జనాల్లో ఉండటమే.. నాకు ఇష్టం!

కార్యక్షేత్రంలోకి దిగితే అలుపెరుగని శ్రామికుడు.. అన్యాయమని తేలితే దాని అంతుచూసేదాకా వదలడు... పిల్లలకు ముద్దుల మావయ్య... ఆపదల్లో ఉన్నవారికి వెన్నుతట్టి భరోసానిచ్చే ఆపన్నహస్తం. ఆయనే తెలుగుతేజం కృష్ణతేజ మైలవరపు. కేరళ వరదల్లో సమర్థ విపత్తు నిర్వహణ చేసి దేశం దృష్టిని ఆకర్షించిన తను.. వందల కోట్ల విలువైన అక్రమ

Updated : 24 Sep 2022 07:56 IST

కార్యక్షేత్రంలోకి దిగితే అలుపెరుగని శ్రామికుడు.. అన్యాయమని తేలితే దాని అంతుచూసేదాకా వదలడు... పిల్లలకు ముద్దుల మావయ్య... ఆపదల్లో ఉన్నవారికి వెన్నుతట్టి భరోసానిచ్చే ఆపన్నహస్తం. ఆయనే తెలుగుతేజం కృష్ణతేజ మైలవరపు. కేరళ వరదల్లో సమర్థ విపత్తు నిర్వహణ చేసి దేశం దృష్టిని ఆకర్షించిన తను.. వందల కోట్ల విలువైన అక్రమ కట్టడం క్యాపికో రిసార్ట్‌ని ఒత్తిళ్లకు వెరవకుండా నేలమట్టం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా ఈతరం పలకరిస్తే.. ఆ అనుభవాలు, ఐఏఎస్‌ అయిన వైనం తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే...

‘ఐఏఎస్‌ అయిన తొలిరోజు నుంచే అద్భుతాలు చేస్తున్నావు. ఇదెలా సాధ్యం?’ అని కొందరు సన్నిహితులు అడుగుతుంటారు. ఇందులో నేను చేస్తున్నదేం లేదు. మనస్ఫూర్తిగా నా విధులు నిర్వర్తిస్తున్నానంతే. క్యాపికో రిసార్టు కూల్చివేత సైతం అంతే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేను అమలు చేస్తున్నా. అది వందల కోట్లు విలువైందా? మరొకటా? అన్నది అనవసరం. అదృష్టవశాత్తు కేరళలో అధికారులకు అనువైన వాతావరణం ఉంది. నాయకులు అనవసర విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోరు.

ఐఏఎస్సే ఎందుకంటే..

నేను మొదట్నుంచీ చదువులో టాపర్‌ని. తర్వాత ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయినా ఎందుకో అసంతృప్తి. మా ముత్తాత మైలవరపు గుండయ్య.. జనం కోసం సొంత ఆస్తులు అమ్మి మరీ అభివృద్ధి చేశారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ భవనం, క్లాక్‌టవర్‌, మెయిన్‌రోడ్డు.. వీటన్నింటికీ ఆయన పేరే ఉంటుంది. నాకు తెలియకుండానే బహుశా ఆయన గుణం అబ్బిందేమో. జనాలకు ఏదైనా మంచి చేసే ఉద్యోగం అయితే బాగుండు అనిపించేది. అదేసమయంలో మా కజిన్‌కి సివిల్స్‌ వచ్చింది. అప్పుడే నాకు ఆ సర్వీసుపై అవగాహన కలిగింది. ఆ సమయంలో నా స్నేహితుడు హరిప్రసాద్‌ బాగా ప్రోత్సహించాడు. కానీ మొదటి మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇంక నావల్ల కాదు వెనక్కి వెళ్లిపోదాం అనుకుంటున్న సమయంలో నేనంటే గిట్టనివాళ్లకి ఆ విషయం తెలిసింది. ‘మంచి నిర్ణయం తీసుకున్నావు. నీకు సివిల్స్‌ రాద’ని వేళాకోళమాడారు. నాలో లోపాలేంటో చెప్పారు. దాంతో నాలో పట్టుదల పెరిగింది. హైదరాబాద్‌ వెళ్లి బాలలత గారి మార్గదర్శకత్వంలో నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించాను. ఈ క్రమంలో బాగా లేని నా చేతిరాత మార్చుకోవడానికి ఒక యూకేజీ టీచర్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాను. వ్యాసాల్లో పట్టు సాధించడానికి ఉదయం నాలుగున్నర నుంచి ఏడున్నరవరకు ఒక్కరోజు తప్పకుండా ఏడాదిపాటు పరీక్షలు రాశాను.

ఈ సంతృప్తి కోసమే..

కేరళలో వరదలు వచ్చినప్పుడు రామోజీరావు ఏడెనిమిది కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి ఇచ్చారు. ‘ఒక కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వగలిగితే కొన్ని తరాలకు నీడ కల్పించిన వాళ్లమవుతాం’ అన్నారు. అది నిజం. ఆయనతో ఇచ్చిన డబ్బుతో 120 ఇళ్లు కట్టించి ఇస్తానని మాటిచ్చి, ఎనిమిది నెలల్లో 132 కట్టించాను. అదే సమయంలో సర్వం కోల్పోయిన కొందరు జాలర్లకి కొన్ని సంస్థలను ఒప్పించి ఆరువందల యాభై పడవలు ఇప్పించగలిగాను. ఆ సమయంలో వాళ్ల కళ్లలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. కేరళలో నన్ను పిల్లలంతా ‘కలెక్టర్‌ మామన్‌’ అంటుంటారు. అంటే కలెక్టర్‌ మామయ్య అని. రోజుకి కనీసం 50 మంది పిల్లలైనా వచ్చి నాతో ఫొటో దిగుతారు. అంటే వాళ్లకి నాపై ఎంత అభిమానం ఉండాలి? ఇదంతా సివిల్‌ సర్వెంట్‌ కావడం వల్లేగా! అయితే ఎంత కష్టపడి, మనస్ఫూర్తిగా పని చేసినా ఒక్కోసారి వివాదాల్లో ఇరుక్కుంటాం. ఇవన్నీ విధుల్లో భాగమే అనుకుంటూ ముందుకెళ్తాను. కాలేజీలో ఉన్నప్పుడు నేను ప్రతి పనినీ సరికొత్తగా చేసేవాణ్ని. ఇది ‘కేటీ మార్క్‌’ అనేవాళ్లు. ఐఏఎస్‌ అధికారిగా ఇప్పుడూ ప్రతి పనిని సరికొత్తగా, సృజనాత్మకంగా చేయాలనుకుంటున్నా. ‘భుజాలవరకు వచ్చే నీళ్లలో దిగడం, నిద్రాహారాలు మాని పని చేయడం, ఎప్పుడూ జనం మధ్యలోకి వెళ్లడం అవసరమా?’ అని కొందరంటుంటారు. ఇంతకుముందు ఐటీ కంపెనీలో కుర్చీలో కూర్చొని ఉద్యోగం చేసేవాణ్ని. జీతం చాలా ఎక్కువ. అయినా అది నచ్చకే జనానికి దగ్గరగా ఉండాలనుకున్నా. అందుకే జనాల్లో ఒకడిగానే ఉంటాను. దండాలు పెట్టించుకుంటూ, ఏసీ గదుల్లో కూర్చొని విధులు నిర్వర్తించడం నాకు నచ్చదు.


* విజయం సంతోషాన్నిస్తే ఓటమి జీవితంలో పాఠాలు నేర్పుతుంది.

* ఏమాత్రం తీరిక దొరికినా పుస్తకాలు చదువుతా. కుటుంబంతో గడుపుతా.

* కేజీ నుంచి పీజీదాకా ఇప్పటికీ అందరు క్లాస్‌మేట్స్‌తో టచ్‌లో ఉన్నా.

* ఎప్పుడైనా కుదిరితే సినిమాలు చూస్తా. పవన్‌కల్యాణ్‌ ఇష్టమైన నటుడు.

* ఐఏఎస్‌ అయ్యాకే పెళ్లి చేసుకున్నా. మా ఆవిడ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌. మాకో బాబు.


‘క్యాపికో’ కేరళలోనే అతి విలాసవంతమైన రిసార్టులు. అక్రమార్కులు వేంబనాడ్‌ సరస్సుని అడ్డంగా ఆక్రమించి వాటిని నిర్మించారు. స్థానికులు కొందరు దీనిపై న్యాయస్థానానికి వెళ్లారు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అది అక్రమమని తేల్చాయి. కూల్చమన్నాయి. పెద్దల అండదండలున్నాయని అంతకుముందు అధికారులు జంకారు. ఈమధ్యే జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన కృష్ణతేజ వస్తూనే ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేయిస్తున్నారు. ఈ సాహసోపేతమైన చర్యతో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించారాయన.


ముందుండి నడిపిస్తూ..

* 2018లో కృష్ణతేజ అలెప్పీ సబ్‌ కలెక్టర్‌గా వెళ్లిన కొద్దిరోజులకే కనీవినీ ఎరుగని రీతిలో వరదలొచ్చాయి. వెంటనే రంగంలోకి దిగారు. స్థానిక మంత్రి, అధికారుల సమన్వయంతో.. సమర్థ విపత్తు నిర్వహణ చేస్తూ నాలుగైదు రోజులు అలుపెరుగకుండా శ్రమించారు. రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో ఛాతీ వరకు నీళ్లలో తిరుగుతూ విధులు నిర్వర్తించారు. రెండురోజులు ఇంటిముఖమే చూడలేదు. కృష్ణతేజ పోషించిన పాత్రను అక్కడ పర్యటించిన యూనిసెఫ్‌ ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రశంసించారు.

* వరదల అనంతరం బాధితుల కోసం ‘అయామ్‌ ఫర్‌ అలెప్పీ’ అనే ఫేస్‌బుక్‌ పేజీ ప్రారంభించారు. దెబ్బతిన్న పాఠశాలలు, ఆసుపత్రులను బాగు చేయమంటూ.. బాధితులను ఆదుకొమ్మంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఊహించని స్పందన వచ్చింది. రైతులకు గేదెలివ్వడం, విద్యార్థులకు పుస్తకాలు అందివ్వడం, వికలాంగులకు వీల్‌ఛైర్లు, కృత్రిమ కాళ్లు, హియరింగ్‌ ఎయిడ్‌లు సరఫరా చేయడం.. వృద్ధులకు ప్రత్యేక వైద్యశిబిరాలు పెట్టి మందులివ్వడం.. ఇలా ఎన్నో చేశారు. ‘అయామ్‌ ఫర్‌ అలెప్పీ’ ఇప్పుడు కేరళలోనే పాపులర్‌ నినాదం.

* కృష్ణతేజ కేరళ పర్యటక అభివృద్ధి సంస్థ (కేటీడీసీ)కి రెండేళ్లు ఎండీగా ఉన్నారు. కేటీడీసీకి రెస్టరెంట్లు, స్టార్‌ హోటళ్లలాంటివి చాలా ఉన్నాయి. సరైన నిర్వహణ లేక అన్నీ నష్టాల్లో ఉండేవి. వీటన్నింటినీ ‘మిషన్‌ ఫేస్‌లిఫ్ట్‌’ కార్యక్రమం కింద బాగు చేసి భారీ లాభాల్లోకి తీసుకొచ్చారు. వాటి వ్యాపారం నాలుగు నుంచి పది రెట్లు పెరిగింది. కేరళ అనగానే హౌజ్‌బోట్‌లే గుర్తొస్తాయి. కృష్ణతేజ కేరవాన్‌లు తీసుకొచ్చారు. ఇది పెద్ద సక్సెస్‌ అయ్యింది.

* కేరళ పడవ పందాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. కొవిడ్‌ కారణంగా అలెప్పీలో మూడేళ్ల తర్వాత నిర్వహించారు. దాంతో లక్షలమంది హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి కృష్ణతేజ స్వయంగా ఒక ప్రోటోకాల్‌ తయారు చేశారు. వేడుకల్లో వృద్ధులు, వికలాంగులు, మహిళలు, పిల్లలు, పర్యావరణహితం చూసేలా వేర్వేరుగా కార్యకర్తలను నియమించారు. పెద్ద కార్యక్రమం చిన్న అపశృతి లేకుండా పూర్తి చేశారు. ఈ వలంటీర్లలో కొందరు ట్రాన్స్‌జెండర్‌లు ఉండటం విశేషం. రాష్ట్రంలో ప్రతి పెద్ద కార్యక్రమానికి ఇది నమూనాగా మారింది.

* త్రిసూర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ‘త్రిసూర్‌ సర్క్యూట్‌ టూరిజం’ అనే ప్రాజెక్టు ప్రారంభించాను. యాత్రా ప్రదేశాలను కలుపుతూ చేసిన అభివృద్ధి రాష్ట్రానికే ఓ మోడల్‌గా మారింది. అర్బన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పుడు కృష్ణతేజ చేపట్టిన కార్యక్రమాలతో కేరళ ‘స్పార్క్‌ ర్యాంకింగ్‌’లో అగ్రస్థానంలో నిలిచింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని