Updated : 10 Sep 2022 10:07 IST

కేతిక.. సంగతులు కేక

* ఎక్కడో చూసినట్టు ఉంది. ఎవరీ పుత్తడి బొమ్మ?
   పేరు కేతిక శర్మ. మహా ఖతర్నాక్‌ అమ్మాయి. ‘రంగరంగ వైభవంగా..’ హీరోయిన్‌.
* నేపథ్యమేంటి? ఎప్పట్లాగే ముంబయి నుంచి దిగుమతైందా?
   దిల్లున్న దిల్లీ అమ్మాయి. తెలుగు సినిమాలకోసం హైదరాబాద్‌ వచ్చేసింది. కొన్ని తమిళ ప్రాజెక్టులూ చేస్తోంది.
* అందం.. అదుర్స్‌. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ ఏమైనా ఉన్నాయా?
   లేకేం.. డాన్స్‌లో అదరగొడుతుంది. కరాటే వచ్చు. పరిశ్రమలో అడుగు పెట్టకముందు తను సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.
* సౌందర్యంతోపాటు ఇన్ని కళలుంటే ప్రపోజళ్లు చాలానే వచ్చుండాలే?
  ఔన్నిజమే. డజన్లకొద్దీ అబ్బాయిలు ప్రపోజ్‌ చేశారట. కొంతమంది మోకాళ్లపై కూర్చొని, ఇంకొందరు చేతిలో ఎర్ర గులాబీ పట్టుకొని, ఖరీదైన బహుమతులిచ్చి.. ఎన్నెన్నో. సినిమా ఆఫర్లే ప్రాణం అనుకున్న అమ్మాయి కాబట్టి ప్రేమ ఆఫర్లన్నీ తిరస్కరించిందట.
* ఇంతకీ అమ్మడికి సినిమాలపై ధ్యాస ఎలా పుట్టిందో చెప్పనే లేదు..
 ఇంట్లోవాళ్లతో కలిసి ‘దిల్‌ తో పాగల్‌ హై’ చూస్తుండగా.. మనుషులు తెరమీద ఎలా కనిపిస్తారని చిత్రమైన సందేహం వచ్చిందట చిన్నారి కేతికకి. అప్పుడు సినిమాలు, తారలకుండే పేరు గురించి అమ్మ వివరించగానే.. పెద్దయ్యాక హీరోయిన్‌ అయిపోవాలని ఫిక్సయ్యిందట.
* ఇంట్లోవాళ్లు వెన్నుతట్టి ప్రోత్సహించారా?
 అమ్మానాన్నలు డాక్టర్లు. తను యాక్టర్‌ అవుతానంటే వెనక్కి లాగకుండా ‘గో.. అహెడ్‌’ అన్నారట. చదువైపోగానే ముంబయిలో వాలిపోయి, మోడల్‌గా కెరియర్‌ మొదలుపెట్టింది. ఒకట్రెండు ప్రకటనల్లో నటించాక ‘థగ్‌ లైఫ్‌’ పేరుతో ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో వదిలింది. అదో సంచలనం. అప్పటికే తను చేసిన కొన్ని డాన్స్‌ వీడియోలు బాగా పేరు తీసుకొచ్చాయి.
* తొలి అవకాశం ఎలా?
   యాక్టింగ్‌ నేర్చుకుంటుండగానే పూరి ఆఫీసు నుంచి పిలుపొచ్చింది. ముందు ప్రాంక్‌ కాల్‌ అనుకుంది. నిజమని తెలిశాక ఎగిరి గంతేసింది. అందులో ఓకే కాగానే ‘రొమాంటిక్‌’తో తెరంగేట్రం చేసింది.
* తన గురించి ఎవరికీ తెలియని విషయాలేమైనా ఉన్నాయా?
   కేతిక మంచి స్విమ్మర్‌. దిల్లీ తరపున రాష్ట్రస్థాయిలో పాల్గొంది. తల్లే గురువు, శిక్షకురాలు.


నచ్చే నటి: సాయిపల్లవి
ఇష్టపడే నటుడు: ప్రభాస్‌
అభిమానించేది: ఐశ్వర్యరాయ్‌
ఇన్‌స్టా ఫాలోయర్లు: 23 లక్షలు
నచ్చే హాలీడే స్పాట్‌: బ్యాంకాక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts