Updated : 07 May 2022 05:36 IST

భల్లే భల్లే భాంగ్రా ఫిట్‌!

పార్కులో పరుగెత్తడం.. జిమ్‌లో బరువులెత్తడం.. ట్రెడ్‌మిల్‌పై నడక.. బోర్‌ కొట్టేసిందా? అయితే ‘భాంగ్రా వ్యాయామానికి సిద్ధమైపోండి. అదేంటి? భాంగ్రా అంటే భల్లే భల్లే అంటూ ఊగిపోయే సంప్రదాయ నృత్యం కదా.. అంటారా? ఔను గురూ! ఈ నృత్యరీతులనే కొంచెం అటుఇటుగా మార్చేసి అందరూ మెచ్చే వర్కవుట్‌గా రూపొందించారు. మెట్రో నగరాలు దాటి చిన్నచిన్న పట్టణాలకీ పాకుతోందీ ట్రెండ్‌.
‘మసాలా భాంగ్రా’ పేరుతో ఆరేడేళ్ల కిందట ఈ ధోరణికి అమెరికాలో తెరతీశారు. అక్కడి నుంచే దిగుమతైంది. భాంగ్రా సంగీతాన్ని రీమిక్స్‌ చేసి, బాలీవుడ్‌ ఫ్యుజన్‌ మ్యూజిక్‌ని జత చేర్చి.. ఈ కొత్త తరహా స్టెప్పులు రూపొందిస్తున్నారు ఇక్కడి శిక్షకులు. రానురాను ఇదే ‘భాంగ్రా ఫిట్‌’గా రూపాంతరం చెందింది.

వ్యాయామం చేయడానికి ఎన్నో పద్ధతులు ఉండగా ఈ భాంగ్రా డ్యాన్స్‌ అవసరం ఏంటి అని హైదరాబాదీ శిక్షకుడు దిలీప్‌ని అడిగితే.. ‘సీరియస్‌గా, ముభావంగా చేసుకుంటూ వెళ్తే ఎంతమంచి వ్యాయామం అయినా బోర్‌ కొడుతుంది. అందుకే కసరత్తులకు తోడు హుషారిచ్చే సంగీతాన్ని కోరుకుంటారు ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు. దాంతోపాటు ఈ కొరియోగ్రఫీ వ్యాయామాలు మూకుమ్మడిగా చేయడం మరింత సరదాని తీసుకొస్తుంది. అలాగే భాంగ్రా అనే పదంలోనే ఒక హుషారు ఉంటుంది’ అంటాడు. 45 నిమిషాల భాంగ్రా సెషన్‌తో ఒంట్లో ఆరేడు వందల కేలరీలు కరిగిపోతాయట. చేతులు, భుజాలు, కండరాలు, ముంజేతులు, పిక్కలు, తొడలు.. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరానికంతటికీ ఇది మంచి వ్యాయామం. జుంబా డాన్స్‌లాగే రాబోయే రోజుల్లో ఇది మరింత ఊపందుకునే అవకాశం ఉందంటున్నాడు. 

ఏమేం లాభాలు?

* కార్డియో వ్యాయామంగా పని చేస్తుంది.

* బరువు తగ్గుతారు.

* కండరాలు దృఢమవుతాయి.

* పీసీఓడీ ఉన్న అమ్మాయిలకు సమస్య తీవ్రత తగ్గుతుంది.

* ఒత్తిడి నివారిణిలా పని చేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts