అందం, నటన.. అదుర్స్‌

జెర్సీలో నటనతో మెప్పించిందని అందరితో జేజేలు అందుకుంటోంది. చాలాసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యాననీ, నా శరీరంలో ఒక భాగాన్ని ‘మట్టి కుండ’ అంటూ చాలామంది ట్రోల్‌ చేశారని ఈమధ్యే బాధ పంచుకుంది.

Updated : 30 Apr 2022 09:17 IST

* ఇంతందంగా ఉంది.. ఎవరీ భామ?
పేరు మృణాల్‌ ఠాకూర్‌. హిందీ ‘జెర్సీ’ హీరోయిన్‌.

* మన పేజీలోకి ఎందుకొచ్చినట్టు?
జెర్సీలో నటనతో మెప్పించిందని అందరితో జేజేలు అందుకుంటోంది. చాలాసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యాననీ, నా శరీరంలో ఒక భాగాన్ని ‘మట్టి కుండ’ అంటూ చాలామంది ట్రోల్‌ చేశారని ఈమధ్యే బాధ పంచుకుంది.

* నేపథ్యం, పరిచయం...?
మహారాష్ట్ర అమ్మాయి. ధులెలో పుట్టి ముంబయిలో పెరిగింది. వెండితెరపై వెలిగిపోవాలనేది చిన్నప్పటి ఆశ.

* తెలుగు కుర్రకారుకి దగ్గరయ్యే అవకాశమేదైనా ఉందా?
త్వరలోనే.. మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో చేయబోతున్న ‘సీతారామమ్‌’లో తన సరసన కనిపించబోతోంది.

* యువతకు ఏం చెబుతోంది?
‘కలలు లేని బతుకు వ్యర్థం. ఆ స్వప్నాల వెంట నిత్యం పరుగులు తీస్తూనే ఉండాలి’ అని.

* చదువు సంగతి చెప్పనేలేదు...
మొదట్నుంచీ మెరిట్‌ విద్యార్థి. బీటెక్‌లో ఎనభై శాతం పైగా మార్కులతో పాసైంది. మాస్‌మీడియా కోర్సు పూర్తి చేసింది. ఖాళీగా ఉంటే పుస్తకాన్ని వదలదు.

* అయితే బాలీవుడ్‌లో నేరుగా అవకాశం కొట్టేసిందా?
అదేం లేదు.. కాలేజీలో ఉండగా సరదాగా మోడలింగ్‌ చేసేది. అది చూసి ‘ముఝే కుచ్‌ కెహ్‌తీ హై’ అనే సీరియల్‌లో అవకాశమిచ్చారు. ‘కుంకుం భాగ్య’తో ఇంటింటికీ పరిచయమైంది. తర్వాత రెండు మరాఠీ సినిమాల్లోనూ నటించింది.

* బుల్లితెర వయా వెండితెర అన్నమాట..
ఔను. నటనకు అవకాశం ఉన్న పాత్రకి అనుభవం ఉన్న అమ్మాయి కావాలంటూ.. హృతిక్‌ రోషన్‌ ‘సూపర్‌ 30’లో తనని ఎంపిక చేశారు. ఆపై ‘బాట్లా హౌజ్‌’, ‘తూఫాన్‌’లలో మెప్పిస్తూ తుపానులా దూసుకొచ్చింది. ఇప్పుడు జెర్సీతో శిఖరానికి చేరింది.

* సినిమాలు కాకుండా...
కవితలు రాస్తుంటుంది. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్తే ఫొటోలు తీసి ఆల్బమ్‌లు తయారు చేస్తుంటుంది.

* నచ్చే కాంప్లిమెంట్‌?
నువ్వు భారతీయ ‘కర్దాషియాన్‌’లా ఉంటావు అని హాలీవుడ్‌ నటి డెమీ మూర్‌ పొగిడిందట. అది జీవితంలో మర్చిపోలేనంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు