డేటింగ్‌ యాప్‌సోపాలు

ఎవరు ఔనన్నాకాదన్నా.. డేటింగ్‌ యాప్‌లతో కాలం వెళ్లదీసే కుర్రకారు ఈరోజుల్లో ఎక్కువే. సెల్‌ఫోన్లలో పదులకొద్దీ ఈ అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేసుకొని వలపు సందేశాల వల విసురుతూనే ఉంటారు.

Published : 21 Jan 2023 00:20 IST

ఎవరు ఔనన్నాకాదన్నా.. డేటింగ్‌ యాప్‌లతో కాలం వెళ్లదీసే కుర్రకారు ఈరోజుల్లో ఎక్కువే. సెల్‌ఫోన్లలో పదులకొద్దీ ఈ అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేసుకొని వలపు సందేశాల వల విసురుతూనే ఉంటారు. చెలికాడు, ప్రియసఖిని జత చేసే ఈ యాప్‌ల వాడకం ఎక్కువైతే యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటున్నాయి తాజా అధ్యయనాలు.

* టిండర్‌, బంబుల్‌, మై థాట్స్‌... ఇలాంటి డేటింగ్‌ యాప్‌లలోకి ప్రవేశించగానే జోడు కోసం ఎదురుచూసే వాళ్లు కుప్పలకొద్దీ కనిపిస్తుంటారు. అందులో ఎవరిని ఎంచుకోవాలో తెలియక కొందరు ఒత్తిడికి కూడా గురవుతుంటారట. ఒకేసమయంలో నలుగురైదుగురితో డేటింగ్‌ మొదలుపెట్టి.. మభ్యపెట్టి.. సమయం కేటాయించలేక తెగ హైరానా పడిపోతుంటారట.
* యాప్‌లో ఒక ఫొటో పెట్టగానే అవతలివాళ్లకు నేను నచ్చుతానో, లేదో.. నన్నెవరైనా ఇష్టపడతారో, లేదో.. అనుకుంటూ ఆందోళనకు గురయ్యేవాళ్లు తక్కువేం కాదు. ముఖ్యంగా ఈ మనస్తత్వం అమ్మాయిల్లో ఎక్కువ. అదేపనిగా ఫొటోలు దిగడం, పోజులివ్వడం.. వెరసి ‘బాడీ డిస్మార్ఫియా’ అనే మానసిక రోగం బారిన పడే అవకాశమూ ఉందంటున్నారు.
* నచ్చనివాళ్లను ‘రిజెక్ట్‌’ చేసే ఫీచర్‌ డేటింగ్‌ యాప్‌లలో ఉంటుంది. ఇలా ఎక్కువసార్లు నిరాదరణకు గురైన అమ్మాయిలు, అబ్బాయిల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు. ప్రొఫైల్‌ని, ఫొటోలను మార్చి మార్చి.. ‘ఇంక నన్నెవరూ ఇష్టపడరులే’ అనుకొని బాధ పడేవాళ్లకీ కొదవలేదు.
* డేటింగ్‌ యాప్‌లలో నకిలీ వివరాలతో ఇతరులను మోసం చేసేవాళ్లూ తక్కువేం కాదంటున్నాయి అధ్యయనాలు. పెళ్లి కాలేదని అబద్ధమాడటం, ఇతరుల ఫొటోలను తమవిగా చెప్పుకోవడం, ఎదుటివాళ్లు కొంచెం నమ్మగానే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కి దిగడం.. ఇలాంటివన్నీ ఈమధ్యకాలంలోనే ఎక్కువగానే జరుగుతున్నాయి.
* చిన్న వయసులోనే రొమాన్స్‌, ఎక్కువమందితో రిలేషన్‌లో ఉండటం.. ఇవన్నీ సమాజం ఆమోదించని చర్యలు. వీటితో కుటుంబాల్లో కలతలు చోటు చేసుకుంటున్నాయి. అనుబంధాలు బీటలువారుతున్నాయి.

* యువతలో మానసిక ఒత్తిళ్లు దరి చేరకుండా ఉండాలంటే.. అనవసర చిక్కుల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే..ఈ డేటింగ్‌ యాప్‌లను ఫోన్‌ నుంచి తొలగించడమే మేలంటున్నారు మానసిక నిపుణులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని