shubman gill: ఆట దూకుడు.. ప్రేమ రాకుమారుడు!

చూడ్డానికి మిల్కీబాయ్‌లా ఉన్నా.. అతడు బ్యాటు పడితే విధ్వంసమే! 23 ఏళ్లకే వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదేసిన శుభ్‌మన్‌ గిల్‌ ఉపోద్ఘాతం ఇది.

Updated : 21 Jan 2023 10:18 IST

చూడ్డానికి మిల్కీబాయ్‌లా ఉన్నా.. అతడు బ్యాటు పడితే విధ్వంసమే! 23 ఏళ్లకే వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదేసిన శుభ్‌మన్‌ గిల్‌ ఉపోద్ఘాతం ఇది. ఈ రికార్డుల వెనక బోలెడు కష్టం ఉంది. ఆ సంగతేంటో తెలుసుకుంటూనే..ఈ నయా సెన్సేషన్‌ కబుర్లు ఇంకొన్ని చెప్పుకుందాం.

* నాన్న స్ఫూర్తితో..: సెప్టెంబరు 8, 1999లో పంజాబ్‌లోని ఫజ్లీకా అనే చిన్న పట్టణం పక్కనున్న పల్లెటూరులో పుట్టాడు శుభ్‌మన్‌. తోటి పిల్లలంతా బొమ్మలు కావాలని మారాం చేస్తుంటే.. తను మాత్రం బంతి, బ్యాటు కావాలని గోల చేసేవాడట. వాటినే పక్కలో పెట్టుకొని నిద్ర పోయేంత ఇష్టం! శుభ్‌మన్‌ నాన్న క్రికెటర్‌ కావాలని కలలు కన్నా.. పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో కొడుకు రూపంలో ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకున్నారు. తన పొలాన్ని చదును చేసి దాన్ని మైదానంగా మార్చేశారు. కొడుకు బ్యాటు పడితే పొద్దంతా బంతులు వేసేవారు. ‘మావాడ్ని ఔట్‌ చేస్తే వంద రూపాయలిస్తా’నంటూ ఊరి కుర్రాళ్లతో సవాల్‌ విసిరేవారు. ఆఖరికి కొడుకు కోసం.. ఊళ్లో ఉన్నదంతా అమ్మేసి మొహాలికి వలస వచ్చారు. నాన్న త్యాగం వృథా పోనివ్వొద్దు అనుకున్నాడు శుభ్‌మన్‌. రోజుకి ఐదారు గంటలు సాధన చేసేవాడు.

*వెలుగులోకి: అండర్‌-16 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టోర్నమెంట్‌లో ఏకంగా 351 పరుగులు చేయడంతో గిల్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తొలి వికెట్‌కి 587 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. యూత్‌ క్రికెట్‌లో 104.45 సగటుతో 1149 పరుగులుచేశాడు. ఈ రికార్డులతో చిన్న వయసులోనే జాతీయ జట్టులోకి వేగంగా దూసుకొచ్చాడు. ఈ ఊపులో ఆటా? చదువా? అనే సంశయం ఏర్పడితే పుస్తకాల్ని పక్కన పెట్టేసి క్రికెట్‌కే జై కొట్టాడు.

* జేబులో రుమాలు: బ్యాటుతో పరుగుల వరద పారిస్తున్నా.. తనకి కొన్ని నమ్మకాలున్నాయి. ఓసారి అండర్‌-16 మ్యాచ్‌లో ఆడేటప్పుడు జేబులో తెల్ల రంగు రుమాలు పెట్టుకొని వెళ్లాడట. అప్పుడు సెంచరీ చేశాడు. అప్పట్నుంచి మైదానంలోకి వెళ్లే ప్రతిసారీ దాన్నే కొనసాగిస్తున్నాడు. కాకపోతే ఈ మధ్యలో తెలుపు రంగుకి బదులు ఎరుపు రంగుకి మారాడు.

* ప్రేమాయణం: ఆటలోనే కాదు.. ప్రేమాటలోనూ శుభ్‌మన్‌ ముందే. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కూతురు సారాతో తను పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అప్పట్లు వార్తలు షికారు చేశాయి. అది నిజమా అన్నట్టు.. వాళ్లిద్దరు కలిసి ఒక రెస్టరంట్‌లో కలిసి తింటున్న ఫొటోలు బయటికొచ్చాయి. తర్వాత వాళ్లు విడిపోయారు. ఇన్‌స్టాలో ఒకరికొకరు అన్‌ఫాలో కూడా అయ్యారు. ఈ మధ్య సారా అలీఖాన్‌తో డేటింగ్‌ చేస్తున్నాడనే రూమర్లు వినిపిస్తున్నాయి.

దురుసుతనం: మైదానంలోనూ గిల్‌ది దూకుడు మనస్తత్వమే. రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో సహచర క్రికెటర్లతో రెండుసార్లు దురుసుగా వ్యవహరించాడు. అంతకుముందు ఇంగ్లండ్‌ వన్డేలో అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసి మ్యాచ్‌ ఫీజు కోల్పోయాడు.  


ముద్దుపేరు: శుభి
ఆరాధించేది: సచిన్‌ తెందుల్కర్‌
బెస్ట్‌ ఫ్రెండ్‌: ఇషాన్‌ కిషన్‌
బాగా ఇష్టపడేది: అక్క షెహ్‌నీల్‌ కౌర్‌ గిల్‌ని
మొదటి కోచ్‌: భార్‌తీ విజ్‌
అభిమానించేది: సొంతూరు, సొంత పొలం
ఐపీఎల్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌
మర్చిపోలేని ప్రశంస: నీ బ్యాటింగ్‌ స్టైల్‌ అమోఘం. నువ్వు స్టార్‌వి అవుతావు అని రాహుల్‌ద్రావిడ్‌ నాలుగేళ్ల కిందట మెచ్చుకోవడం.
ఇన్‌స్టా ఫాలోయర్లు: 25లక్షలు
మోజు: కార్లంటే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని