ఆశయం, ఆవిష్కరణ సమాజహితమే!

ఒకవైపు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి... ‘ఈ పని అనాగరికం’ అని స్వచ్ఛంద సంస్థలు గొంతు చించుకుంటున్నాయి... తీరు మారాలంటూ న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నాయి...

Published : 12 Nov 2022 00:20 IST

ఒకవైపు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి... ‘ఈ పని అనాగరికం’ అని స్వచ్ఛంద సంస్థలు గొంతు చించుకుంటున్నాయి... తీరు మారాలంటూ న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నాయి... అయినా మ్యాన్‌హోల్స్‌ని మనుషులే శుభ్రం చేసే దుస్థితి తప్పడం లేదు... హైదరాబాద్‌, చెన్నై, ముంబయి.. నగరం ఏదైనా ఇదే పరిస్థితి... దీనికి పరిష్కారం చూపే ప్రయత్నం చేసింది ఐఐటీ మద్రాసులోని ఓ యువబృందం... వారితో మాట కలిపింది ఈతరం.

దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో మ్యాన్‌హోళ్లని శుభ్రం చేసే క్రమంలో విషవాయువుల్ని పీల్చి 2019లో 110 మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాత పడ్డారు. ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ ఘోరాల్ని కోర్టులూ తప్పు పడుతూనే ఉన్నాయి. అయినా పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ అదే తీరు. ఈ విధానానికి చెక్‌ పెట్టేలా, కార్మికులకి ప్రత్యామ్నాయంగా పని చేసేలా ‘సెప్టిక్‌ ట్యాంక్‌ రోబో’ అనే వినూత్న ఆవిష్కరణ చేశారు ఈ యువ ఆవిష్కర్తలు.

అంకురం అక్కడే...

ఐఐటీ మద్రాసులో ‘సోలినాస్‌ ఇంటిగ్రిటీ’ పేరుతో ఒక ఇంక్యుబేషన్‌ కేంద్రం ఉంది. అక్కడ దాదాపు యాభైమంది యువతీ యువకులు కొత్త ఆవిష్కరణల కోసం అలుపెరుగక శ్రమిస్తుంటారు. ఆ కేంద్రంలోనే రిమోట్‌ కంట్రోల్‌ రోబో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా సెప్టిక్‌ ట్యాంక్‌ రోబో తయారు చేశారు. విధిలో ప్రాణాలు కోల్పోతున్న పారిశుద్ధ్య కార్మికుల చావులను ఆపడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశం అంటున్నారు. ఈ నమూనా రోబోను తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు కార్పొరేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లోని కొన్ని పురపాలికలు ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు సిద్ధమయ్యాయి.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి దివాన్షు కుమార్‌ ‘సోలినాస్‌ ఇంటిగ్రిటీ’ ప్రారంభించాడు. సరికొత్త ఆవిష్కరణలు చేసే అంకుర సంస్థ ఇది. ఈ క్రమంలో క్యాంపస్‌లోని సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ కేంద్రంలోని ప్రొఫెసర్‌ ప్రభు రాజగోపాల్‌ను కలిశాడు. ఆయన సలహాతో మ్యాన్‌హోల్‌లోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న కార్మికులకు మేలు చేసేలా ఒక యంత్రం రూపొందించాలనుకున్నాడు. దాదాపు రెండేళ్లు శ్రమించి ఒక రోబోకు రూపం ఇచ్చాడు దివాన్షు. ఈ ప్రొటోటైప్‌ని 2019లో ప్రదర్శిస్తే.. అది క్యాంపస్‌ ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది. అప్పట్లో ఐఐటీ మద్రాసు సందర్శించిన ప్రధాని మోదీ.. ఈ ఆవిష్కరణ గురించి విని.. దివాన్షుకు తన చేతుల మీదుగా అవార్డు ఇచ్చి సత్కరించారు. ఆ ఉత్సాహంతో యంత్రాలను పెద్దఎత్తున తయారు చేయాలనుకున్నాడు. తనకి భవేష్‌ నారాయణి, మొయినాక్‌ బెనర్జీ, లిండా జాస్లిన్‌ లాంటి యువ నిపుణులు తోడయ్యారు. హైదరాబాద్‌ యువకుడు ఫణీంద్ర తేజ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా చేరాడు. క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా మలచాలంటే భారీగా ఖర్చవుతుందని భావించారు. ఐఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రం సాయంతో కొన్ని కంపెనీల ద్వారా రూ.4.5కోట్ల నిధులు సేకరించారు. పని మొదలు కాగానే కరోనా వచ్చిపడింది. చాలా ఇబ్బందులొచ్చాయి. అయినా వాటన్నింటినీ తట్టుకొని ‘సిపాయ్‌ రోబో’ పేరుతో యంత్రాన్ని ఆవిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులు దీనిలో కొన్ని లోపాలు ఎత్తి చూపారు. మళ్లీ వాటిని సవరించి చివరికి ఆ రోబో పేరుని ‘హోమోసెప్‌’గా మార్చారు. ఇది ఏడు మీటర్ల లోతుకు వెళ్లి కూడా డ్రైనేజీ లైన్లను శుభ్రం చేస్తుంది. లోపల స్తంభించిన మురుగును ఛిద్రం చేస్తుంది. మ్యాన్‌హోల్‌ పరిమాణానికి అనుగుణంగా చిన్న, పెద్ద సైజు బ్లేడులను అమర్చుకోవచ్చు. లోపలికి వెళ్లగానే ఈ బ్లేడ్‌లు గొడుగులా విచ్చుకుంటాయి. పైకి రాగానే ముడుచుకుంటాయి. ఈ యంత్రాన్ని ఒక ట్రాక్టర్‌కి అమర్చి ఎక్కడికైనా తరలించవచ్చు. ఈ యాంత్రిక వ్యవస్థ మొత్తం రిమోట్‌, గేర్ల సాయంతో పని చేస్తుంది. ఈ డిజైన్‌కు పేటెంట్‌ సైతం దక్కింది. మరోవైపు నీటి పైపులైన్ల లీకేజీల్ని అరికట్టేందుకు పైపుల్లోకి పంపే చిన్న రోబోల్ని సైతం వీరు తయారు చేశారు.

కార్మికులకు మేలు చేసేలా..

ప్రస్తుతం ఒక్కో రోబో తయారీకి రూ.4 లక్షలు ఖర్చవుతోంది. వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తే రూ.2 లక్షలకు తీసుకు రావొచ్చు అంటోంది యువబృందం. ఈ అరుదైన ఆవిష్కరణకు 2020లో ‘ఇండియా స్మార్ట్‌గ్రిడ్‌ ఫోరమ్‌’ అవార్డు గెలుచుకున్నారు. మహారాష్ట్రలో నిర్వహించిన స్టార్టప్‌ వీక్‌లో విజేతలుగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వం సోలినాస్‌ ఇంటిగ్రిటీని ఉత్తమ స్టార్టప్‌లలో ఒకటిగా గుర్తించింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఈ ఆవిష్కరణ ద్వారా ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ముందు ఉపయోగ పడేలా చేయాలి అనుకుంటున్నారు ఆవిష్కర్తలు. త్వరలోనే 20మంది వితంతు మహిళలకు ‘హోమోసెప్‌’ రోబోల్ని అందిస్తున్నారు.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని