Published : 12 Nov 2022 00:20 IST

అడుగేద్దాం.. ఆఫీసుకిలా..

ఉద్యోగం తొలిరోజు ఎవరికైనా జీవితంలో ఓ కీలక ఘట్టమే. దీన్ని హడావుడి, గాబరా పడే సందర్భంలా కాకుండా ఓ మధుర జ్ఞాపకంలా మలచుకోవాలంటే ఇలా చేయాల్సిందే.

* వస్త్రధారణ: ఆఫీసుకి చిరుగుల జీన్స్‌, చింపిరి జుట్టుతో వెళ్తానంటే కుదరదు. మీరు కాలేజీ క్యాంపస్‌ దాటి వచ్చేశారనే సంగతి మరవొద్దు. వస్త్రధారణ హుందాగా ఉండాలి. సంస్థ డ్రెస్‌కోడ్‌ పాటించాలి. లేదంటే ఫార్మల్‌, క్యాజువల్స్‌ అయినా ఫర్వాలేదు.
* సమయపాలన: డుమ్మా కొట్టడంలాంటి చేష్టలు కాలేజీ గుమ్మం దగ్గరే వదిలి పెట్టేస్తే మంచిది. సమయం విషయంలో క్రమశిక్షణ పాటించే అలవాటున్నవాళ్లకు బాస్‌ దగ్గర మంచి మార్కులు పడతాయి. అది మొదటిరోజు నుంచే పాటిస్తే మరీ మంచిది. ట్రాఫిక్‌ రద్దీ, ఇతర వ్యాపకాలకు అనుగుణంగా ముందే సిద్ధం కావాలి.
* పరిచయం: కొత్తవాళ్లు ఆఫీసుకొస్తున్నారంటే అందరి చూపూ మనపైనే ఉంటుంది. వాళ్ల కోరిక నెరవేరేలా మనమే వెళ్లి అందరినీ పరిచయం చేసుకోవడం మంచి పద్ధతి. సహోద్యోగులు, కొత్త వాతావరణం, కొత్త మనుషుల మధ్య గాబరా పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ముందే ప్రిపేర్‌ కావాలి.
* కలుపుగోలు: వెళ్లగానే మూతి ముడుచుకొని కూర్చుంటే పనులు కావు. అనవసర గాసిప్‌ల జోలికి వెళ్లొద్దుగానీ.. ఎవరి పని ఎలాంటిది? ఎవరేం చేస్తారు? సందేహాలు వస్తే ఎవరిని అడగాలి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ముఖంపై చిరునవ్వు చెరగనీయకుండా పలకరింపులు సాగితే సగం విజయం సాధించినట్టే.
* అదనపు సమాచారం: మనం చేయబోయే పని, ఆఫీసు వివరాలు ముందే తెలుసుకొని ఉంటే ఇంకా మంచిది. ఉద్యోగంలో చేరేరోజు ఈ వివరాలు చెప్పాల్సిన సందర్భం వస్తే.. పైస్థాయి అధికారులకు మనపై సదభిప్రాయం కలుగుతుంది.
* లక్ష్యాలు: మనం ఎలా ఉండాలి? ఎలా సంస్థను మెప్పించాలి.. లక్ష్యాలేంటి? తొలిరోజు నుంచే ఓ క్లారిటీ ఉంటే మనకిక తిరుగుండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts