‘ఫైట్‌ క్లబ్‌’లో మీరూ ఉన్నారా?

చిజిల్‌ బాడీలు చిన్నబోయాయి.. సిక్స్‌ప్యాక్‌ల ఊసే వినపడటం లేదు. ఇప్పుడు కుర్రకారు తాజా పలవరింత ‘ఫైట్‌ క్లబ్‌ బాడీ’. ఇది యువత అనుసరిస్తున్న సరికొత్త ఫిట్‌నెస్‌ ధోరణి.

Published : 03 Sep 2022 00:18 IST

చిజిల్‌ బాడీలు చిన్నబోయాయి.. సిక్స్‌ప్యాక్‌ల ఊసే వినపడటం లేదు. ఇప్పుడు కుర్రకారు తాజా పలవరింత ‘ఫైట్‌ క్లబ్‌ బాడీ’. ఇది యువత అనుసరిస్తున్న సరికొత్త ఫిట్‌నెస్‌ ధోరణి. హాలీవుడ్‌ స్టార్‌ బ్రాడ్‌పిట్‌ తీసుకొచ్చిన తాజా ట్రెండ్‌.

బ్రాడ్‌పిట్‌ ఆరడుగుల ఆజానుబాహుడేం కాదు.. కండరగండడు అసలే కాదు. ఆ మాటకొస్తే తను మనలా యూతే కాదు.. అయినా ఇప్పుడిలా ఎందుకు ట్రెండింగ్‌ అవుతున్నాడు అంటే దానికో కారణం ఉంది. పిట్‌ పదిహేడేళ్ల కిందట ‘ఫైట్‌ క్లబ్‌’ అనే సినిమాలో నటించాడు. ఫైటర్‌ పాత్ర కోసం ఒంట్లో ఒక్క అత్యధిక కేలరీ లేకుండా కరగదీశాడు. బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగి విలన్‌ని చిత్తుగా ఓడించేశాడు. అప్పటిదాకా బాగానే ఉంది. ఇప్పుడా ఫైటింగ్‌లు, నునుదేలిన బాడీ.. టిక్‌టాక్‌ వీడియోలుగా, ఇన్‌స్టా రీల్స్‌గా మారి యువత స్మార్ట్‌ఫోన్లలో తెగ షేర్‌ అవుతున్నాయి. ఆనాటి తన ఫిజిక్‌ ఫొటోలు జిమ్‌ గోడలపై పోస్టర్లుగా వేలాడుతున్నాయి. దీంతో ఇది ఒక్కసారిగా కొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌గా మారిపోయింది. అచ్చంగా అలాంటి దేహమే కావాలంటూ యువత జిమ్‌ల వెంట పరుగులు తీసేలా చేస్తోంది. వైరల్‌ వీడియోలు వైరస్‌లా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ఈ ఇంటర్నెట్‌ కాలంలో ఈ వ్యాయామ ధోరణి మన యువతనూ చుట్టేసింది. అసలు ఏంటీ ‘ఫైట్‌ క్లబ్‌ బాడీ’ అని ఆరా తీస్తే.. శరీరం చూడ్డానికి టోన్డ్‌ బాడీలా ఉంటుంది. బాగా విస్తరించిన ఛాతీ, వెడల్పాటి భుజాలు, ఉక్కులా గట్టిపడ్డ చేతులు, వీ ఆకారంలో శరీరం.. ఒంట్లో కొవ్వు ఆనవాళ్లు లేకపోవడం.. ఇదే ఫైట్‌ క్లబ్‌ బాడీ అంటే. ఈ రూపం సంతరించుకోవాలంటే కొన్ని నెలలైనా కఠినంగా సాధనం చేయడం తప్పనిసరి అన్నది నిపుణుల మాట. బెంచ్‌ డిప్స్‌, పెండ్లే రోస్‌, స్టాండింగ్‌ మిలిటరీ ప్రెస్‌, స్టాండింగ్‌ బార్బెల్‌ కర్ల్స్‌.. ఈ కసరత్తులు వ్యాయామంలో తప్పనిసరి చేసుకోవాలనేది సూచన. దానికి తగ్గట్టు డైట్‌ నియమాలు పాటించడమూ ముఖ్యమేనంటున్నారు ఫిట్‌నెస్‌ గురూలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని