Published : 22 Oct 2022 00:10 IST

మార్పు కోసం..మనసైన మార్గంలో!

అనుకోవడానికి, ఆచరించడానికి మధ్య బోలెడు వ్యత్యాసం! మంచి మనసుతోనే మెరుగైన సమాజం తయారవదు... మనసులో ఉన్నది చేతల్లో చూపినప్పుడే ప్రయోజనం...ఆ దిశగానే తమవంతు ప్రయత్నం చేస్తున్నారు ముగ్గురు  యువ తరంగాలు. వారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.


వేరొకరు కష్టాలు పడొద్దని..

పాతికేళ్ల వయసు. ఎయిర్‌ఫోర్స్‌లో కొలువు.. మంచి జీతం. చెప్పాలంటే బిందాస్‌ జీవితం. కానీ హేమంత్‌ కుమార్‌ ఏం చేస్తున్నాడు? తనకొచ్చే ప్రతి సెలవునూ పేద యువతీ యువకుల కోసం వెచ్చిస్తున్నాడు. తాను అలుపెరగకుండా శ్రమిస్తూ.. ఆ పేద కుటుంబాల్లో ఉద్యోగ వెలుగులు నింపుతున్నాడు.
హేమంత్‌ సొంతూరు విజయనగరం జిల్లా పుర్రేయవలస. క్రీడలంటే బాగా ఇష్టం. డిగ్రీ పూర్తయ్యేసరికి జాతీయ స్థాయి అథ్లెట్‌ అయ్యాడు. ఎన్నో విఫల ప్రయత్నాలయ్యాక 2009లో భారత వైమానికదళంలో తను కలలు కనే కొలువు సాధించాడు. కొన్నాళ్లయ్యాక పేదరికం వల్ల తాను ఉద్యోగంలో చేరక ముందు పడ్డ కష్టాలు వేరెవరికీ రాకూడదని భావించాడు. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో 2015 నుంచి నిరుద్యోగ యువతకు దేహదారుఢ్య పరీక్షల్లో ఉచిత శిక్షణనివ్వడం ప్రారంభించాడు. క్రీడల్లో రాటుదేలాలి అనుకునేవారిని.. సైన్యం, పోలీసు కొలువులు కొట్టాలనుకునే ఔత్సాహికులను చేరదీసి ఈ శిక్షణ ఇస్తున్నాడు హేమంత్‌. ఉద్యోగరీత్యా తనకి ఏడాదికి 90 రోజులు అధికారిక సెలవులుంటాయి. సరిహద్దుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండే వైమానిక దళ ఉద్యోగులు.. ఈ సెలవుల్ని కుటుంబంతో కలిసి గడపడానికి, సరదాగా సేద తీరడానికి ఉపయోగిస్తుంటారు. హేమంత్‌ మాత్రం ప్రతి రోజునూ యువతకు శిక్షణనివ్వడానికే వెచ్చిస్తున్నాడు. చీపురుపల్లిలోని జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రోజూ ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు అతడి శిక్షణ ఉంటుంది. ఏడేళ్లుగా తన దగ్గర తర్ఫీదు పొందిన వారిలో దాదాపు వందమంది యువతీయువకులు ఉద్యోగాలు సాధించారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, ఏపీ, తెలంగాణా పోలీసు డిపార్ట్‌మెంట్‌ తదితర విభాగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతిభ చాటారు. ఎంతో విలువైన తన సమయాన్ని కేటాయించడమే కాదు.. మిత్రులు, దాతల సహకారంతో పేద యువతకు అథ్లెట్‌ షూలు, డ్రెస్‌లు సమకూరుస్తున్నాడు హేమంత్‌.


అశ్లీల చిత్రాలు చూడొద్దంటూ..

మధ్యప్రదేశ్‌లో మూడేళ్ల పసిపాపపై పద్నాలుగేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పదేపదే అశ్లీల చిత్రాలు చూడటం వల్లే తను ఈ దారుణానికి ఒడిగట్టాడట. ఈ వార్త భోపాల్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రిషి శుక్లాని కదిలించింది. పోర్న్‌ చిత్రాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దేశవ్యాప్త సైకిల్‌ యాత్ర మొదలుపెట్టాడు.
నీలి చిత్రాలు యువతని నిర్వీర్యం చేస్తున్నాయనేది వాస్తవం. ఈ వ్యసనానికి కొందరు బానిసలై, లైంగిక నేరస్థులుగానూ మారుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు పోర్న్‌సైట్లను ఆపాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. యువతలో స్వతహాగా మార్పు వస్తేనే ఈ జాఢ్యానికి అడ్డుకట్ట పడుతుందనేది రిషి అభిప్రాయం. అందుకే.. అశ్లీల చిత్రాలు చూడటం వల్ల కలిగే చెడుపై కొన్నాళ్లు స్థానిక యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. తర్వాత ‘అవాయిడ్‌ పోర్న్‌.. సేవ్‌ యూత్‌’ పేరుతో దేశవ్యాప్త సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఐదునెలల్లో 14 వేల కిలోమీటర్లు ప్రయాణించి తనవంతుగా యువత ఆలోచనలను మార్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లో ప్రారంభమై చత్తీస్‌గఢ్‌, ఒడిశా దాటి ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కి చేరుకున్నాడు. రిషి రోజుకు 70 నుంచి 120 కిలోమీటర్ల ప్రయాణిస్తున్నాడు. ప్రతి ఊరిలో యువతని సమీకరించి ప్రచారం చేస్తుంటాడు. తాను తలపెట్టిన ఈ యాత్రతో కొద్దిమంది ఆలోచన విధానం మారినా లక్ష్యం నెరవేరినట్టే అంటున్నాడు.


సంచార గ్రంథాలయంగా మారి..

పొద్దస్తమానం చరవాణికి అతుక్కుపోయి సమయం వృథా చేస్తుంటారు కొందరు యూత్‌. ఇలాంటి వారికి పుస్తక పఠనం అలవాటు చేసి, వాళ్లలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రెడ్డి రమణ. దానికోసం తన ద్విచక్రవాహనాన్నే కదిలే గ్రంథాలయంగా మార్చాడు.
విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన రెడ్డి రమణ ఓ ప్రైవేటు కళాశాలలో ఉద్యోగి. మొదట్నుంచీ సమాజానికి ఏదో చేయాలన్న తపన ఎక్కువ. 2005లో మిత్రులతో కలిసి ‘ఆశయ యూత్‌ అసోసియేషన్‌’ ఏర్పాటు చేశాడు. అప్పట్నుంచి రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేల మొక్కలు నాటించాడు. గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలోనే కొంతమంది యువత, విద్యార్థులు సెల్‌ఫోన్లతో గడుపుతూ కాలాన్ని వృథా చేయడం గమనించాడు. వీళ్లని పుస్తక పఠనం వైపు మళ్లిస్తే మార్పు తీసుకురావొచ్చని భావించాడు. ఆ సమయంలోనే రమణ ఓ సంస్థ తరపున తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పర్యటించాడు. అక్కడ గ్రంథాలయాల నిర్వహణను చూసి ఆశ్చర్యపోయాడు. తమిళనాడులోని ఓ ప్రాంతంలో ప్రభుత్వం రూ.75 లక్షలతో గ్రంథాలయాన్ని నిర్మించడమే కాకుండా లక్ష పుస్తకాలు అందుబాటులో ఉంచింది. కేరళలో అయితే మహిళలు పిల్లల్ని చంకనెత్తుకొని గ్రంథాలయాలకు రావడం చూశాడు. ఈ పరిస్థితి విజయనగరంలోనూ రావాలనుకున్నాడు రమణ. పెద లైబ్రరీ ఏర్పాటు చేయాలనుకున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో తన ద్విచక్ర వాహనాన్నే గ్రంథాలయంగా మార్చి మొబైల్‌ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. దీనికోసం రూ.25 వేల వరకు ఖర్చు చేశాడు. ద్విచక్రవాహనానికి పుస్తకాలు వేలాడదీసి వారానికి ఐదారు గ్రామాల్లో పర్యటిస్తున్నాడు. మొదట్లో ఈ బండిని చూసి నవ్వుకున్నవాళ్లే తర్వాత తన దగ్గరికి వచ్చి పుస్తకాలు చదవడం మొదలు పెట్టారు.  

ఇప్పటివరకు 75 గ్రామాల్లో 1,356 కిలోమీటర్లు తిరిగాడు రమణ. తన వాహనంలో 400 వరకు పుస్తకాలు అందుబాటులో ఉంచుతాడు. ఇందులో ఆధ్యాత్మికం, నీతి కథలు, పంచతంత్రం, వివేకానందుడి బోధనలు, పోటీ పరీక్షలకు సంబంధించినవి.. అన్నీ ఉంటాయి. విద్యార్థులకైతే పుస్తకాలు ఇవ్వడమే కాకుండా వాటిపై సమీక్షలూ రాయిస్తుంటాడు. బాగా రాసిన వారికి బహుమతులూ ఇస్తుంటాడు. పుస్తక పఠనంతో యువత సన్మార్గంలో నడుస్తుందని, ప్రతీ గ్రామానికి ఓ గ్రంథాలయం ఉండాలనేది రమణ కోరిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు