ‘యువ సంకల్ప ఫౌండేషన్‌’ ప్రారంభించాడు. చదువుకునే రోజుల నుంచే పలు రకాల సేవా కార్యక్రమాల్లో భాగమయ్యేవాడు. ప్రస్తుతం మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. 

గతేడాది ఏప్రిల్‌లో కరోనా విజృంభించినప్పుడు అనాథ రోగులు, కార్మికులు, ఆపన్నులు, యాచకులకు తిండి దొరకని దుస్థితి. ఆకలితో స్థానికంగా ఒకరిద్దరు చనిపోయారు. ఇది చూసి చలించిపోయాడు రాజ్‌కుమార్‌. ఇలాంటివి పునరావృతం కాకూడదని ఏప్రిల్‌ 13న తన పుట్టినరోజున ‘నిత్య అన్నదాన కార్యక్రమం’ ప్రారంభించాడు. సొంత డబ్బులతో ఆహార పొట్లాలు సిద్ధం చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టాడు. ఆశయం మంచిదైనా తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో స్థానిక యువత, వ్యాపార, వాణిజ్యవర్గాలతో చర్చించాడు. అతడి అంకితభావాన్ని చూసి స్థానికులు, ప్రవాస మిత్రులు తలో చేయి వేశారు. అప్పట్నుంచి ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. ఒక్కరోజు కూడా అన్నదానం ఆపలేదు. ఈ ఏప్రిల్‌తో విజయవంతంగా ఏడాది పూర్తైంది. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగిస్తానంటున్నాడు. 

ఇది కాకుండా వినాయకచవితికి మట్టి విగ్రహాల పంపిణీ, అభాగ్యులకు నిత్యవసరాల పంపిణీ, నిరుపేద అమ్మాయిల వివాహానికి వస్త్రాలు అందివ్వడంలాంటివి చేస్తున్నాడు.  హరితహారం, ఓటరు కార్డుల నమోదు, పల్స్‌ పోలియో కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు. సంపాదన తక్కువైనా.. సేవ చేయాలనే మనసుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నాడు. 

- మిరియాల గణేష్‌కుమార్, పెద్దపల్లి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు