గడ్డు కాలాన్ని అడ్డుకునేలా...!

ఆర్థిక మాంద్యం తరుముకొస్తుందంటున్నారు...పెద్దపెద్ద సంస్థలు కొలువుల కోతలూ మొదలెట్టేశాయి... లేఆఫ్‌లంటూ కొన్ని కంపెనీలు జీతాలు తెగ్గోస్తున్నాయి..

Published : 26 Nov 2022 00:01 IST

ఆర్థిక మాంద్యం తరుముకొస్తుందంటున్నారు...పెద్దపెద్ద సంస్థలు కొలువుల కోతలూ మొదలెట్టేశాయి... లేఆఫ్‌లంటూ కొన్ని కంపెనీలు జీతాలు తెగ్గోస్తున్నాయి...ఈ నేపథ్యంలో ఉద్యోగులు ‘కెరియర్‌ కుషనింగ్‌’ బాట పడుతున్నారు. గడ్డుకాలంలో.. ఇది కష్టాలను దాటించే మార్గమంటున్నారు. అసలు ఏంటీ ట్రెండ్‌? దీన్నెలా అందిపుచ్చుకోవాలి? కష్టకాలంలో యువత ఆర్థిక మాంద్యాన్ని ఎలా ఎదుర్కొనాలి? నిపుణులు చెబుతున్నదేంటంటే..

యువత అంటేనే సరదాలు, జల్సాలకు చిరునామా. పాకెట్‌ నిండుగా ఉంటే రాకెట్‌ వేగంతో ఖర్చు పెట్టేస్తుంటారు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు సరే.. ఉద్యోగం కోల్పోతే సంగతేంటి? జిందగీ ముందుకెళ్లే దారేంటీ? సమయం బాగా లేనప్పుడు సరదాల్ని ఎలాగో వాయిదా వేసుకోగలం గానీ.. కట్టాల్సిన బ్యాంకు వాయిదాలు, అత్యవసర ఖర్చులు, నెట్‌, ఫోన్‌ బిల్లుల్ని సర్దుకోవడం ఎలా? దీనికి ముందుచూపు పరిష్కారాన్నే కెరియర్‌ కుషనింగ్‌ అంటున్నారు.

ఏంటీ భావన?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. ఆపద ఎదురయ్యే దుస్థితిని ముందే గ్రహించి ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవడం.. ఈ కొలువు పోయినా వేరొకదాంట్లో కుదురుకోవడానికి రంగం సిద్ధం చేసుకోవడమే కెరియర్‌ కుషనింగ్‌. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్యం, రెండేళ్ల కిందట విరుచుకుపడ్డ కరోనా అనుభవాలతో.. యువ ఉద్యోగులు ఈ ధోరణిని ఆకళింపు చేసుకుంటున్నారు. గతంలోలా కాకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగమే శాశ్వతం అనే భావన వీడుతున్నారు. అంతా సవ్యంగా ఉన్నప్పుడే ఏమరుపాటు వదిలి జాబ్‌ పోర్టళ్లలో వివరాలు నమోదు చేసుకోవడం, ఇతర సంస్థల్లో పనిచేసే స్నేహితులు, నెట్‌వర్క్‌లతో టచ్‌లో ఉండటం.. ఇతర రంగాల్లోనూ నైపుణ్యాలు పెంచుకోవడం.. సామాజిక మాధ్యమాల్లోని ఉద్యోగార్థుల గ్రూపుల్లో చేరడం.. భద్రత లేని కొలువులు మారే ప్రయత్నం చేయడం.. దీనిలో భాగమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఉద్యోగం మారడం, కొలువు వదిలేయడానికి సిద్ధంగా ఉండటమే కెరియర్‌ కుషనింగ్‌. ప్రముఖ ఉద్యోగ కల్పనా వెబ్‌సైట్‌ లింక్డ్‌ఇన్‌ అధ్యయనం ప్రకారం ఆర్థిక మాంద్యం విరుచుకుపడ్డా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలో 44శాతం మంది దీమాగా చెప్పారు.

పొదుపు బాట

సరదాలు మితిమీరితే దుబారాగా మారతాయి. యువతలో ఇది ఎక్కువ. రాబోయేది గడ్డుకాలం కాబట్టి ఉన్నదాంతో సర్దుకుపోయే మనస్తత్వం అలవాటు చేసుకోవాలి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఇది అలవాటుగా మారితే ఆర్థిక మాంద్యం మనల్ని పెద్దగా బాధించదు.

ప్రయత్నాలొద్దు

అసలే గడ్డుకాలం. ఈ సమయంలో కంపెనీలు మారడం, కొత్త బాధ్యతలు తలకెత్తుకునే పోస్టుల్లోకి వెళ్లడం సరికాదు. వెళ్లిన కొత్తచోట మీరు పని సామర్థ్యాన్ని సమర్థంగా నిరూపించుకోలేక పోతే.. వేటు పడే తొలి జాబితాలో మీ పేరే ఉండొచ్చు.

ముందుచూపు

నాకేం.. మంచి జీతం.. నచ్చిన హోదా.. అని ఏమరుపాటుగా ఉండొద్దు. ఏదీ శాశ్వతం కాదు. మంచి ఉద్యోగంలో కుదురు కొని ఉన్నా.. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తుండాలి. ఉద్యోగం కోల్పోయినా రెండో సంపాదనైనా ఆదుకుంటుంది.


ఏం చేయాలి?

కీడెంచి మేలెంచాలంటారు. ఇప్పుడు మంచి ప్రయత్నాలే చేస్తున్నా.. అసలు ఆర్థికమాంద్యం వచ్చినా గట్టెక్కేలా మనం ఎలా సన్నద్ధం కావాలో నిపుణులు చెబున్నారు.


వాటి జోలికి వద్దు

ఈ సమయంలో భారీ మొత్తంలో ఖర్చయ్యే కొనుగోళ్లు ఏవీ చేయొద్దు. ఇల్లు బంగారం, వాహనాలు, స్థలం కొనడం.. వంటి వాటిని వాయిదాల్లోకి మార్చుకోవడం అస్సలు చేయొద్దు. ఖర్మకాలి జాబ్‌ పోతే.. అనవసర చిక్కుల్లో పడిపోతాం.

అత్యవసరాల్లో

అంతా బాగున్నప్పుడు పర్సు బరువుగానే ఉంటుంది. పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పలేం. ఆర్థికమాంద్యమే కాదు.. అనారోగ్యం, ప్రమాదంలాంటి అనుకోని ఉత్పాతం సంభవించినా తట్టుకునేలా మన దగ్గర ఒక అత్యవసర నిధి ఉండాలి. కనీసం ఆరునెలల జీతమైనా ఈ ‘ఎమర్జెన్సీ ఫండ్‌’ కింద దాచుకోవాలంటారు. కొలువు పోయినా పరిస్థితి కుదుట పడేదాకా ఈ నిధి ఆదుకుంటుంది.

మిగుల్చుకుందాం

సమయం సవ్యంగా ఉన్నప్పుడే దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో మదుపు చేస్తుండాలి. పరిస్థితి బాగా లేనప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు ఈ మొత్తం అక్కరకొస్తుంది.

నైపుణ్యాలు

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే ఇది శాశ్వతం కాదు అనుకోవాలి.  మూస ధోరణిలో పని చేసేవాళ్ల పట్ల సంస్థకి సదభిప్రాయం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు.. సామర్థ్యాల్ని మెరుగు పరచుకోవాలి. మల్టీ టాస్కింగ్‌ చేయగల నేర్పు సంపాదించాలి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కొత్త నైపుణ్యాలు పెంచుకోవాలి.

వేచి చూద్దాం

మాంద్యం విరుచుపడితే అన్ని వ్యాపారాలూ కుదేలవుతాయి. పెట్టుబడి ఉంది కదాని.. ఈ సమయంలో వ్యాపారం, స్టార్టప్‌ ప్రారంభించే ప్రయత్నం చేయొద్దు. నష్టాల బారిన పడతాం. పెట్టుబడి ఉంటే తగిన సమయం కోసం ఎదురుచూస్తుండాలి.

ఇదే ముగింపు కాదు

ప్రతిభ ఉన్నవాళ్లు, కష్టపడి పని చేసేవాళ్లు, బహుళ నైపుణ్యాలు ఉన్నవాళ్లకు ఆర్థిక మాంద్యమే కాదు.. ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురైనా వచ్చిన ఇబ్బందేం ఉండదు. మూత పడితే తప్ప మంచి ఉద్యోగిని వదులుకోవడానికి ఏ సంస్థా సిద్ధపడదు. ఆ నమ్మకం వాళ్లలో కలగాలంటే మీరు వృత్తి నైపుణ్యం చూపిస్తుండాలి. దురదృష్టవశాత్తు ఉద్యోగం కోల్పోయినా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఉద్యోగం నుంచి తొలగించినా, లేఆఫ్‌ల పేరుతో జీతాల్లో కోత వేసినా సిద్ధంగా ఉండాలి. పని చేస్తున్నప్పుడు ఎలాగూ విరామం తీసుకోవడానికి వీలుండదు. ఈ బ్రేక్‌ని సద్వినియోగం చేసుకోవాలి. నైపుణ్యాలు పెంచుకోవాలి. దీన్ని ఒక పాఠంలా భావించి మనల్ని మనం రీడిజైన్‌ చేసుకోవాలి. ఒకచోట అవకాశం కోల్పోయినా మరోచోట ఉంటుందనే ఆశావహ దృక్పథంతో ఉండాలి. మనకున్న నైపుణ్యాలు, అనుభవంతో వేరే ఎక్కడైనా అవకాశాలున్నాయో ప్రయత్నించాలి. అవసరమైతే డిమాండ్‌ అధికంగా ఉన్న వేరే రంగంలోకి మారడానికి సిద్ధంగా ఉండాలి. సాధారణంగా కళాశాల నుంచి బయటికి రాగానే.. ఏదో ఒక ఉద్యోగంలో చేరితే చాలు అనుకుంటారు చాలామంది. కొన్ని కంపెనీలు ఏదో ఒక ప్రాజెక్టు రాగానే పెద్దఎత్తున ఉద్యోగులను నియమించుకుంటాయి. అవసరం తీరగానే తొలగిస్తుంటాయి. ఆర్థిక మాంద్యంలో ఇలాంటివి ఎక్కువ. అందుకే సంస్థలో చేరే ముందే దాని నేపథ్యం, ఆర్థిక బలం, స్థిరత్వం.. ఇవన్నీ చూడాలి. సీనియర్‌ ఉద్యోగుల సలహాలు తీసుకోవాలి. త్వరగా నేర్చుకోగలగడం, నేర్చుకున్నది అమల్లో పెట్టడం, అవసరమైతే నేర్చుకున్నది మర్చిపోయి కొత్త బాట పట్టడం ప్రతి ఉద్యోగికీ ఉండాల్సిన ముఖ్య లక్షణం.

- ప్రొ.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని