కొత్త కొలువా? దూసుకెళ్లండిలా..

కాలేజీ పట్టాతోనే కొలువు కొట్టే కుర్రాళ్లు ఈ కాలంలో బోలెడు. క్యాంపస్‌లో విహంగాల్లా స్వేచ్ఛగా విహరించిన వాళ్లకి ఆఫీసు వాతావరణం భిన్నంగా ఉంటుంది.

Updated : 10 Sep 2022 11:04 IST

కాలేజీ పట్టాతోనే కొలువు కొట్టే కుర్రాళ్లు ఈ కాలంలో బోలెడు. క్యాంపస్‌లో విహంగాల్లా స్వేచ్ఛగా విహరించిన వాళ్లకి ఆఫీసు వాతావరణం భిన్నంగా ఉంటుంది. రాజకీయాలు బొత్తిగా కొత్త. ఇక్కడ  బిల్డప్‌ బాబాయ్‌లుంటారు.. కుళ్లుబోతు బుల్లెమ్మలు కాచుకొని ఉంటారు. వాళ్లందరినీ దాటుకుంటూ కెరియర్‌ ప్రారంభించే కిటుకులివి.

* జూనియర్లమని చులకన చేసేవారు కొందరు ఉంటారు. రంగు, రూపు, ఆకారం, అవకరం, వర్గం, సామర్థ్యం.. వీటిని చూసి ఎత్తి పొడిచేవారూ కాచుకొని ఉంటారు. వీటికి స్పందించి వాదులాటకు దిగాల్సిన పని లేదు. సమస్య సాగదీయకుండా పై అధికారులకు ఫిర్యాదు చేస్తే చాలు.
* మనం ఎదిగిపోతే సహించకుండా.. ఇతరులకు చాడీలు చెబుతూ, లింకులు అంటగడుతూ.. వ్యక్తిగతంగా పాతాళానికి లాగే వాళ్లు కాచుకొని ఉంటుంటారు. వీళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగని తప్పు చేయనప్పుడు మీరెవరికీ భయపడాల్సిన పని లేదు. బాధ పడటమూ అనవసరం.
* మీరు చేసిన పనిని తమదిగా చెప్పుకునే సీనియర్‌ చోరాగ్రేసరులకు కొరత ఉండదు. అందుకే మీరేదైనా గొప్ప పని చేస్తే బాస్‌ దగ్గర చెప్పి తీరాల్సిందే. అవసరమైతే మీరు చేసిన పని వివరాలతో సహా వారం లేదా నెలకోసారైనా నివేదికలు పంపినా తప్పేం లేదు.
*సీనియర్లను గౌరవించడం.. అందరితో కలిసిపోవడాన్ని అలవాటుగా మార్చుకోవడం మరీ అణిగిమణిగి ఉన్నట్టేం కాదు. ఈ వ్యక్తిత్వమే మనల్ని అందరూ ఇష్టపడేలా చేస్తాయి. నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది.
* పనిని నమ్ముకున్న వాళ్లకు ఇతర వ్యాపకాలతో పనే లేదు. మనల్ని గట్టెక్కించేది, అందలమెక్కించేది ఈ పని తీరే. కష్టపడేవాళ్లకు కొంచెం ఆలస్యమైనా తప్పకుండా గుర్తింపు దక్కుతుంది. పని పట్ల శ్రద్ధ ఉన్నవారిని సంస్థ వదులుకోవడానికి ఇష్టపడదు.
* ప్రతిచోటా పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. కొత్త టెక్నాలజీ వచ్చి చేరుతోంది.  ఈ కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూనే ఉండాలి. అదనపు అర్హతలు ఉన్నవాళ్లను సంస్థ, సహోద్యోగులు గౌరవిస్తూనే ఉంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని