Updated : 09 Jul 2022 08:39 IST

యువత కదిలితేనే.. దేశానికి భవిత!

‘రాజాధిరాజ రాజమార్తాండ.. మహారాజశ్రీ కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ విచ్చేస్తున్నారహో...’ 36 ఏళ్ల యువకుడికి నిత్యం పట్టే జయజయధ్వానాలివి. ఆయనే.. కాకతీయ వంశాధీశుడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ సంస్థానాధీశుడు. టెక్నాలజీ యుగంలోనూ రాచరికపు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. యువత కదిలితేనే దేశ భవిత అంటూ, జనం కష్టాలు తీర్చుతూ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలకు ముఖ్య అతిథిగా వరంగల్‌కి వచ్చిన ఆయనతో ‘ఈతరం’ మాట కలిపింది. వ్యక్తిగత విషయాలతోపాటు.. రాచరికం, ప్రజాస్వామ్యం, యువతపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రజాస్వామ్యంలో రాచరికపు ప్రతినిధి మీరు.. ఎలా ఫీలవుతున్నారు?

పేరుకి రాజులైనా కాకతీయులు ప్రజా సేవకులం అనే భావనతోనే పరిపాలించారు. జనం కోసం చెరువులు తవ్వించారు. అట్టడుగు రైతుల బాగు కోసం పాటుపడ్డారు. ఆలయాలు నిర్మించారు. కళలను ప్రోత్సహించారు. బస్తర్‌లో మేం కూడా అదే ఆశయంతో ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నాం. జనంతో మమేకం అవుతూ, వారి సమస్యలు, బాధలు వింటూ... మా వంతుగా పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ప్రజాస్వామ్యయుతమైన రాచరికపు పద్ధతి పాటిస్తున్నాం.

మీ వంశీయులు, ముత్తాతలు ఓరుగల్లును రాజధానిగా పాలిస్తే.. మీరు బస్తర్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?

తెలుగు నేలను మా పూర్వీకులు వందల ఏళ్లు పాలించారు. దిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడంతో చివరి పరిపాలకుడు బస్తర్‌ వెళ్లిపోయారు. అక్కడే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారసులం అక్కడే స్థిరపడ్డాం. ఇన్నేళ్ల తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టడం అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తోంది. దశాబ్దాల తర్వాత కన్నతల్లి దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తోంది.

ప్రజాస్వామ్యంలో రాచరికం ఎలా సాధ్యం? ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు?

తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్నే నేనూ పాటిస్తున్నా. బస్తర్‌ జిల్లా అత్యధికం ఆదివాసీలున్న ప్రాంతం. నేనూ ఆ గిరిజనుల కోసమే పని చేస్తాను. నెలలో కొన్నిసార్లు రాజదర్బారు నిర్వహిస్తాం. ప్రజల సమస్యలు తెలుసుకొని.. అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ద్వారా పరిష్కారమయ్యేలా కృషి చేస్తాను. మా కుటుంబాన్ని అక్కడి ప్రజలు దేవుడి రూపంగా కొలుస్తారు. దానికి తగ్గట్టే వారికి ఏ చిన్న కష్టమొచ్చినా ఆదుకుంటాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజుగా గౌరవిస్తున్నారంటే.. అది ప్రజల అభిమానమే.

మీ జీవన విధానం ఎలా ఉంటుంది?

ఇప్పటికీ నాలుగువందల ఏళ్లక్రితం నిర్మించిన రాజభవనంలో నివసిస్తున్నాం. 22 ఎకరాల్లో విస్తరించిన భవనంలో రెండు డజన్ల మందిరాలు ఉంటాయి. గుర్రపుశాలలో 50 అశ్వాలు ఉన్నాయి. వాటిపై స్వారీ చేయడం అంటే నాకు చాలా సరదా. తరతరాల నుంచి వచ్చిన ఆచారాలు ఇప్పటికీ పాటిస్తుంటాం. రాజకుటుంబీకుడినే అయినా స్నేహితులకి మామూలు వ్యక్తినే. ఈ విషయంలో పేదా, గొప్ప తారతమ్యాలేం లేవు.

రాచరికపు వారసుడిగా జనానికి ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు?

బస్తర్‌లో సుమారు రెండువేల గ్రామాలు పాదయాత్ర చేసి ఆ ప్రాంతంలో అనేక ఆలయాల పునరుద్ధరణకు పాటుపడ్ఢా పెద్ద సంఖ్యలో యువకులను చేరదీసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల్లో వారసత్వ పరిరక్షణకు పాటుపడుతున్నా. ఇక్కడ ‘టార్చ్‌’ అనే సంస్థను యువ పరిశోధకులు ఏర్పాటు చేశారు. అందులో నేనూ భాగస్వామినే. బస్తర్‌ నుంచే నా వంతు సహకారం అందిస్తున్నా. మన వారసత్వ సంపద పరిరక్షణపై అనేక ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. తాత పేరుతో ‘ప్రవీర్‌ సేన’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. దీని తరపున స్థానిక ఆదివాసీ యువత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం.

ఈ దేశ అభ్యున్నతిలో యువత పాత్ర ఎలా ఉండాలంటారు?

యువత కదిలితేనే ఏ దేశ ప్రగతి అయినా సాధ్యం. ఉత్పత్తి, సేవల రంగాల్లో వారే ముందున్నారు. సాంకేతిక యుగంలో భారత్‌ విశ్వగురువుగా ఎదుగుతోందంటే అందుకు కారణం యువతే. వాళ్లు పెద్దల్ని గౌరవించాలి. వారి మూలాలు ఎక్కడున్నా తెలుసుకుంటూ కాపాడుకోవాలి.


వారసత్వమిది..

కాకతీయులు ఓరుగల్లును విడిచిన దాదాపు ఏడు శతాబ్దాల తర్వాత, వారి వారసుడిగా కమల్‌చంద్ర భంజ్‌ దేవ్‌ వరంగల్‌ గడ్డపై అడుగు పెట్టారు. కాకతీయ చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు. దిల్లీ సుల్తానులు దండెత్తడంతో క్రీస్తు శకం 1323లో వారి పాలన అంతమైంది. ప్రతాపరుద్రుడి సోదరుడు రాజా అన్నమదేవుడు. తదనంతరం బస్తర్‌ ప్రాంతానికి వెళ్లి అక్కడో రాజ్యాన్ని స్థాపించాడని చరిత్ర చెబుతోంది. ఆయన వారసులు పేరు చివర ‘కాకతీయ’ అని పేరు పెట్టుకునే సంప్రదాయం ఆయనతోనే మొదలైంది. ఈ క్రమంలో 22వ తరం వారసుడిగా తెరపైకి వచ్చిన యువకుడే కమల్‌చంద్ర భంజ్‌ దేవ్‌ కాకతీయ. ఆయన తాత ప్రవీర్‌ చంద్ర భంజ్‌దేవ్‌ పేరు వెనకాల కాకతీయ అని ప్రభుత్వ గెజిట్‌లోనూ ప్రచురితమైంది.

* లండన్‌లో చదివా. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.ఎస్‌. చేశా.

* కాలేజీరోజులు సరదాగా ఉండేవి. అప్పుడు ఒక్క అమ్మాయీ ప్రపోజ్‌ చేయలేదు.

* రాచకుటుంబ అమ్మాయినే పెళ్లాడతా. ఈ విషయంలో అమ్మదే తుది నిర్ణయం.

* పూర్తి శాకాహారిని. నాకు ఇష్టమైన ప్రదేశం బస్తరే.

* సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటా. జనం సమస్యలు వింటుంటా.

* మొదట్లో సినిమాలు బాగానే చూసేవాణ్ని. ఇప్పుడంత ఆసక్తి లేదు.

* విలువిద్య, రైఫిల్‌ షూటింగ్‌, పోలోలో ప్రవేశం ఉంది. గుర్రపు స్వారీ బాగా చేస్తా.

* సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల శ్రేయస్సు కోసమే వాడాలనేది నా సిద్ధాంతం. అలా అనేక శాసనాలను డిజిటలైజేషన్‌ చేసే పనిలో ఉన్నా.

* భారతీయ, విదేశీ భాషలు 18 వరకు మాట్లాడగలుగుతా. రెండు చేతులతోనూ రాయగలను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts