క్యాండిల్‌ లైట్‌ డిన్నరా?

క్యాండిల్‌ లైట్లలో ప్రేమికుల డిన్నర్లు.. డిమ్‌లైట్‌ వెలుతురులో స్నేహితుల పార్టీలు.. ఈ కాలంలో ఎక్కువే. అసలే యూత్‌ కదా.. ఎవరి రుచి వాళ్లది.

Updated : 12 Nov 2022 03:48 IST

క్యాండిల్‌ లైట్లలో ప్రేమికుల డిన్నర్లు.. డిమ్‌లైట్‌ వెలుతురులో స్నేహితుల పార్టీలు.. ఈ కాలంలో ఎక్కువే. అసలే యూత్‌ కదా.. ఎవరి రుచి వాళ్లది. కానీ ఇలాంటి వాతావరణంలో తినేవాళ్లలో ఆకలి మందగించడం, కేలరీల ఆహారం అత్యధికంగా లాగించడం జరుగుతుందనే ఓ కొత్త విషయం బయటికొచ్చింది.

ధ్యయనవేత్తలు చెబుతున్న సంగతి ఏంటంటే.. ప్రశాంతమైన వాతావరణం, ఎదురుగా మనసుకి నచ్చేవాళ్లు, మసక చీకటి, మంద్రమైన సంగీతం వింటూ కూర్చుంటే.. ఆటోమేటిగ్గా ఉత్సాహకరమైన మూడ్‌లోకి వెళ్లిపోతుంటారు ఎవరైనా. సంగీతం, పరిసరాలు, ఎదురుగా కూర్చున్న వ్యక్తులపైకి మనసు వెళ్లినప్పుడు కడుపు నిండిన భావన కలిగి ఆకలిపై ధ్యాస తగ్గుతుంది. సో.. సాధారణంగా తినేదానికన్నా తక్కువగా లాగిస్తాం. మరో పరిస్థితి ఏంటంటే.. మన చుట్టుపక్కల వెలుతురు తక్కువ అయినప్పుడు ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందనే ఉద్దేశంతో మెదడు చురుగ్గా పని చేయడం మొదలు పెడుతుందట. ఆ సమయంలో ఎంత ఆహారం కావాలో సరిగా అంచనా వేయదు. అసౌకర్యంగా ఫీలైనప్పుడు శరీరంలో కొన్నిరకాల రసాయనాలు విడుదలవుతాయి. వాటి ప్రభావంతో కేలరీలు ఎక్కువ ఉండే ఆహారం తినాలని మెదడు సంకేతాలు పంపిస్తుంది. అధ్యయనంలో తేలిందేంటంటే.. డిమ్‌లైట్లు ఉన్న రెస్టరెంట్లు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో కూర్చొని తినేవాళ్లు 39శాతం అత్యధిక కేలరీల ఆహారం తీసుకుంటున్నారట. మొత్తానికి వెలుతురులేమిలో తినడం వల్ల రెండురకాల అనర్థాలున్నాయని తేల్చారు. మాసానికో, పక్షానికో ఓసారి అయితే ఫర్వాలేదుగానీ.. తరచూ చీకట్లో, మసక వెలుతురు, అర్ధరాత్రుళ్లు తినడం అలవాటుగా మలచుకున్నవారు ఈ పద్ధతి వెంటనే మానేయడం మంచిదంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని