Published : 09 Jul 2022 01:43 IST

కొత్త బంగారు లోకం.. మీకు కావాలి సొంతం!

కళాశాలలు తెరిచారు. క్యాంపస్‌కి పండగొచ్చేసింది... బడి దాటి కాలేజీ ఒడికి వచ్చినవాళ్లు.. పాత ప్రాంగణాలు వదిలి కొత్తచోటికి వచ్చినవాళ్లు ఎంతోమంది! ఈ దశలోనే మావిచిగురులా కొత్త స్నేహాలు విచ్చుకోవాలి... జీవితానికి సంతోషాల దారులు వేసుకోవాలి... కానీ మొహమాటంతో చేయి కలపలేక కొందరు విలవిల్లాడిపోతుంటారు... దానికి చెక్‌ పెడుతూ అపరిచితులతో మాట కలపడమెలా? దోస్తీని పట్టాలకెక్కించేదెలా? అంటే.. ఇవిగోండి వేదికలు.

ఉత్సవాలు: ఫ్రెషర్స్‌ డేలు, యాన్యువల్‌ డేలు, సంగీత ఉత్సవాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు... అంటూ ప్రతి కళాశాలలో బోలెడు ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉంటారు. వీటిలో కలియతిరుగుతుంటే స్నేహ హస్తాలు అందించే మనసులెన్నో కనిపిస్తాయి. మాట కలిపి చూడండి. మన భుజాలు రాసుకునే చేతులు తప్పక దొరుకుతాయి.

తరగతి: వారానికి కనీసం ఇరవై గంటలైనా కాలేజీలోనే గడిపేస్తుంటారు విద్యార్థులు. అధ్యాపకులు హాజరు కాని సమయం అందులో రెండు గంటలైనా ఉంటుంది. అప్పుడు బయటికెళ్లలేం. దోస్తీ కుదుర్చుకోవడానికి ఇదో చక్కని టైమ్‌. బాతాఖానీ మొదలెడితే మన జిగిరీలెవరో తేలిపోతుంది.

ఆసక్తులతో: ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మైదానాలు.. ఇవీ దోస్తీ కేంద్రాలే. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్టు.. ఆసక్తి, అభిరుచి ఉన్నవాళ్లంతా ఇక్కడ చేరతారు. కుస్తీమే సవాల్‌ అంటూ దోస్తీకి స్వాగత ద్వారాలు తెరవండి. కరోకే నైట్స్‌, ధర్నాలు, టెడెక్స్‌, క్రీడాంశాలు.. ఇలాంటి వాటిల్లోనూ భావాలు కలిసే వాళ్లతో చేతులు కలపొచ్చు.

వసతి గృహాలు: అమ్మాయి లేదా అబ్బాయి హాస్టల్‌లో ఉన్నారంటే.. ఇక అది కొత్త పరిచయాల వేదికే అవుతుంది. క్లాసులో లేకపోతే హాస్టళ్లో ట్రీట్‌లు, పార్టీలు కామనే కదా! విద్యార్థులకు ఇంతకుమించిన హ్యాంగవుట్‌ ప్లేస్‌ ఏముంటుంది? హద్దుల్లో ఉండాలేగానీ.. హాస్టల్‌ జీవితం భలేగా ఉంటుంది.

బయట: క్యాంపస్‌లోనే స్నేహాలు వికసించాలనే నిబంధనేం లేదు. కండలు పెంచి కండరగండడు అయిపోవాలనుకునే జిమ్‌లు, అమ్మాయిల అందం పెంచే బ్యూటీ పార్లర్‌లు.. అన్నింటికీ మించి కాలేజీ క్యాంటీన్‌.. ఫ్రెండ్షిప్‌కి పెద్ద అడ్డాలు. ఇక్కడ స్నేహాలు విరబూయడం ఎక్కువ.

ఆఫ్‌లైన్‌: మాట కలపడానికి మొహమాటపడే కుర్రకారు చాట్లాటల్లో జోరు మీదుండడం ఈరోజుల్లో మామూలే. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, టెలిగ్రామ్‌.. వీటితో దోస్తీ కుదుర్చుకోవడం తేలికేనని వేరే చెప్పాలా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని