యాప్‌ వెయ్‌.. ఎడిట్‌ చెయ్‌!

ఇన్‌స్టా కోసం ఓ సెల్ఫీ. వాట్సాప్‌ డీపీకి ఒక ఫొటో. ఫేస్‌బుక్‌ వాల్‌పేపరుకో చిత్రం. అన్నీ అందంగా ఉంటూ.. ఆకట్టుకునేవే.. కుర్రకారు ఈ ఫొటోల మెరుపుల వెనక ఎడిటింగ్‌ యాప్‌లు ఉన్నాయండోయ్‌! ట్రెండ్‌ జోరందుకుంటోంది.

Updated : 04 Jun 2022 04:31 IST

ఇన్‌స్టా కోసం ఓ సెల్ఫీ. వాట్సాప్‌ డీపీకి ఒక ఫొటో. ఫేస్‌బుక్‌ వాల్‌పేపరుకో చిత్రం. అన్నీ అందంగా ఉంటూ.. ఆకట్టుకునేవే.. కుర్రకారు ఈ ఫొటోల మెరుపుల వెనక ఎడిటింగ్‌ యాప్‌లు ఉన్నాయండోయ్‌! ట్రెండ్‌ జోరందుకుంటోంది.

ఒక మంచి ఫొటో దిగాలంటే ఖరీదైన కెమెరాలు ఉండాల్సిందే. అది ఒకప్పుడు. కాలం మారింది బాస్‌! ఇప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్లే! మోడల్‌లా పోజులతో రెచ్చిపోవడమే! అలా తీసిన ఫొటోలకు మరింత వన్నెలద్దేవే ఎడిటింగ్‌ యాప్‌లు. ఓ మోస్తరుగా ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు సైతం ఈ యాప్‌ల మాయాజాలంతో రెట్టింపు అందంతో మెరిసిపోవడం ఖాయం. నాసిరకం కెమెరాతో షార్‌ఫిల్మ్‌లు తీసినా వీటిని పనిముట్టులా వాడి కనికట్టు చేయొచ్చు. దీనికోసం ఫొటోషాప్‌తో కుస్తీలు పట్టాల్సిన పని లేదు. స్టూడియోల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. చేతిలో ఫోన్‌.. కాస్త సాంకేతిక పరిజ్ఞానం తెలిస్తే.. మునివేళ్లతోనే ఫొటోల్ని మెరుగులు దిద్దొచ్చు.. వీడియోలకు అదనపు హంగులు తీసుకురావచ్చు.

తాము సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, వీడియోలు ఆకట్టుకునేలా ఉండాలన్నది యువత కోరిక. ఫిల్టర్లు వాడుతూ, మెరుగులు దిద్దుతూ.. ఎలాగో తంటాలు పడుతుంటారు. ఈ అవసరం తీర్చడానికే ఎడిటింగ్‌ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కుర్రకారు మనస్తత్వం పసిగట్టారు గనకే యాప్‌ ఆవిష్కర్తలు రకరకాల ఫిల్టర్లు జత చేసి సాధారణ ఫొటోలు, వీడియోలను సైతం వావ్‌ అనిపించేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. ఫొటోల రంగులు మార్చడం, బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం సమకూర్చడం, చిత్రానికి మెరుగులు దిద్దడం, ఫొటో క్రాపింగ్, బ్రషింగ్‌.. వీటితో ఎన్నైనా చేయొచ్చు. వీడియోలు, ఇన్‌స్టా రీల్స్, షార్ట్‌ఫిల్మ్స్‌లను సైతం ఎడిట్‌ చేయొచ్చు. ఈ యాప్స్‌లో అత్యధికం ఉచితంగానే అందుబాటులో ఉంచినా.. కొన్ని అత్యాధునిక ఫీచర్లు వాడుకోవడానికి మాత్రం కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. ఇన్ని ఫీచర్లు ఉండటంతో కుర్రకారు వీటిపై మోజు పడుతున్నారు. ఎంచక్కా డౌన్‌లోడ్‌ చేసుకొని ఎడిటర్ల అవతారం ఎత్తుతున్నారు.

వాడటం సులభం

నా ఆసక్తికి అనుగుణంగా ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించా. ప్రస్తుతం లక్షా యాభై వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నేను చేసిన ప్రతి వీడియోని ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్, ఇన్‌స్టాలాంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తుంటాను. ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ల ద్వారానే వీడియోలను ఎడిట్‌ చేస్తాను. అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ద్వారా వీటిని ల్యాప్‌ట్యాప్‌లోనూ ఉపయోగించవచ్చు. ఇక సరదాగా ఫోన్‌లో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సైతం మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. వీటిని బాగా ఉపయోగించే నైపుణ్యం సాధిస్తే ప్రొఫెషనల్‌గానూ మారిపోవచ్చు.

- జూపూడి శ్రీలక్ష్మి, ఈజేఎస్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని