హనీమూన్‌..మెనీ యార్‌!

లేటు వయసు ఘాటు ప్రేమికులు నయనతార, విఘ్నేష్‌లు తమ లవ్వాటకు చుక్క పెట్టేసి ఎంచక్కా పెళ్లితో ఒక్కటయ్యారు. టీనేజీ ప్రేమికుల్లా రొమాన్స్‌లో తేలిపోతూ ‘మేం సెకండ్‌ హనీమూన్‌’ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలూ పంచుకున్నారు.

Updated : 06 Oct 2022 09:29 IST

లేటు వయసు ఘాటు ప్రేమికులు నయనతార, విఘ్నేష్‌లు తమ లవ్వాటకు చుక్క పెట్టేసి ఎంచక్కా పెళ్లితో ఒక్కటయ్యారు. టీనేజీ ప్రేమికుల్లా రొమాన్స్‌లో తేలిపోతూ ‘మేం సెకండ్‌ హనీమూన్‌’ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలూ పంచుకున్నారు. ఏంటీ సెకండ్‌ హనీమూన్‌? అనే అనుమానం వచ్చేసింది అందరికీ! కాస్త ఆలస్యంగానో.. వాళ్లకి కుదిరినప్పుడో.. రెండోసారి వెళ్లినప్పుడో.. జరుపుకునేది సెకండ్‌ అని జవాబు దొరికిందనుకోండి. ఇదొక్కటే కాదు.. అభిరుచులు, ఆసక్తులు, మనస్తత్వాలకు అనుగుణంగా చాలా రకాల హనీమూన్‌లే ఉన్నాయి. సూటిగా, క్లుప్తంగా.. వాటి వివరాలు.

* యోలో హనీమూన్‌: ‘యూ ఓన్లీ లివ్‌ వన్స్‌’ ‘యోలో’కి సంక్షిప్త రూపం. ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు. మన హనీమూన్‌ జీవితాంతం మర్చిపోని విధంగా ఉండాలి అనుకునే జంట చేసుకోనేది. ఎంత ఖర్చుకైనా వెనకాడరు. విలాసవంతమైన ప్రదేశాలకు వెళ్తుంటారు. అవసరమైతే సరిహద్దులు దాటి స్విట్జర్లాండ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలకు వెళ్లిపోతుంటారు.
* మినీ మూన్స్‌: సమయం, డబ్బు లేని జంటలు చేసుకునే హనీమూన్‌ ఇది. సెలవులు దొరకకో.. డబ్బులు ఖర్చు పెట్టడం కుదరకో.. దగ్గర్లో ఉన్నవాటితో సర్దుకుంటారు. అరకు, ఊటీ, కేరళ, గోవా.. వీళ్లకు నచ్చే డెస్టినేషన్లు.
* అడ్వెంచర్‌ హనీమూన్‌: సాహసానికి సై అనే పడుచు జంటలు ఇష్టపడే హనీమూన్‌ ఇది. యాత్రలో భాగంగా సరసాల్లో తేలిపోతూనే స్కైయింగ్‌, స్కై డైవింగ్‌, బంగీ జంప్‌, రాక్‌ క్లైంబింగ్‌.. ఇలాంటి సాహసోపేతమైన కార్యక్రమాలకు సిద్ధమవుతుంటారు.
* గౌర్మెట్‌ హనీమూన్‌: కొందరు కొత్త రుచుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. జిహ్వ చాపల్యం అధికంగా ఉన్న జోడీలు హనీమూన్‌ని సైతం మంచి రుచులు ఆస్వాదించే వేదికగా మలచుకుంటారు.
* వలంటీర్‌ హనీమూన్‌: జీవితంలో తొలిసారి జంటగా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాలనుకునేవాళ్లు వీటికి సై అంటారు. వృద్ధులు, అనాథలకు సేవ చేయడం..  నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, సేంద్రియ వ్యవసాయం.. ఇలాంటి వాటికి ఓకే చెబుతారు.
* డిజిటల్‌ డిటాక్స్‌ హనీమూన్‌: ఈ మధు రేయిని ప్రతి క్షణం ఆస్వాదించాలి అనుకునేవారు.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌, గ్యాడ్జెట్‌లను ఇంట్లోనే వదిలేసి ఏకాంత ప్రదేశాలకు వెళ్లిపోతుంటారు. తిరిగొచ్చేదాకా ఎలక్ట్రానిక్‌ పరికరాలను ముట్టుకోరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని